ఈ సినిమాతో...ఆ భయాలన్నీ పోయాయి!

ఈ సినిమాతో...ఆ భయాలన్నీ పోయాయి!


‘బాహుబలి’లో నటించే అవకాశం రావడం నా అదృష్టం’’ అంటున్నారు తమన్నా. భారతీయ సినీ ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారనీ, తాను కూడా ఎంతో ఉత్కంఠ ఫీలవుతున్నాననీ తమన్నా చెబుతున్నారు. ‘బాహుబలి’ గురించి తమన్నా చెప్పిన బోలెడన్ని విశేషాల నుంచి...

 

  ఈ పదేళ్లల్లో మీరు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు.. ‘బాహుబలి’ మరో ఎత్తు. ఏమంటారు?

 అవునండి. ఇలాంటి సినిమా వచ్చి చాలా ఏళ్లయ్యింది. భవిష్యత్తులో వస్తుందో లేదో తెలియదు. వచ్చినా నాకు అవకాశం వస్తుందో, లేదో చెప్పలేను. ఇలాంటి చిత్రాల వల్లే మన భారతీయ సినిమా ప్రపంచ స్థాయి వరకూ వెళుతుందని చెప్పొచ్చు. ఇది తెలుగు సినిమాకి గర్వకారణం.

 

  ఈ చిత్రం మొదలైన ఏడాదికి మిమ్మల్ని తీసుకున్నారు కదా. మరి ఇతర తారల్లా మీకు ట్రైనింగ్ తీసుకోవడానికి టైమ్ దొరికిందా?

 అఫ్‌కోర్స్... ప్రభాస్, రానా, అనుష్క.. వీళ్లందరూ ఆరు నెలలు ట్రైనింగ్ తీసుకున్నారు. నాకంత అవకాశం లభించలేదు కానీ, ముందు ట్రైనప్ కావడానికి మాత్రం టైమ్ దొరికింది. కత్తియుద్ధం, కొన్ని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను, డైలాగ్‌కి సంబంధించిన ట్రైనింగ్ తీసుకున్నాను. మరీ.. రిహార్సల్స్‌కి టైమ్ లేకుండా అయితే లేదు. ఎందుకంటే, ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఇలాంటి సినిమా చేయలేం.

 

  ఇందులో అవంతిక పాత్రకు రాజమౌళి మిమ్మల్ని అడిగినప్పుడు ఏమనిపించింది?

 నేను రాజమౌళికి పెద్ద ఫ్యాన్‌ని. ఒక ప్రేక్షకురాలిగా ఆయన సినిమాల కోసం ఎదురు చూస్తుంటాను. అసలిలాంటి సినిమాలకు నేను నప్పుతానో, లేదో నాకు తెలియదు. కానీ, రాజమౌళి నన్ను అవంతిక పాత్రలో విజువలైజ్ చేసి, తీసుకున్నారు. నేను చేయగలననే నమ్మకంతో అవకాశం ఇచ్చారు. రాజమౌళితో సినిమా చేయడం చాలా సులువుగా ఉంటుంది. చెప్పాల్సింది చెప్పి, స్వేచ్ఛ ఇస్తారు. ఇప్పటివరకూ చేసిన సినిమాలన్నింటికన్నా ఇది పూర్తిగా భిన్నం కాబట్టి, ఇది నాకు ‘రీ లాంచింగ్’లా అనిపిస్తోంది. ఇక్కడే కాదు.. హిందీలో కూడా ‘రీ లాంచింగ్’ మూవీ అనే అనుకుంటున్నాను.

 

  ఈ పాత్ర ఎలా చేయాలనే విషయంపై ఏమైనా రిఫరెన్స్‌లు తీసుకున్నారా?

 లేదు. ఎందుకంటే, ఈ సినిమాలో చూపించే ‘మహిష్మతి’ రాజ్యం, అందులో ఉండే పాత్రలన్నీ కల్పనే. అందుకే, వీటికి ఎలాంటి రిఫరెన్స్‌లూ ఉండవు. లుక్ టెస్ట్ చేశారు. అప్పటి కాలంలో సింథటిక్ మెటీరియల్ లేదు. అందుకని నా కాస్ట్యూమ్స్‌ని కాటన్, లెదర్‌తో తయారు చేయించారు. రాజమౌళిగారి ఊహను అర్థం చేసుకుని ఈ పాత్ర చేశాను. లేనిది ఉన్నట్లు ఊహించుకుని చెయ్యాలి. ఉదాహరణకు వాటర్ ఫాల్స్ సీన్ చేశామనుకోండి... అదక్కడ ఉన్నట్లు ఊహించుకోవాలి. అందుకని అసలా ఫ్రేమ్ ఎలా ఉంటుందో కూడా ఊహించడానికి సాధ్యపడదు. జస్ట్ రాజమౌళి చెప్పింది చేయడమే. హిందీ వెర్షన్‌కి నేనే డబ్బింగ్ చెప్పాను. అప్పుడు నా పాత్రను తెరపై చూసుకుని ‘ఓహో... ఇలా ఉంటుందా’ అనుకున్నాను.

