దేశం విడిచివెళ్లే ఉద్దేశం లేదు

దేశం విడిచివెళ్లే ఉద్దేశం లేదు - Sakshi


నా వ్యాఖ్యలు వక్రీకరించారు: ఆమిర్ ఖాన్

♦ తన దేశభక్తికి ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదని వ్యాఖ్య

♦ అసహనం వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టీకరణ

 

 ముంబై: దేశంలో అసహన పరిస్థితులపై తాను చేసి వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ బుధవారం స్పందించారు. అసహనంపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూనే.. తనకు కాని, తన భార్య కిరణ్‌కు కానీ దేశం విడిచివెళ్లే ఆలోచన లేదని ఓ ప్రకటనలో తెలిపారు. తన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నవారు తాను ఇచ్చిన ఇంటర్వ్యూను పూర్తిగా చూసి ఉండరని, అందుకే తన మాటలను వక్రీకరిస్తున్నారని ఆమిర్ పేర్కొన్నారు. ‘భారత్ నా మాతృభూమి, ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాను, ఈ దేశంలో జన్మించడం నా అదృష్టం. నేను ఇక్కడే ఉంటాను’ అని పేర్కొన్నారు. తాను దేశభక్తుడినని చెప్పుకునేందుకు.. తనను దేశద్రోహి అని విమర్శించినవారి సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. రెండ్రోజులుగా జరుగుతున్న చర్చలో తన వ్యాఖ్యలకు మద్దతు తెలిపిన వారందరికీ ఆమిర్ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఐక్యత, సమగ్రత, భిన్నత్వం, సంస్కృతి, చరిత్ర, సహనశీలతను కాపాడుకునేందుకు అందరూ కృషిచేయాలని ఆయ న కోరారు. ఇవే భారత్‌కు బలం అని పేర్కొంటూ ‘ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తలెత్తుకుని తిరుగుతారో..’ అన్న విశ్వకవి రవీంద్రుడి కవితను ఉటంకించారు.



 ఇది ద్రోహుల భాషే: శివసేన

 ఆమిర్ వ్యాఖ్యలపై శివసేన తన అధికార వాణి ‘సామ్నా’లో మండిపడింది. ఆమిర్ ద్రోహుల భాష మాట్లాడుతున్నారని ధ్వజమెత్తింది. దేశంలో అసహనం పెరిగిపోతే బాలీవుడ్‌లో ఖాన్‌ల సినిమాలకు అంత ఆదరణ ఎలా వస్తుందని ప్రశ్నించింది. వెళ్లాలనుకుంటే ఈ దేశం ఇచ్చిన పేరు ప్రతిష్టలను కూడా వదిలేసి వెళ్లాలని దుయ్యబట్టింది. ఇదిలా ఉండగా.. సహనశీలత భారత్ డీఎన్‌ఏలో ఉందని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ఆమిర్ దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని, రాజకీయ మాయాజాలంలో పడవద్దని ఆయన ఆమిర్‌కు సలహా ఇచ్చారు.

 

 ఆమిర్‌ఖాన్ వాస్తవంగా ఏమన్నారంటే..

 మేధావులు తమ మనసులోని మాటను బయటపెట్టడం చాలా ముఖ్యం. అందుకే చాలా మంది శాస్త్రవేత్తలు, చరిత్రకారులు తమ ఆవేదనను, అసంతృప్తిని అవార్డులు వెనక్కి ఇవ్వటం ద్వారా బయటపెడుతున్నారు. రోడ్డుమీదికొచ్చి గొడవ చేయనంతవరకు అహింసాత్మక పద్ధతుల్లో నిరసన తెలపటం భారతీయుల హక్కు. మేధావులు తమ హక్కును వినియోగించుకుంటున్నారు. రోజూ వార్తాపత్రిక తెరిస్తేనే భయమేస్తోంది. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘోరాలు చూస్తుంటే భారతీయుడిగా నేను కూడా ఇలాగే ఫీలవుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా వివిధ కారణాల వల్ల అహింస చెలరేగుతోంది. భారతదేశం విషయానికొస్తే సమాజంలో భద్రత తగ్గుతుందనుకున్నప్పడు పౌరులుగా మనం ఆవేదన చెందటం సహజం.



ఏదైనా అనుకోని ఘటన జరిగినపుడు బాధ్యుడికి శిక్ష పడితే న్యాయం జరుగుతుందన్న భరోసాతో సమాజం ధైర్యంగా ఉంటుంది. మనం ఎన్నుకున్న వాళ్లే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నప్పుడు కూడా సమాజం భద్రంగా ఎలా ఫీలవుతుంది. అధికారంలో ఎవరున్నారనే దానికి దీంతో సంబంధం లేదు. తరతరాలుగా ఇలాగే జరుగుతోంది. ఈసారి బీజేపీ అధికారంలో ఉంది. టీవీ చర్చల్లో చూస్తున్నాం. అసహనంపై గొడవ జరుగుతుంటే 1984లో ఏం జరిగిందని వాళ్లు (బీజేపీ) ప్రశ్నిస్తున్నారు. అప్పుడు జరిగింది దారుణమే.. అందులో సందేహం లేదు. 



అలాగని ఇప్పుడు జరుగుతున్నది సరైంది కాదు కదా? సమస్య ఉత్పన్నమైనపుడు దానికి పరిష్కారం కోసం ప్రయత్నించాలి. ప్రజలకు భరోసా ఇచ్చే ప్రకటన చేయాలి. అసహనం విషయంలో గతంలో కంటే ఇప్పుడు భయం మరింత పెరిగింది. దేశంలో అభద్రత నెలకొందని నేను భావిస్తున్నాను. నేను ఇంట్లో కూర్చుని నా భార్య కిరణ్‌తో చర్చిస్తున్నప్పుడు.. (నేను, కిరణ్ జీవితమంతా భారత్‌లోనే గడిపాం) తను మొదటిసారి.. భారత్ విడిచి వెళ్దామా? అని అడిగింది. కిరణ్ నాతో ఇలా మాట్లాడటం దురదృష్టకరం. తను వార్తాపత్రిక తెరిచేందుకు భయపడుతోంది. మన చుట్టూ ఉన్న వాతావరణంపై ఆమె ఆందోళన చెందుతోంది. పిల్లల గురించి భయపడుతోంది. ఇది సమాజంలో కలవరానికి ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా ఎందుకు జరుగుతుందనిపిస్తోంది. నాలో కూడా ఇదే భావన ఉంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top