నిజంగా చరణ్ విషయంలో గర్వంగా ఫీలవుతాను : చిరంజీవి

నిజంగా చరణ్ విషయంలో గర్వంగా ఫీలవుతాను : చిరంజీవి - Sakshi


‘‘ ‘సినిమా రంగాన్ని విడిచి రాజకీయాల్లోకి వెళ్లారు కదా... మీకు బాధ అనిపించడం లేదా?’ అని చాలామంది నన్ను అడుగుతుంటారు. నిజానికి నాకు ఆ బాధ లేదు. దానికి కారణం చరణ్. నేను అనుకున్నదానికంటే తాను మంచి స్థాయికి చేరుకున్నాడు. ఈ రోజు చరణ్‌ని తెరపై చూస్తుంటే... నన్ను నేను చూసుకుంటున్నట్లుంటుంది. పాత్ర కోసం ఎంత కష్టానికైనా తాను నెరవడు. ఒళ్లు హూనం చేసుకొని ఇంటికొస్తాడు. కానీ... ఎక్కడా కష్టపడ్డట్టు కనిపించడు. ‘అంత కష్టపడతావ్. బాధ అని కూడా అనవేంట్రా...’ అని వాళ్ల అమ్మ అడిగితే... ‘నాన్న పడిన కష్టంతో పోల్చుకుంటే నాదీ ఓ కష్టమా’ అంటాడు.

 

  నిజంగా చరణ్ విషయంలో గర్వంగా ఫీలవుతాను’’ అని చిరంజీవి అన్నారు. రామ్‌చరణ్ కథానాయకునిగా కృష్ణవంశీ దర్శకత్వంలో బండ్ల గణేశ్ నిర్మిస్తున్న చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’. కాజల్ అగర్వాల్ ఇందులో కథానాయిక. శ్రీకాంత్, కమలినీముఖర్జీ, ప్రకాశ్‌రాజ్, జయసుధ కీలక పాత్రధారులు. యువన్‌శంకర్‌రాజా స్వరాలందించిన ఈ చిత్రం పాటల సీడీని సోమవారం హైదరాబాద్‌లో చిరంజీవి ఆవిష్కరించి, తొలి ప్రతిని సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావుకు అందించారు. చిరంజీవి మాట్లాడుతూ -‘‘కృష్ణవంశీ దర్శకత్వంలో నటించాలని నాకూ ఉండేది. కానీ... నటీనటుల నుంచి నటన రాబట్టడంలో ఆయన దిట్ట.

 

  ఇన్ని సినిమాలు చేశాక, ఆయనకు నచ్చేట్టు నటించడానికి నేను ఆయన ముందు తలవంచడం ఇష్టం లేక చేయలేదు. నాకు ఒక ‘విజేత’ సినిమాలా చరణ్‌కి ‘గోవిందుడు అందరివాడేలే’ నిలుస్తుందని నమ్మకంగా చెప్పగలను’’ అని చెప్పారు. ‘పవర్‌స్టార్... పవర్‌స్టార్’ అని అభిమానులు చేస్తున్న నినాదాలకు బ్రేక్ వేస్తూ -‘‘ ‘గోవిందుడు అందరివాడేలే’ 150వ రోజుల వేడుకకు కళ్యాణ్ వస్తే మీకేమైనా అభ్యంతరమా!’ అని చిరంజీవి అన్నారు. చరణ్ మాట్లాడుతూ -‘‘నేను ఎన్ని హిట్ సాంగ్స్‌లో నటించినా.... ఈ సినిమాలోని ‘నీలిరంగు చీరలో’ పాట అన్నింటికంటే బెస్ట్. సుద్దాల అశోక్‌తేజగారు గొప్పగా ఆ పాట రాశారు’’ అని తెలిపారు.

 

 చరణ్ చిత్రసీమలో జగదేకవీరునిగా ఎదగాలని కె.రాఘవేంద్రరావు ఆకాంక్షించారు. 30 ఏళ్ల క్రితం చిరంజీవిగారు ఇండస్ట్రీకి రాకుంటే... పవన్‌కల్యాణ్, చరణ్, బన్నీలను తెరకు పరిచయం చేయకుంటే... తెలుగు సినిమా పరిస్థితిని ఊహించలేమనీ బండ్ల గణేశ్ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, కాజల్ అగర్వాల్, కమలినీ ముఖర్జీ, పరుచూరి బ్రదర్స్, కె.ఎస్.రామారావు, వరుణ్‌తేజ్, సాయిధరమ్‌తేజ్ తదితరులు పాల్గొన్నారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top