మనోజ్ సాహసాలు ఈ చిత్రానికి హైలైట్ : మోహన్‌బాబు

మనోజ్ సాహసాలు ఈ చిత్రానికి హైలైట్ : మోహన్‌బాబు - Sakshi


‘‘హుదూద్ తుఫాను సృష్టించిన బీభత్సం వల్ల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు చూస్తే బాధేసింది. అందుకే ఈ నెల 17న విడుదల చేయాల్సిన ‘కరెంట్ తీగ’ను 31వ తేదీకి వాయిదా వేశాం’’ అని నటుడు డా.మోహన్‌బాబు అన్నారు. మోహన్‌బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు మనోజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా మంచు విష్ణు నిర్మించిన చిత్రం ‘కరెంట్ తీగ’. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అచ్చు స్వరాలందించారు. ఈ సినిమా ఆడియో ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లోని నారాయణమ్మ కాలేజీలో బుధవారం జరిగింది.

 

 మోహన్‌బాబు మాట్లాడుతూ -‘‘నిజానికి వేల సీడీలు అమ్ముడైతే ప్లాటినమ్ డిస్క్ వేడుక జరుపుతారు. అమ్ముడు కాకపోయినా ఇటీవల వేడుకలు జరుపుతున్నారు అది వేరే విషయం. కానీ.. మా పాటలు నిజంగా జనాదరణ పొందాయి కాబట్టే.. ఈ వేడుక చేశాం. విష్ణు హీరోగా ‘దేనికైనా రెడీ’ చేసిన నాగేశ్వరరెడ్డి ఈ చిత్రాన్నీ అద్భుతంగా తీశారు. మనోజ్ పదేళ్లలో చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే... ‘కరెంట్ తీగ’ మరో ఎత్తు. అతని సాహసాలే ఈ చిత్రానికి హైలైట్’’ అని చెప్పారు.

 

  హుదూద్ తుపాను బాధితులు పడే ఇబ్బందులను అందరూ స్వయంగా వెళ్లి చూడాలని, వీలైనంత సహాయం చేయాలని మనోజ్ కోరారు. హుదూద్ బాధితులకు సంఘీభావంగా రామజోగయ్యశాస్త్రి రచన, అచ్చు స్వరాలతో రూపొందించిన ‘యూనిటీ..’ అనే పాటను ఈ వేదికపై వినిపించారు. ఈ వేడుకలో నాగేశ్వరరెడ్డి, అచ్చు, రచయిత కిశోర్ తిరుమల బృందం, శాంతా బయోటెక్ అధినేత వరప్రసాదరెడ్డి, సంపూర్ణేష్ తదితరులు పాల్గొన్నారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top