ఆ ఒక్క పాత్ర కోసం...ఉన్న డబ్బంతా పోగొట్టుకున్నా!

ఆ ఒక్క పాత్ర కోసం...ఉన్న డబ్బంతా  పోగొట్టుకున్నా! - Sakshi


 ఇక చాలు.. జీవితంలో ఇంకేం మిగిలిందని... ఆత్మహత్య ఒక్కటే మార్గం.. ఆ రోజు ఉదయం నుంచీ సాయంత్రం వరకూ... చంద్రమౌళి మనసు మనసులో లేదు. కొడుకు పడుతున్న సంఘర్షణ తల్లి మనసు గ్రహించేసింది... ‘పిచ్చోడా.. 40, 50 ఎకరాల మాగాణి ఉండేది మనకు... అంతా పోయింది... మిమ్మల్ని బతికించుకోలేదా? వద్దు నాన్నా.. పిరికితనం మంచిది కాదు..’ తల్లి నోటి నుంచి ఈ మాటలు వినగానే.. చంద్రమౌళికి ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. ఆ రాత్రి బాగా నిద్రపట్టేసింది... ఎప్పుడూ ఉదయం ఐదు గంటలకల్లా నిద్రలేవడం ఆయన అలవాటు.. కానీ, ఆరోజు మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట వరకూ హాయిగా నిద్రపోయారు. మనసు, శరీరం రెండూ తేలికయ్యాయి. ఇంతకీ చంద్రమౌళి ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకనుకున్నారు? ‘రీల్’పై పేద పాత్రలకు చిరునామా అయిన ఆయన ‘రియల్ లైఫ్’ని తెలుసుకుందాం...

 

 చిత్తూరు జిల్లాకు చెందిన కుమ్మరి కండ్రిగలో పుట్టారు చంద్రమౌళి. తల్లిదండ్రులు, ముగ్గురు అన్నయ్యలు, ముగ్గురు అక్కలతో చంద్రమౌళి జీవితం బాగుండేది. పెద్ద వ్యవసాయ కుటుంబం. అందరూ చదువుకున్నారు కానీ.. ఐదారు తగరతుల వరకే. ‘‘మోహన్‌బాబుగారు తండ్రి నారాయణస్వామిగారి దగ్గర నేను, మా అన్నయ్య ఐదో క్లాస్ వరకు చదువుకున్నాం. అయితే మా ఊరి నుంచి స్కూల్ ఐదు కిలోమీటర్లు దూరంలో ఉండటంతో చదువు ఆపేశాం’’ అని చెప్పారు చంద్రమౌళి.మేనమామ ప్రేరణతో నాటకాల మీద మక్కువ మొద లైంది. ఈలోగా కథ ఊహించని మలుపు తిరిగింది. మాగాణి అంతా అమ్మేసుకోవాల్సిన పరిస్థితి. పూలమ్ముకున్న చోట కట్టెలమ్ముకోవాల్సిన పరిస్థితి. అప్పుడు చంద్రమౌళిది 20 ఏళ్ల వయసు. మద్రాసు వెళ్లి సినిమాల్లో ట్రై చేస్తే, కాస్త భరోసా వస్తుందనుకున్నారు. కట్ చేస్తే..

 

 ‘అంతా మన మంచికే’లో చిన్న వేషం దొరికింది. ఆ చిత్రానికి దర్శకురాలు, కథానాయిక భానుమతి. ఆఫీసుకెళ్లగానే ఒక డైలాగ్ ఇచ్చి, నటించమన్నారామె. భయం, బిడియం పక్కనపెట్టి, నటించేశారు చంద్రమౌళి. ‘భేష్ సెలక్ట్ అయ్యావు’ అనడంతో సంబరపడిపోయారు. మోసగాళ్లకు మోసగాళ్లు, పండంటి కాపురం, చెల్లెలి కాపురం వంటి సినిమాల్లోనూ చిన్న చిన్న వేషాలు వేశారు. కానీ, వరుసగా ఒకే రకం పాత్రలు రావడంతో మూడేళ్ల తర్వాత తిరిగి తన ఊరెళ్లిపోయారు. అప్పటికి ఆర్థిక పరిస్థితి ఇంకా హీనంగా తయారు కావడంతో అక్కడా ఉండలేకపోయారు. అయినా ఓ ఆరేడేళ్లు ఏదో చిన్నా చితకా పనులు చూస్తూ నెట్టుకొచ్చేశారు. అక్క కూతుర్ని పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల కాపురం తర్వాత మళ్లీ మనసు సినిమాలపైకి మళ్లింది. దాంతో 1981లో తిరిగి చెన్నయ్ వెళ్లిపోయారు. నాటకాలు... చిన్న చిన్న వేషాలు.. గుర్తింపు రాలేదు. రాబడి అంతంత మాత్రమే. ఏం చేయాలి? ఏదైనా సినిమాలో కొంత పెట్టుబడి పెడితే...? చంద్రమౌళి బాగా ఆలోచించారు.

