అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగిన కత్రినా

అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగిన కత్రినా - Sakshi


 ఇప్పుడంటే కత్రినా కైఫ్ టాప్ హీరోయిన్. కానీ ఆమె కెరీర్ జీరో నుంచే మొదలైంది. ఎన్నో ఎదురుదెబ్బలు తిని... స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చారామె. కత్రినా గురించి 10 ఆసక్తికరమైన విషయాలు.

 

► కత్రినా అసలు పేరు ‘కత్రినా టర్కోట్’. కత్రినా తల్లి సుజానె ఇంటి పేరు టర్కోట్. మొదట్లో తన పేరుకి కొనసాగింపుగా తల్లి ఇంటి పేరుని పెట్టుకున్న కత్రినా ఆ తర్వాత తన తండ్రి మహమ్మద్ ఇంటి పేరు కైఫ్‌ని జోడించారు. అది కూడా ఇండియా వచ్చాకే అలా మార్చుకున్నారు. ‘కైఫ్’ పేరు ఇండియన్ పేరుకి దగ్గరగా ఉంది కాబట్టే తన పేరుని ఆ పేరుకి చేర్చారు.



► ముగ్గురు అక్కలు, ముగ్గురు చెల్లెళ్లు, ఓ అన్నయ్య, కత్రినాతో కలిపి మొత్తం ఎనిమిది మంది సంతానం. కత్రినా చిన్నప్పుడే వాళ్ల తల్లిదండ్రులు విడిపోయారు. అప్పట్నుంచీ ఇప్పటివరకూ తండ్రితో టచ్‌లో లేనని కత్రినా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.



► హాంగ్‌కాంగ్‌లో పుట్టిన కత్రినా చైనా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, పోల్యాండ్, జపాన్, బెల్జియమ్.. ఇలా పలు దేశాలు తిరిగారు. ఆమె తల్లి సేవా కార్యక్రమాలు చేస్తారు. అందులో భాగంగా తల్లితో ఈ దేశాలన్నీ తిరిగిన కత్రినా ఫైనల్‌గా తన కుటుంబంతో లండన్‌లో సెటిలయ్యారు.



► లండన్‌లో మోడల్‌గా చేస్తున్నప్పుడు బాలీవుడ్ నిర్మాత కైజాద్ గుస్తాద్ ‘బూమ్’లో ఒక పాత్ర ఇచ్చారు. ఆ విధంగా ముంబయ్ వచ్చారు కత్రినా.



► ‘బూమ్’లో పెద్దగా పేరు రాకపోవడంతో కత్రినాకు వెంటనే అవకాశాలు రాలేదు. అప్పుడు కొన్ని నెలలు పాటు ముంబయ్‌లో తన పోర్ట్‌ఫోలియో పట్టుకుని ప్రతి అడ్వర్టయిజింగ్ ఏజెన్సీకి తిరిగేవారు. అప్పుడు సొంత వాహనం కూడా ఉండేది కాదు. టాక్సీల్లోనే అన్ని ఆఫీసులకు వెళ్లేవారు.



► కథానాయిక కాకముందు పలు ఆడిషన్స్‌లో పాల్గొన్నారు కత్రినా. ఆ ఫొటోలను పెద్ద పెద్ద బేనర్లుగా తయారు చేయించి, కొన్ని స్టూడియోల్లో బేనర్లు పెట్టేవారట. ఆ బేనర్స్‌లో కత్రినా తన ఫోన్ నంబర్ అచ్చు వేయించేవారట.



► తాను నటించిన ప్రతి సినిమా విడుదలకు ముంబయ్‌లో ఉంటే కచ్చితంగా సిద్ధివినాయక టెంపుల్‌కి వెళతారు. అలాగే, ముంబయ్‌లోని మౌంట్ మేరీ చర్చ్‌ని సందర్శించడం కత్రినా అలవాటు. సినిమా విజయం సాధించాలని ప్రార్థనలు జరుపుతుంటారు.



► కత్రినాకు చీకటంటే చాలా భయం. అలాగే, పురుగులంటే అలర్జీ.



► బాలీవుడ్‌లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అని అడిగితే, ‘అలీ అబ్బాస్ జాఫర్’ పేరు చెబుతారు కత్రినా. ఆమె కథానాయికగా నటించిన ‘మేరీ బ్రదర్ కీ దుల్హన్’ చిత్రానికి ఆయనే దర్శకుడు. ఆ చిత్రం షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య మంచి స్నేహం మొదలైంది.



► చెప్పిన సమయానికి పదిహేను నిమిషాలు ముందే షూటింగ్ లొకేషన్లో ఉండటం కత్రినా అలవాటు. అందుకే, పంక్చువాల్టీకి కేరాఫ్ ఆడ్రస్ కత్రినా అని బాలీవుడ్‌లో అంటుంటారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top