తినడానికి రెస్టారెంట్‌కి వెళ్తే కథలు అల్లేశారు!

తినడానికి రెస్టారెంట్‌కి వెళ్తే కథలు అల్లేశారు!


 ‘కలర్స్’ స్వాతి ఇప్పుడెక్కడున్నారు? చెన్నైలోనా?కేరళలోనా? అవును మరి... ఆమె ఇప్పుడు తమిళంలోనూ, మలయాళంలోనూ పాపులర్ స్టార్. తమిళంలో మూడు  సినిమాలు, మలయాళంలో ఒక చిత్రం చేస్తూ చాలా చాలా బిజీగా ఉన్నారు. తెలుగులో ఆమె నటించిన ‘కార్తికేయ’ ఈ నెల 24న విడుదల కానుంది. కేరళ షూటింగ్‌కి వెళ్తూ విమానాశ్రయం నుంచే ఫోన్‌లో ‘సాక్షి’తో స్వాతి ప్రత్యేకంగా ముచ్చటించారు.

 

 ఏంటండీ.. బాగా దగ్గుతున్నారు?

 ఏం లేదండీ. జలుబు చేసింది. దాంతో పాటు తగుదునమ్మా అంటూ ఈ దగ్గు ఒకటి. ఇలాంటి చిన్న చిన్న కారణాల కోసం షూటింగ్ ఎగ్గొట్టలేం కదా. అందుకే, తుమ్ముతూ, దగ్గుతూ షూటింగ్ కానిచ్చేస్తున్నా.

 

 ‘కార్తికేయ’ సినిమా విడుదల దగ్గరపడింది కదా.. టెన్షనేమైనా ఉందా?

 ఆ టెన్షన్ మొదటి సినిమా నుంచి ఉంది. ఎందుకంటే, కష్టపడటంవరకే మా చేతుల్లో ఉంటుంది. ఫలితం ప్రేక్షకుల చేతుల్లోనే కదా. ఈ చిత్రం విజయం సాధించాలని బలంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే, సినిమా పరిశ్రమలో విజయం విలువ ఎంత ఉంటుందో బాగా తెలుసు.

 

 ఈ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది?

 చాలా సాదాసీదా అమ్మాయి పాత్ర నాది. సినిమాలో మా నాన్నగారు (తనికెళ్ల భరణి) పూజారి. దీన్నిబట్టి మాది ఎంత సంప్రదాయబద్ధమైన కుటుంబమో ఊహించుకోవచ్చు. కానీ, నేను ఇంట్లో ఒకలా, కాలేజీలో మరోలా కనిపిస్తానన్నమాట.


 ‘స్వామి రారా’ తర్వాత మళ్లీ నిఖిల్‌తో కలిసి చేశారు కదా. అనుకోకుండా కాంబినేషన్ కుదిరిందా లేక కావాలనే చేశారా?

 ముందు ఈ కథను నిఖిలే విన్నాడు. ఆ తర్వాత నేను విన్నాను. ‘స్వామి రారా’ సక్సెస్ ప్రభావం వల్ల కావచ్చు, నేను తెలుగమ్మాయి కావడం వల్ల కావచ్చు. మొత్తానికి మా ఇద్దరితో సినిమా చేయాలని దర్శకుడు చందు, నిర్మాత శ్రీనివాస్ అనుకున్నారు. అంతే కానీ.. నిఖిల్, నేను కావాలని పనిగట్టుకుని చేసిన చిత్రం కాదిది.

 

 మరి.. మీకు, నిఖిల్‌కి మధ్య ఏదో ఉందనే ప్రచారం జరుగుతోందే?

 అదే అర్థం కావడంలేదు. మేమిద్దరం షూటింగ్ లొకేషన్లో తప్ప వేరే ఎక్కడా కలవం. ఈ మధ్య ‘కార్తికేయ’ ప్రమోషన్ కోసం నేను, నిఖిల్, మా డెరైక్టర్ కలిసి ఒకే కారులో ప్రయాణం చేశాం. అప్పుడు ఆకలేస్తే, ఏదైనా రెస్టారెంట్ దగ్గర ఆగి తినేవాళ్లం. అది చూసే కథలు అల్లేశారనుకుంటున్నా.

 

 నిప్పు లేనిదే పొగ రాదంటారు కదా?

 భలేవారే! సినిమా పరిశ్రమవారి గురించి వార్తలు రావడానికి ఏమీ అవసరంలేదు. వాటంతట అవి పుట్టుకొచ్చేస్తాయ్. పైగా గత ఆరు నెలలుగా నేను సరిగ్గా హైదరాబాద్‌లో ఉండటంలేదు. అది కూడా తెలుసుకోకుండా ఏవేవో ప్రచారం చేసేస్తున్నారు.

 

 అందుకేనేమో గాసిప్పురాయుళ్ల గురించి ఏకంగా కవిత రాసేశారు.. అంత కోపమా?

 కోపంతో రాసింది కాదండీ.. బాధతో రాశాను.

 

 సక్సెస్‌లో ఉన్న స్వాతికి దర్శక, నిర్మాతలు కనబడటంలేదు.. అనేది కూడా అసత్య ప్రచారమేనా?

