సల్మాన్ఖాన్ కేసు డైరీ కూడా గల్లంతు!

సల్మాన్ ఖాన్


ముంబై: బాలీవుడ్ హీరో సల్మాఖాన్ హిట్ అండ్ రన్  కేసులో ఒరిజినల్ డాక్యుమెంట్స్తోపాటు డైరీ కూడా గల్లంతయింది. కేసు డాక్యుమెంట్లను వెలికితీయడంలో పోలీసుల వైఫల్యంపై ముంబై సెషన్స్ కోర్టు అసంతప్తి వ్యక్తం చేసింది. కేసు డైరీ కూడా కనిపించడంలేదని పోలీసులు మొదటిసారిగా ఈరోజు కోర్టుకు తెలిపారు. వాటిని వెతికేందుకు కోర్టు పోలీసులకు చివరి అవకాశం ఇచ్చింది. వచ్చే నెల 12వ తేదీ లోపల కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు, డైరీ కనుగొనాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి 63 డాక్యుమెంట్స్కు గాను, ఏడు మాత్రమే దొరికినట్లు  పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే ట్రయిల్ కోర్టులో ఒరిజినల్ డాక్యుమెంట్లు మాత్రమే ప్రవేశపెట్టాలని  సల్మాన్ ఖాన్ తరపు న్యాయవాది శ్రీకాంత్ వాదించారు.



2002 సెస్టెంబర్ 28న సల్మాన్ కారు వేగంగా నడిపి  బాంద్రా క్వార్టర్ రోడ్డుపై ఫుట్ పాత్‌పై నిద్రిస్తున్న అయిదుగురిపై ఎక్కించినట్లు ఆరోపణ. వారిలో ఒకరు మృతి చెందారు.  మిగిలిన నలుగురు గాయపడ్డారు.  మద్యం తాగి కారు నడిపినట్లు కూడా సల్మాన్‌పై ఆరోపణలున్నాయి. అనేక కారణాల వల్ల జాప్యమైన ఈ కేసు విచారణ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది.  తాజాగా ప్రారంభమైన విచారణలో సల్మాన్ను సాక్షులు గుర్తుపట్టిన విషయం తెలిసిందే.



జూలై 25న జరిగిన విచారణ సందర్భంగా సాక్షులైన కల్పేష్ వర్మ, అమీన్ శేఖ్‌లు ఇచ్చిన డాక్యుమెంట్లు కన్పించకుండాపోయాయని పోలీసులు కోర్టుకు తెలిపారు.  ఆ డాక్యుమెంట్లను వెతికేందుకు సమయం కావాలని పోలీసులు కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది. ఈరోజు విచారణలో కేసు డైరీ కూడా కనిపించడంలేదని పోలీసులు తెలిపారు.  హిట్ అండ్ రన్ కేసులో నేరం రుజువైతే పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top