కొత్త కథలుంటే చెప్పమని అందరూ అడుగుతున్నారు : చందు మొండేటి

కొత్త కథలుంటే చెప్పమని అందరూ అడుగుతున్నారు : చందు మొండేటి


 ‘‘సినిమా విడుదలకు ముందు రిజల్ట్ కోసం టెన్షన్‌గా ఎదురు చూశా. ప్రేక్షకుల స్పందన తెలిశాక హమ్మయ్య అనుకున్నా’’ అని దర్శకుడు చందు మొండేటి అన్నారు. నిఖిల్, స్వాతి జంటగా ఆయన దర్శకత్వం వహించిన ‘కార్తికేయ’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అటు ప్రేక్షకుల్ని ఇటు సినీ పరిశ్రమ వారిని చిత్రం ఆకట్టుకుంటోందంటూ చందు ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

 

  మాది కొవ్వూరు. కానీ, పెరిగిందంతా చెన్నయ్‌లోనే. బీటెక్ చదివాను. సినిమాలంటే ఇష్టమే కానీ.. డెరైక్టర్ అవ్వాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. అయితే, సినిమా పరిశ్రమలోనే స్థిరపడాలనుకున్నాను. లైట్‌మేన్‌గా చేరితే.. కెమెరామేన్ కావొచ్చనీ, కథలు రాసుకుంటే రచయితగా స్థిరపడొచ్చనీ అనుకున్నాను. నేను కథ చెప్పే విధానం చూసి, నా స్నేహితులు ‘నీలో డెరైక్టర్ లక్షణాలున్నాయి’ అనేవారు. కానీ, పెద్దగా పట్టించుకునేవాణ్ణి కాదు. ఓసారి హైదరాబాద్‌లో 10, 15 రోజులుందామని వచ్చాను. ఆ సమయంలోనే సుకుమార్‌గారి ‘ఆర్య’ విడుదలైంది. ‘కొత్త పాయింట్‌తో తీశాడు’ అంటూ ఎక్కడ చూసినా సుకుమార్‌గారి గురించే! కొత్తగా తీస్తే, దర్శకుడికి ఇంత పేరొస్తుందా అనిపించింది. అప్పటికే నా దగ్గర కొత్త పాయింట్స్ ఉండటంతో డెరైక్టర్ అవుదామనుకున్నా.

 

  ఇక్కడ కొంతమంది స్నేహితుల ద్వారా సుధీర్ వర్మ, నిఖిల్‌లతో పరిచయం ఏర్పడింది. అప్పుడు

 నిఖిల్ కీలక పాత్రలో ఓ సినిమా ఆరంభమైతే, నేనూ, సుధీర్ దర్శకత్వ శాఖలో చేరాం. ఆ చిత్రం ఆగినా, మా స్నేహం మాత్రం కొనసాగుతోంది. ఆ తర్వాత పరశురామ్ దగ్గర ‘యువత’కి చేశాను. అలాగే రెండు, మూడు సినిమాలకు రచయితగా వ్యవహరించాను. అప్పుడు ‘కార్తికేయ’ కథతో దర్శకుడు కావాలనుకున్నాను. ‘స్వామి రారా’వంటి వినూత్న కథాంశంతో సుధీర్ హిట్ సాధించడంతో బలమైన కథలకు ఆదరణ ఉంటుందనే నా నమ్మకం ఇంకా పెరిగింది. నిఖిల్ ‘కార్తికేయ’ కథ వినడం, తనకు నచ్చడంతో వెంటనే మొదలుపెట్టాం.

 

  ‘కార్తికేయ’ విడుదల తర్వాత ఎంతోమంది ప్రముఖులు ఫోన్ చేసి, అభినందించారు. అల్లు అర్జున్, వినాయక్‌గారు, సుకుమార్‌గారు, సుప్రియ, అశ్వనీదత్‌గారి కుమార్తె ప్రియాంకా దత్ ఫోన్ చేసి, అభినందించారు. ఏవైనా కొత్త కథలుంటే చెప్పమని అందరూ అడుగుతున్నారు. నా దగ్గర నాలుగైదు కథలున్నాయి. వాటిలో ఒకటి నాగార్జునగారికి సరిగ్గా సరిపోతుంది. నేను ఆయన అభిమానిని. అందుకే, ఆయనకు తగ్గ కథ రెడీ చేశాను.

 

  ఇకపై డబ్బు తెచ్చిపెట్టే సినిమాలే తీస్తా. ‘కార్తికేయ’ విడుదలయ్యాక, ఆదరణ బాగుండడంతో ఇంకా థియేటర్లు పెంచాం. ఈ విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో నా తదుపరి చిత్రాలను కూడా వినూత్న కథాంశాలతోనే చేస్తా.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top