 

  మీరు కూడా గుర్రపు స్వారీలు చేశారా?

 గుర్రమా? నాకసలు సైకిల్ తొక్కడమే రాదు. గుర్రపు స్వారీ చేసింది లేదు. లక్కీగా ఈ చిత్రంలో నాకు హార్స్ రైడింగ్ లేదు. అందుకని బతికిపోయాను.

 

  అనుష్క కాంబినేషన్‌లో మీకు ఎన్ని సన్నివేశాలున్నాయి?

 స్వీటీ (అనుష్క)తో నా కాంబినేషన్ సీన్స్ చాలా తక్కువ. అయినా ఒక్కటి మాత్రం చెప్పగలను. స్వీటీ మంచి నటి అని ఆల్రెడీ ప్రూవ్ అయ్యింది. ఈ సినిమా తన నట ప్రతిభను ఇంకా హైలైట్ చేసే విధంగా ఉంటుంది. అనుష్కకు ఇది ల్యాండ్‌మార్క్ లాంటి సినిమా.

 

  ఈ చిత్రంలో పనిచేయడం ద్వారా మీరు నేర్చుకున్న విషయాలు?

 ఏ సినిమాకైనా ఏదో ఒకటి నేర్చుకుంటాం. ఈ సినిమా కోసం యుద్ధ విద్యలు నేర్చుకున్నాను. భారీ యాక్షన్ మూవీస్‌లో కూడా నటించగలనని నమ్మకం కలగజేసిన చిత్రం ఇది. ఈ సినిమా చేయడం ద్వారా చిన్నప్పట్నుంచీ నన్ను వెంటాడిన భయం పోయింది. నాకు ఎత్తయిన ప్రదేశాలంటే భయం. ఎగ్జిబిషన్‌లో రంగుల రాట్నం ఉంటుంది కదా... అది ఎప్పుడూ ఎక్కలేదు. కానీ, ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం చాలా ఎత్తు నుంచి దూకడంతో భయం పోయింది.

 

  రమా రాజమౌళి, వల్లీ కీరవాణి కూడా సెట్లో ఉండేవాళ్లు కాబట్టి, ఓ కుటుంబ వాతావరణంలో ఈ షూటింగ్ జరిగింది. ఇప్పటివరకూ చేసిన సినిమాలపరంగా ఇలాంటి వాతావరణం చూశారా?

 లేదు. ఎక్కడా చూడలేదు. రాజమౌళి, కీరవాణిగార్ల ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికీ ఈ చిత్రం గురించి ప్రతి విషయం తెలుసు. వల్లి గారు లైన్ ప్రొడ్యూసర్. రమా రాజమౌళిగారు కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. రాజమౌళిగారబ్బాయి కార్తికేయ మెయిన్ అసిస్టెంట్ డెరైక్టర్. రాత్రీ, పగలూ ఏదీ పట్టించుకోకుండా పని చేసేవాళ్లం. అందుకే, ఈ షూటింగ్ పూర్తయ్యాక ఫ్యామిలీని మిస్సయినట్లుగా అనిపించింది. ఇప్పటివరకూ ఏ సినిమాకీ ఇలా అనిపించలేదు.

 

  ఇంతకూ.. ఇందులో మీ పాత్ర నిడివి ఎంత?

  ఫస్ట్ పార్ట్‌లో నా పాత్ర నిడివి ఎక్కువే ఉంటుంది. సెకండ్ పార్ట్‌లో తక్కువ ఉంటుంది.

 

  అభినందనలకు, విమర్శలకు ఎలా స్పందిస్తారు?

 అభినందనలను తప్పకుండా అంగీకరిస్తా. ఎందుకంటే, అవి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. విమర్శలను తిరస్కరించను. వాటిని కూడా తీసుకుంటాను. ఎందుకంటే, అవి అభివృద్ధికి తోడ్పడతాయి. ఉదాహరణకు, బాలీవుడ్‌కి వెళ్లినప్పుడు నాకు ఫ్యాషన్ మీద అవగాహన ఉండేది కాదు. దాంతో కొన్ని విమర్శలు వినిపించాయి. ఆ విమర్శలను తీసుకుని, అక్కడికి తగ్గట్టుగా మౌల్డ్ అయ్యాను.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top