'ఈడో రకం ఆడో రకం' మూవీ రివ్యూ

'ఈడో రకం ఆడో రకం' మూవీ రివ్యూ - Sakshi

టైటిల్: ఈడో రకం ఆడో రకం

జానర్: కన్ఫ్యూజన్ కామెడీ

తారాగణం: మంచు విష్ణు, రాజ్ తరుణ్, సోనారిక, హేబాపటేల్, రాజేంద్ర ప్రసాద్, రవిబాబు

సంగీతం: సాయి కార్తీక్

దర్శకత్వం: జి నాగేశ్వరరెడ్డి

నిర్మాత: సుంకర రామబ్రహ్మం

 

చాలాకాలంగా భారీ బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్న మంచు విష్ణు మరోసారి తనకు బాగా కలిసొచ్చిన కామెడీ జానర్ సినిమా ఈడోరకం ఆడో రకంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. కామెడీ సినిమాల స్పెషలిస్ట్గా పేరున్న జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్తో భారీ హిట్ మీద కన్నేశాడు. పంజాబీలో ఘనవిజయం సాధించిన సినిమాకు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యువనటుడు రాజ్ తరుణ్ మరో హీరోగా నటించాడు. సీరియస్ సినిమాలు పెద్దగా వర్కవుట్ కాకపోవటంతో మరోసారి కామెడీ టర్న్ తీసుకున్న మంచు విష్ణుకు ఈడోరకం ఆడోరకం ఎలాంటి రిజల్ట్ ఇచ్చింది..?

 

కథ :

ప్రాక్టీసు ఉన్నా కేసులు లేని లాయర్ నారాయణ (రాజేంద్రప్రసాద్) చిన్నకొడుకు అర్జున్ (మంచు విష్ణు). ఆస్తిపాస్తులు లేని సీఐ కోటేశ్వరరావు (పోసాని కృష్ణమురళి) కొడుకు అశ్విన్ (రాజ్ తరుణ్). అర్జున్, అశ్విన్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్, ఎలాంటి పనీ పాటా లేకుండా ఖాళీగా తిరుగుతూ టైం పాస్ చేసే ఈ ఇద్దరూ, ఓ ఫ్రెండ్ పెళ్లికి వెళ్లటంతో అసలు కథ మొదలవుతుంది. ఆ పెళ్లిలో అర్జున్, నీలవేణి (సోనారిక)ని, అశ్విన్, సుప్రియ (హేబాపటేల్)ని చూసి ఇష్టపడతారు. అయితే ఓ అనాథను మాత్రమే పెళ్లి చేసుకుంటాన్న నీలవేణిని ప్రేమలోకి దించటం కోసం తాను అనాథే అని నాటకం ఆడతాడు అర్జున్.

 

అర్జున్ అనాథ అని నమ్మి అతన్ని పెళ్లి చేసుకోవటానికి ఒప్పకుంటుంది. పెళ్లి విషయం మాట్లాడటానికి భూ కబ్జాలు, దందాలు చేసే తన అన్న గజన్న( అభిమన్యు సింగ్) దగ్గరకు తీసుకెళ్తుంది. అర్జున్, గజన్నకు కూడా నచ్చటంతో వెంటనే పెళ్లి చేసేస్తాడు గజన్న. తప్పనిసరి పరిస్థితుల్లో తన తండ్రి నారాయణకి విషయం చెప్పకుండానే అర్జున్ పెళ్లి చేసుకుంటాడు. అయితే గజన్న ఇంట్లో రౌడీల మధ్య ఉండటం ఇష్టం లేని నీలవేణి, బయట ఇల్లు అద్దెకి తీసుకోవాలనుకుంటుంది. అదే సమయంలో పేపర్ యాడ్ చూసి, అర్జున్ తండ్రి నారాయణ ఇంట్లో అద్దెకి దిగాలని నిర్ణయించుకుంటుంది. నారాయణ మాటతీరు, ఇల్లు నచ్చటంతో అర్జున్కి చెప్పకుండానే అడ్వాన్స్ కూడా ఇస్తుంది.