 అక్షరాలా అంతే. ఏవో కొన్ని సినిమా పేర్లు చెప్పి, ‘స్వాతిని ఫలానా సినిమాకి అడిగారట.. నిర్మొహమాటంగా చేయనని చెప్పేసిందట..’ అంటూ ప్రచారం చేస్తున్నారు. అసలా సినిమా తాలూకు దర్శక, నిర్మాతలెవరూ నన్ను అడగనేలేదు. పోనీ.. నా మేనేజర్ నాదాకా రానివ్వలేదా అంటే.. నాకు మేనేజరే లేడు.

 

 దాదాపు సినిమా తారలందరూ మేనేజర్లను నియమించుకుంటారు కదా.. మీరెందుకని?

 సంవత్సరం పొడవునా హీరోయిన్ బిజీగా ఉండాలని కొంతమంది మేనేజర్లు కోరుకుంటారు. నేనేమో ఏ సినిమా పడితే అది చేయను. గ్యాప్ వచ్చినా, మంచి సినిమా అయితేనే చేస్తాను. నాలాంటివాళ్లకి మేనేజర్‌గా ఉండటానికి దాదాపు ఎవరూ ఇష్టపడకపోవచ్చు. అయినా మా అమ్మగారు నాతో పాటే ఉంటారు. తన సలహాలు తీసుకుంటాను. కథలు నేనే వింటాను. ఒకవేళ ఎవరైనా నన్ను కలవాలనుకుంటే ఫోన్ కొడితే చాలు.

 

 మీ గురించి వచ్చిన వార్తల్లో పెళ్లికి సంబంధించినది ఒకటి. మీ పెళ్లి ఖరారైందట కదా?

 ఆ వార్త విని నేనే షాకయ్యాను. పెళ్లి చేసుకోబోతున్నానని ప్రచారం చేశారు కదా.. విచిత్రం ఏంటంటే నాక్కాబోయే భర్త మొహం ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు (నవ్వుతూ). నా లైఫ్‌లో ఎవరైనా ఉంటేనే కదా.. పెళ్లి వరకు వెళ్లేది. పోనీ మా ఇంట్లో ఎవరినైనా చూశారా అంటే అది కూడా లేదు. మరి.. ఈ వార్త ఎక్కణ్ణుంచి పుట్టుకొచ్చిందో. కాకపోతే ఒకటి మాత్రం చెబుతాను.. ‘బహుశా నా పెళ్లి దగ్గర పడిందేమో. అందుకు సంకేతంగానే ఈ వదంతి వచ్చిందేమో’ అనుకుంటున్నాను.

 

 ఇలాంటి నమ్మకాలుంటాయా?

 జరిగే ప్రతి విషయానికీ ఓ కారణం ఉంటుందని నమ్ముతాను. జీవితంలో ఏదైనా చెడు జరిగిందనుకోండి.. మంచి జరిగే వరకూ ఓపిక వహించాలి. ఈలోపు కంగారుపడిపోయి కేరక్టర్‌ని వదులుకోకూడదు. సాధ్యమైనంత క్లీన్‌గా బతకాలి. అప్పుడే మంచిని ఆస్వాదించగలుగుతారు. అలాగే, మనకెవరైనా చెడు చేయడానికి ప్రయత్నించారనుకోండి.. కచ్చితంగా మనకు మంచే జరుగుతుంది.

 

 చిన్న వయసులోనే జీవితాన్ని బాగానే తెలుసుకున్నట్లున్నారు?

 అనుభవాలు నేర్పిన పాఠాలివి. నాకు జీవితంలో అన్నీ సులువుగానే కుదిరాయి. బుల్లితెరపై ‘కలర్స్’ ప్రోగ్రామ్‌కి ఈజీగా అవకాశం వచ్చింది. ఆ తర్వాత ‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే’ సునాయాసంగా వచ్చిన చాన్స్. ‘అష్టా చెమ్మా’ సినిమాకీ అంతే. వరుస విజయాలతో  చాలా బాగుండేది. నేను కూడా కెరీర్‌ని పెద్దగా సీరియస్‌గా తీసుకునేదాన్ని కాదు. కానీ, ‘అప్పల్రాజు’ ఫ్లాప్‌తో ఒక్కసారిగా కనువిప్పు కలిగింది. మనం ఏం చేస్తున్నాం? ఏం చేయాలి? అని ఆలోచించడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నా లైఫ్ కొంచెం డౌన్‌ఫాల్‌లో ఉండటంతో కొన్ని సత్యాలు తెలిశాయి. విజయం తాలూకు విలువ తెలిసింది అప్పుడే.

 

 తమిళంలో వరుసగా అవకాశాలు వస్తాయి. తెలుగు పరిశ్రమ మీ ప్రతిభను గుర్తించలేదంటారా?

 ఏమో  ఈ ప్రశ్నకు నాక్కూడా సమాధానం తెలియదు. నా వరకు నాకు యాక్ట్ చేయడం, డబ్బింగ్ చెప్పడం ఎంజాయ్ చేస్తాను. ఎక్కడ మంచి అవకాశం వచ్చినా చేస్తున్నాను. ఎక్కడ చేస్తే ఏం? పనిలో ఆనందం దొరుకుతోంది.

 - డి.జి. భవాని

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top