ఇంత తొందరపడతారనుకోలేదు...

ఇంత తొందరపడతారనుకోలేదు... - Sakshi


తల్లి జన్మనిస్తుంది. తండ్రి జీవాన్నిస్తాడు. అయితే.. జ్ఞానం లేని జన్మ, జీవం నిరర్థకాలు. మరి ఆ జ్ఞానాన్ని ఎవరిస్తారు? గురువు ఇస్తాడు. గురుర్బ్రహ్మ.. గురుర్విష్ణు.. గురుర్దేవో మహేశ్వరః అన్నది అందుకే. శిష్యుని అభ్యున్నతే గురువుకి నిజమైన గురుదక్షిణ. అలాంటి గురువు దూరమైతే.. శిష్యుని వేదన వర్ణనాతీతం! ప్రస్తుతం సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అదేవేదనలో ఉన్నారు. తన గురువు ‘మాండలిన్ శ్రీనివాస్’ మరణం వార్త షాక్ నుంచి దేవిశ్రీ తేరుకోలేకపోతున్నారు. ‘ఇది నిజం కాదు... ఓ పీడకల అయితే ఎంత బావుణ్ణో’ అంటూ తీవ్రమైన ఉద్వేగానికి లోనయ్యారు దేవిశ్రీ. తన గురుదేవుని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ‘సాక్షి’కి దేవిశ్రీ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్‌వ్యూ.

 

 ‘మాండలిన్ శ్రీనివాస్’గారి మరణవార్త  తెలిసినప్పుడు ఎక్కడున్నారు?

 స్టేజ్ షోల నిమిత్తం యూఎస్‌లో ఉన్నాను. అప్పుడే శ్రీనివాస్ అన్నయ్యకు ఒంట్లో బాలేదు... హాస్పిటల్‌లో చేరారని తెలిసింది. తేరుకుంటారులే అనుకున్నాను. కానీ, ఈలోపు ఈ దుర్వార్త తెలిసింది. ఈ వార్త తెలిసి, శిష్యులమైన మేమే తట్టుకోలేకపోతున్నాం. ఇక కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక్క వ్యసనం లేని మనిషి ఆయన. భోజనం కూడా తక్కువే తీసుకుంటారు. పైగా... నెగటివ్‌గా ఆలోచించడం ఆయనకు తెలీదు. పక్కా పాజిటివ్ పర్సన్. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. నిజంగా ఆయన మరణం నమ్మలేని వాస్తవం.

 

 శ్రీనివాస్‌గారిని తొలిసారి ఎలా కలిశారు?

 నా తొమ్మిదేళ్ల వయసులో ఆయన్ను కలిశాను. అప్పుడు ఆయనకు ఇరవై ఏళ్లుంటాయి. అప్పటికే దేశవ్యాప్తంగా గుర్తింపు ఉందాయనకు. చెన్నయ్‌లో మా వీధికి రెండు వీధుల అవతలే ఆయన ఇల్లు.  నాకు ఎలాగైనా మ్యూజిక్ నేర్పించాలనేది అమ్మ కోరిక. ‘మాండలిన్’ శ్రీనివాస్ పక్కనే ఉన్నారని తెలిసి.. ఆయన దగ్గరకు తీసుకెళ్లింది. అలా ఆయనతో జర్నీ మొదలై పదేళ్ల పాటు సాగింది. ఈ ప్రయాణంలో ఎన్ని మరుపురాని సంఘటనలో. ఆయన  దగ్గర ఫస్ట్ బ్యాచ్ మాదే.

 

 ఒక విద్యార్థిగా ఆయన దగ్గర మీరు గమనించిన గొప్పతనమేంటి?

 ఒకటని చెప్పలేను. సద్గురువు అంటే ఆయనే. ఆయన దగ్గర విద్య నేర్చుకున్నవాళ్లు వందలమందే ఉంటారు. కానీ... ఎవరి దగ్గరా నయా పైసా తీసుకోలేదు. నిజానికి ఆయనకున్న పేరు ప్రఖ్యాతులకు ఎంత అడిగితే అంత ఇచ్చేవాళ్లు ఉంటారు. కానీ.. విద్యను డబ్బుతో కొలవడం ఏంటి? అంటారాయన. ఆయన దగ్గరున్న పదేళ్లలో ఏనాడూ ఆయన కోప్పడటం చూడలేదు నేను. శ్రుతి శుద్ధంగా వాయించకపోతే... ఏ గురువైనా కోప్పడతారు. కానీ.. అన్నయ్య అస్సలు కోప్పడేవారు కారు. ‘భలే వాయించావే.. అలా ఎలా వాయించావ్. నాక్కూడా నేర్పవా’ అనేవారు. ఆయన అలా అంటుంటే పకపకా నవ్వేవాళ్లం. అలా నవ్విస్తూ విద్య నేర్పేవారు.  

