కొత్త యాక్టర్స్‌ను కొడతాడన్నా, కొట్టడన్నా...

కొత్త యాక్టర్స్‌ను కొడతాడన్నా, కొట్టడన్నా... - Sakshi


కొత్త నటీనటుల్ని వెండితెరకు పరిచయం చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. అలాంటి పవరున్న అతికొద్దిమంది దర్శకుల్లో తేజ ఒకరు. ఆయన వెన్నుతడితే చాలు ఎలాంటివారైనా స్టార్ కావల్సిందే. దర్శకత్వ శాఖలోనే కాదు మల్టీ టాలెంటెడ్ పర్సెన్‌గా పేరుతెచ్చుకున్న తేజ తాజాగా  అందరూ కొత్త నటీనటులతో ‘హోరాహోరీ’ అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్‌లో భాగంగా విశాఖపట్నం వచ్చిన ఆయనతో చిట్‌చాట్....

 

నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే రాంగోపాల్ వర్మ దగ్గర శివ సినిమా అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేరాను. ఆ సినిమాకు వాళ్లు చేసిన పోస్టర్స్ నాకు నచ్చలేదు. అందుకే పబ్లిసిటీ డిజైనర్ దగ్గర కూర్చుని ఇలా కావాలి, అలా కావాలి అని చెప్పి డిజైన్  చెప్పి చేయించుకున్నాను. అవే అందరికీ నచ్చి ఆ డిజైన్స్ మార్కెట్‌లోకి వచ్చాయి.  శివ, క్షణక్షణం, శివ (హిందీ) మూడింటికి డిజైనర్, అసిస్టెంట్ డెరైక్టర్, స్టోరీ,స్క్రీన్‌ప్లేలలో వర్క్ చేశాను. తర్వాత వర్మ డైరక్షన్‌లో వచ్చిన రాత్రి, అంతం, మనీ సినిమాలకు సినిమాటోగ్రఫర్‌గా చేశాను. అంతకు ముందు నాకు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా ఎక్స్‌పీరియన్స్ ఉంది.

 

 ఆ యాటిట్యూడ్ బావుంటుంది

 నేను సినిమాటోగ్రఫర్‌గా ఉన్నప్పుడు ‘తేరా మేరే సప్నే’ అనే ఒక హిందీ సినిమా చేశాను. ఆ సినిమా షూటింగ్‌లో భాగంగా ఫస్ట్ టైం విశాఖపట్నం వచ్చాను. చాలా బాగా అనిపించింది విశాఖపట్నం. బేసిక్‌గా వైజాగ్ వాళ్లకు సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ. ఏం చెప్పినా సరే తమాషాగా తీసుకుంటారు. అంత త్వరగా సీరియస్ అవ్వరు. అన్నింటికి నవ్వుతారు. మన మీద జోక్స్ వేస్తారు. మనం ఏం అన్నా సరే జోక్‌గానే తీసుకుంటారు. ఆ యాటిట్యూడ్ చాలా బావుంటుంది. వైజాగ్‌లో ఉన్న నా థియేటర్ చాలా బాగా నచ్చిన ప్లేస్. సినిమా వాళ్లకు థియేటర్లే గుడి. అందులో ఆడియన్స్ దేవుళ్లు.

 

 లొకేషన్స్ చాలా బాగుంటాయి

 వైజాగ్‌లో షూటింగ్ చేసేందుకు మంచి లొకేషన్స్ ఉన్నాయి. అందుకే నేను తీసిన సినిమాలో మొత్తం విశాఖ ఉన్న ప్రధాన ఏరియాలను టచ్ చేస్తూ పాట ఒకటి చేశాను. ప్రస్తుతం 1904లో కట్టిన వైజాగ్‌పట్నం క్లబ్‌లో షూట్ చేస్తున్నాం. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ లొకేషన్‌లో ఒక్క రోజు షూట్ అనుకుని వచ్చాను. కానీ లొకేషన్ నచ్చి ఇంకో రోజు ఎక్స్‌టెండ్ చేశాను. విశాఖపట్నం వారికి కళాభిమానం, కళాపోషణ ఎక్కువ. అలాగే ఎంతోమంది కళాకారులు కూడా ఇటువైపు నుంచి వచ్చిన వారే.



 సినిమాలే ముఖ్యం

 షూటింగ్ లేని సమయంలో ఇంట్లోనే ఉండాల్సి వస్తే సినిమాలు ఎక్కువగా చూస్తాను. కథలు రాసుకుంటాను. టీవీ మాత్రం అసలు చూడను. నా మీద టీవీలో ఎలాంటి న్యూస్ వచ్చినా సరే పట్టించుకోను. ఎలాంటి రియాక్షన్ ఉండదు. కొత్త యాక్టర్స్‌ను కొడతాడన్నా, కొట్టడన్నా నేనేం పట్టించుకోను. నేను కొన్ని కారణాల వలన మాకు తెలిసిన వాళ్ల ఇంట్లో ఉండాల్సి వచ్చింది. అప్పుడు వంట నేర్చుకోవలసి వచ్చింది. సో ఇంట్లో అప్పుడప్పుడు వంట చేస్తుంటాను. కానీ నాకు ఫుడ్ మీద పెద్దగా ఇంట్రస్ట్ లేదు. ఏది ఉంటే అదే తింటాను. నాకు నా ఫ్యామిలీ కన్నా సినిమానే ముఖ్యం. మా పిల్లలు ఏం చదువుతున్నారో కూడా నాకు తెలియదు. అన్నీ నా వైఫ్ శ్రీవల్లి చూసుకుంటుంది.

 

 ప్రయోగాలు చేస్తా

 నేను సినిమాలలో ప్రయోగాలు ఎక్కువ చేస్తుంటాను. అందుకే కొత్తవాళ్లతోనే చేస్తాను. వాళ్లు అయితే నేను చెప్పినట్టు చేస్తారు. స్టార్  హీరోలు అయితే ఇలాంటి స్టోరీలు చేయడం కష్టం. రిస్క్ నేను ఫేస్ చేస్తాను గానీ స్టార్స్ ఫేస్ చేయడానికి ఇష్టపడరు. అందరూ కొత్తవాళ్లతోనే తీసే నేను మహేష్‌బాబుతో ‘నిజం’ చేశాను. అతను ఒక స్టార్ హీరోగా కాకుండా డెరైక్టర్ ఏం చెబితే అదే చేస్తారు. కొత్త వాళ్లతో చేయడం అలవాటైపోయింది. ఫస్ట్ టేక్ ఎప్పుడూ ఓకే అయ్యేది కాదు. ఓ పది టేకులు వరకు చేసేవాడిని. కానీ మహేష్‌బాబు చేస్తుంటే సింగిల్ టేక్‌లో ఓకే అయిపోయేది. త్వరలో ఒక సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ చే స్తాను.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top