 

అలా అదే ఇంట్లో టెనెంట్గా, ఇంటి ఓనర్ కొడుకుగా రెండు పాత్రలు చేయలేక అర్జున్ ఇబ్బంది పడటంతో సినిమాలో కన్ఫ్యూజన్ మొదలవుతోంది. ఈ కన్ఫ్యూజన్ను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తుండగా అతడి ప్రేమ వ్యవహారం కూడా ఇరకాటంలో పడుతుంది. ఆస్తి పాస్తులున్న వాడికే తన చెల్లెల్ని ఇచ్చి పెళ్లిచేస్తానన్న దత్తన్న (సుప్రీత్) కు తాను లాయర్ నారాయణ కొడుకునని పరిచయం చేసుకొని అతని చెల్లెలు సుప్రియను పెళ్లి చేసుకుంటాడు అశ్విన్. దీంతో అందరి రిలేషన్లు కన్ఫ్యూజన్లో పడతాయి. మరి ఈ కన్ఫ్యూజన్లన్నింటికీ క్లారిటీ ఎలా వచ్చింది. చివరకు అర్జున్ అనాథ కాదన్న విషయం తెలిసి నీలవేణి ఏం చేసిందన్నదే మిగతా కథ.

 

నటీనటులు:

మంచు విష్ణు మరోసారి తన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. సిక్స్ ప్యాక్ బాడీతో యాక్షన్ హీరోలా కనిపిస్తూనే నవ్వులు పూయించాడు. యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా తనదైన నటనతో మెప్పించాడు. తన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో సినిమాకు జోష్ తీసుకువచ్చాడు. ముఖ్యంగా ఇద్దరి హీరోల మధ్య వచ్చే సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి. హీరోయిన్లుగా నటించిన సోనారికా, హేబాపటేల్ ఇద్దరూ నటనపరంగా పర్వాలేదనిపించినా అందాల ప్రదర్శనతో మాత్రం సినిమాకు గ్లామర్ తీసుకువచ్చారు. సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తండ్రి పాత్రలో మరోసారి తన మార్క్ చూపించాడు. ఇప్పటికీ తనలో కామెడీ టైమింగ్ అలాగే ఉందని ప్రూవ్ చేసిన రాజేంద్ర ప్రసాద్ సినిమాకు సక్సె లో కీరోల్ ప్లే చేశాడు.

 

సాంకేతిక నిపుణులు :

పంజాబీ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తెరకెక్కించటంలో దర్శకుడు నాగేశ్వరరెడ్డి విజయం సాధించాడు. ముఖ్యంగా విష్ణులోని కామెడీ యాంగిల్ను పర్ఫెక్ట్గా వాడుకున్న దర్శకుడు సినిమాను ఎంటర్టైనింగ్గా తెరకెక్కించాడు. కన్ఫ్యూజన్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా ఏ మాత్రం పట్టుతప్పినా ఆడియన్స్కు కథ అర్థంకాని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి టిపికల్ సబ్జెక్ట్ను పర్ఫెక్ట్గా డీల్ చేయటంలో సక్సెస్ సాధించాడు. సిద్దార్థ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సాయి కార్తీక్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. మాస్ పాటలతో ఆకట్టుకున్న సాయి కార్తీక్, నేపథ్య సంగీతంతోనూ మెప్పించాడు.

 

 

ప్లస్ పాయింట్స్ :

మంచు విష్ణు, రాజ్ తరుణ్

రాజేంద్ర ప్రసాద్

స్క్రీన్ ప్లే

క్లైమాక్స్

 

మైనస్ పాయింట్స్ :

ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలు లేకపోవటం

 

ట్యాగ్‌లైన్: ఈ సినిమా.. ఓవరాల్‌గా యూత్‌ని ఆకట్టుకునే సక్సెస్‌ఫుల్ కామెడీ

- సతీష్ రెడ్డి, ఇంటర్ నెట్ డెస్క్
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top