 

 చిన్న వయసులోనే మీరు మ్యూజిక్ డెరైక్టరయ్యారు కదా. ఆయనెలా ఫీలయ్యారు?

 ఇంటర్‌లో ఉన్నప్పుడే మ్యూజిక్ డెరైక్టర్ అయిపోయా. అప్పుడు ఆయన ఆనందం మాటల్లో చెప్పలేను. నా ఆల్బమ్స్‌ని ఆయనకు వినిపించాలనే కోరిక ఉండేది. కానీ ధైర్యం చాలేది కాదు. కమర్షియల్ సాంగ్స్ కాకుండా.. దేవి, పౌర్ణమి, ఢమరుకం లాంటి ఆల్బమ్స్ వినిపించాలని నేను అనుకునేవాణ్ణి. ఓసారి ఆయన కచేరీ నుంచి వస్తుంటే ‘డమరుకం’ ఆల్బమ్ గురించి మాట్లాడబోయాను. ‘రింగ రంగ.. రింగ రంగ’ ఎక్స్‌ట్రార్డినరీగా కొట్టావే. బావుందా పాట’ అని తెగ మెచ్చేసుకున్నారు. నేను షాక్. అలాగే ‘గబ్బర్‌సింగ్’లో ‘కెవ్వు కేక’ పాటంటే ఆయనకు ఇష్టం. ఎప్పుడూ రాగ, తాళ, స్వరాలతోనే ఆయన సహవాసం. అంతటి బిజీలో కూడా నా ప్రతి ఆల్బమ్‌నీ వినేవారు. ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ‘మాతో గంట సేపు మాట్లాడితే... అందులో అరగంట నీ గురించే మాట్లాడతారయ్యా మీ గురువు’ అని. ఆ మాట విన్నప్పుడు చెప్పలేనంత ఆనందం కలిగేది.

 

 మీరంటే ఎందుకాయనకు అంత అక్కర?

 నా అదృష్టం. ఒక్కోసారి క్లాసులకు లేట్‌గా వెళ్లేవాణ్ణి. అయినా కోప్పడేవారు కాదు. కచేరీ ఉన్నప్పుడు కూడా లేటయ్యేవాణ్ణి. అప్పుడు నా కోసం ఎదురుచూసేవారు. నన్నెప్పుడూ ఆయన శిష్యుడిగా చూడలేదు. తమ్ముడిగానే చూశారు. ఆయన సొంత తమ్ముడు రాజేశ్‌తో సమానమైన ప్రేమను పంచారు. నన్ను ‘ప్రసాద్’ అని పిలిచేవారు. ఫొటోగ్రఫీ అంటే నాకు చిన్నప్పట్నుంచీ ప్రాణం. పదిహేనేళ్ల క్రితం అనుకుంటా.. ‘అన్నయ్యా... నీ ఫొటో తీస్తాను’ అంటే ‘ఓకే’ అన్నారు. బ్లాక్ షర్ట్ వేసుకోమంటే వేసుకున్నారు. బ్లాక్ కర్టన్ ముందు నిలబెట్టి ఒక కాన్సెప్ట్ ప్రకారం ఫొటో తీశాను. అద్భుతంగా వచ్చింది. ఆ రీల్‌ని ఆయనకే ఇచ్చాను. నిజానికి అన్నయ్య దగ్గర చాలా విలువైన ఫొటోలే ఉన్నాయి. కానీ... నేను తీసిన ఫొటోని మాత్రం పెద్దది చేయించి తన ఆఫీస్ రూమ్‌లో పెట్టుకున్నారు. అంతటి ప్రేమను ఆయన నుంచి పొందగలగడం నా అదృష్టం. ఎన్ని వేల జన్మల పుణ్యమో అలాంటి గురువు నాకు దొరికారు.

 

 సంగీత దర్శకునిగా మీపై ‘మాండలిన్’ శ్రీనివాస్‌గారి ప్రభావం ఎంత వరకూ ఉంది?

 నా పాటలు వెస్ట్రన్ మూడ్‌లో అనిపించినా... ఎక్కడా మెలొడీని మాత్రం మిస్ చేయను. ఆ మెలొడీ నా గురువు పెట్టిన భిక్షే. ‘పౌర్ణమి’లో నా మ్యూజిక్ చూసి ‘క్లాసికల్ ఎప్పుడు నేర్చుకున్నారు’ అనడిగారు చాలామంది. ‘‘నేను ‘మాండలిన్’ శ్రీనివాస్ శిష్యుణ్ణండీ’’ అని సమాధానమిస్తే, నిర్ఘాంతపోయారు. ఏదిఏమైనా ‘మ్యూజిక్ డెరైక్టర్ దేవిశ్రీ’ అనిపించుకోవడం కంటే.. ‘మాండలిన్ శ్రీనివాస్ శిష్యుడు ప్రసాద్’ అని ిపిలిపించుకోవడంలోనే నాకు కిక్ ఉంది.