 

 అప్పుడు మొదలైనదే ‘కలియుగ దైవం’ సినిమా. కథ ఆయనదే. తనకోసం ఓ మంత్రగాడి వేషం కూడా రాసుకున్నారు. ఆ పాత్రతో తన జీవితం మంచి మలుపు తిరుగుతుందని ఆశించారు. సరే.. సినిమా మొదలైంది. 8 లక్షలు అనుకున్న సినిమా 13 లక్షలయ్యింది. మంచి పాత్ర కాబట్టి, తన వాటాగా ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టారు. చివరికి మంత్రగాడి వేషం చిత్రీకరణ మొదలుపెట్టేసరికి, ‘ఈ పాత్ర నువ్వు వేస్తే బాగుండదు. ఎవరైనా పెద్ద ఆర్టిస్ట్‌తో చేయిస్తే బాగుంటుంది’ అని దర్శక, నిర్మాతలు అన్నప్పుడు షాక్ అయ్యారు. ఓ ప్రముఖ నటుణ్ణి పిలిపించి, భారీ పారితోషికం ఇచ్చి, ఆయనతో చేయించేశారు. ‘‘ఆ రోజు పడ్డ బాధని నేనెప్పుడూ పడలేదు. ఆ ఒక్క పాత్ర కోసం ఉన్నదంతా పోగొట్టుకున్నా. అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’’ అన్నారు.

 

 అప్పటికి ఇద్దరబ్బాయిలు పుట్టారు. ఉన్న కాస్తా కూస్తా కూడా పోయింది. ఊరెళ్లిపోదామంటే మొహం చెల్లలేదు. దాంతో ఏ వేషమొస్తే ఆ వేషం.. ఎంతిస్తే అంత... అలా తన 44 ఏళ్ల కెరీర్‌లో వందల పాత్రలు చేసినా.. బ్రేక్ అంటూ చెప్పుకోదగ్గ పాత్ర ఏదీ లేదు. కాకపోతే ఒకే ఒక్క సంతృప్తి మాత్రం మిగిలింది. ‘ఎన్టీఆర్‌గారు, ఏయన్నార్‌గారు.. వంటి వారు కనబర్చిన ఆదరణ మర్చిపోలేనిది. మోహన్‌బాబుగారు ఎన్నిసార్లు సహాయం చేశారో చెప్పలేను. ఓ సందర్భంలో దాసరి నారాయణరావుగారు 24 శాఖలకు సంబంధించినవాళ్లల్లో సీనియర్స్‌ని సన్మానించేటప్పుడు నన్నూ సన్మానించారు. అదెప్పటికీ మర్చిపోలేను’’ అన్నారు.

 

 చంద్రమౌళి ఇప్పటికీ సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తున్నారు. కానీ, ఎప్పటిలానే పేద తండ్రి, బాబాయ్, పెదనాన్న, పేద రైతు, కూలి... ఇవే పాత్రలు. ఒక్కసారి కూడా తెరపై తనను తాను కోటీశ్వరుడిగా చూసుకునే అవకాశం మాత్రం దక్కలేదు. అయినా కూడా ధీమాగానే ఉన్నారు. ఎందుకంటే కొడుకులిద్దరూ బాగా చదువుకున్నారు. మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరికీ పెళ్లిళ్లు చేసేశారు. ఇప్పటివరకూ తాను ఏం సంపాదించినా అదంతా భార్య చేతికే ఇచ్చారాయన. ఆమె జాగ్రత్త చేయడంతో, పిల్లలకు కొంత ఆర్థిక భరోసా ఇవ్వగలిగానని చెప్పారు చంద్రమౌళి. ఆ భరోసాకి వాళ్ల సంపాదన కూడా తోడు కావడంతో పిల్లలిద్దరూ సొంత ఇళ్లు కట్టుకోగలిగారు. ‘‘ఊహ తెలిసినప్పట్నుంచి ఇప్పటివరకూ వైభవాలు అనుభవించకపోయినా.. కనీసం పిల్లలైనా చక్కగా స్థిరపడినందుకు ఆనందంగా ఉంది. ఇక నన్ను మించిన కోటీశ్వరుడు ఎవరుంటారో చెప్పండి’’ అని ఉద్వేగానికి లోనవుతూ ముగించారు చంద్రమౌళి.

 - డి.జి. భవాని

 

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top