 

 చిన్న వయసులోనే ‘పద్మశ్రీ’ అందుకున్న ఘనత ‘మాండలిన్’ శ్రీనివాస్‌ది. మరి ఇప్పటివరకూ ఆయనకు పద్మభూషణ్ రాకపోవడం బాధ అనిపించలేదా?

 అవార్డులపై అన్నయ్యకి అస్సలు వ్యామోహం ఉండేది కాదు. ప్రముఖ రాజకీయ నాయకులు సైతం చాలామంది మా పలుకుబడితో మీకు పద్మభూషణ్ ఇప్పిస్తామంటే... ‘వద్దు’ అని నిర్మొహమాటంగా చెప్పేసేవారు. ‘శ్రోతలకు ఆనందాన్నిచ్చేంత సంగీతం నాకు వచ్చింది. ఇక పద్మభూషణ్ రాకపోయినా ఫర్లేదు’ అనేవారు. ‘మాండలిన్’ శ్రీనివాస్ అంటే ప్రఖ్యాత మాండలిన్ వాయిద్యకారుడని మాత్రమే చాలామందికి తెలుసు. ఆయన సాధించిన ఎచీవ్‌మెంట్స్ చాలామందికి తెలీదు. ప్రపంచదేశాలన్నీ ఆయన్ను ‘ఆనరబుల్ సిటిజన్’గా గుర్తించాయి. ఈ మధ్య యూఎస్‌కి పోగ్రామ్ పనిమీద వెళ్లిన మాకు అక్కడ చిన్న సమస్య తలెత్తితే... ఒక్క ఫోన్‌కాల్‌తో ఆ సమస్యని పరిష్కరించారాయన. కొన్నేళ్ల క్రితం బార్సిలోనాలో జరిగిన ఒలంపిక్ క్రీడలు ‘మాండలిన్’ శ్రీనివాస్‌గారి కాన్సెప్ట్‌తో ప్రారంభమయ్యాయి. అప్పుడే అక్కడ ‘యు.శ్రీనివాస్’ అని ముద్రించిన టీ షర్ట్‌లను కూడా పంచారు. ఇది భారతీయునిగా ఆయన సాధించిన పెద్ద విజయం. అంతేకాదు, ‘మాండలిన్’ శ్రీనివాస్ కచేరీ ఉందంటే... పనులన్నీ పక్కనపెట్టేసి మరీ కచేరీని ఎంజాయ్ చేసేవారు అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్. రాజీవ్‌గాంధీ నుంచి నేటి మన ప్రధాని  నరేంద్రమోడీ వరకూ  అందరూ ఆయన అభిమానులే. ఇక ఆయనకు అవార్డులతో పనేంటి చెప్పండి. అయితే.. ఆయన సాధించిన ఎచీవ్‌మెంట్లనీ ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత శిష్యుడిగా నాపై ఉంది. త్వరలోనే ఆ బాధ్యతను నిర్వర్తిస్తాను.

 

 ఒక్క సినిమాకైనా ఆయనతో మాండలిన్ వాయింపజేయాలని మీకనిపించలేదా?

 అయ్యో... అది నా చిరకాల వాంఛ. పైగా నేనడిగితే ఆయన కాదనరు కూడా. అయితే... ఏ సినిమా పడితే ఆ సినిమాకు ఆయన్ను అడగడం కరెక్ట్ కాదని... మంచి క్లాసికల్ టచ్ ఉన్న సినిమా వచ్చినప్పుడు అడగొచ్చులే... ఇప్పుడు తొందరేముంది అనుకున్నాను. కానీ.. ఆయనే తొందరపడిపోయారు. ప్రతి ఏడాదీ నా పుట్టిన రోజున మొదటి విషెస్ ఆయన నుంచే అందేవి. ఈ ఏడాది కూడా నేను యూఎస్‌లో ఉంటే వాట్సాప్ ద్వారా విషెస్ చెప్పారు. అన్నయ్యతో నా చివరి అనుభవం అది. నేను ఏ విషయంలోనైనా స్ట్రాంగ్‌గా ఉంటాను. ఇంత అప్‌సెట్ అవ్వడం మాత్రం ఇదే. నా బాధను ఎలా వ్యక్తం చేయాలో అర్థంకావడంలేదు. నా దైవం నన్ను వదిలి వెళ్లింది అంతే (చమర్చిన కళ్లతో).

 - బుర్రా నరసింహ

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top