బ్రూస్‌లీ చెప్పిందే నాకు స్ఫూర్తి!

బ్రూస్‌లీ చెప్పిందే నాకు స్ఫూర్తి!


‘‘ ‘బ్రూస్‌లీ’ అవుట్‌పుట్ విషయంలో నేను ఫుల్ హ్యాపీ’’ అంటున్నారు శ్రీను వైట్ల. ఓ కసితో, ఓ దీక్షతో చాలా తక్కువ టైమ్‌లో ఇంత క్వాలిటీ ప్రొడక్ట్ తీసుకురావడమంటే మాటలు కాదు. ‘‘చిరంజీవి గారు, రామ్‌చరణ్ ఇచ్చిన సపోర్ట్‌తోనే ఎలాంటి ప్రెజర్ లేకుండా పనిచేయగలిగా’’ అన్నారు శ్రీను వైట్ల. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘బ్రూస్‌లీ’ గురించి, తన కెరీర్ గురించి శ్రీను వైట్ల చాలా విషయాలు చెప్పారు.




 

రామ్‌చరణ్‌ని ఫైటర్‌గా చూపించాలని ఎందుకనిపించింది?

హీరోకి ఏదో ఒక ప్రొఫెషన్ పెట్టాలి. చరణ్ ఫిజిక్‌కి తగ్గట్టు ఫైటర్ అయితే కొత్తగా ఉంటుందనిపించింది. అందరూ అదే ఫీలయ్యారు.

 

‘బ్రూస్‌లీ’ టైటిల్ ఎందుకు పెట్టినట్టు?

ఇందులో చరణ్ పాత్ర పేరు కార్తీక్. బ్రూస్‌లీకి వీరభక్తుడు. అందరూ బ్రూస్‌లీ అనే నిక్‌నేమ్‌తో పిలుస్తారు. అందుకే టైటిల్ అదే పెట్టేశాం.

 

ఇందులో చిరంజీవి పాత్రకు తొలుత పవన్‌కల్యాణ్‌ని అనుకున్నారట?

ఆ సీన్ అనుకోగానే మొదట మేం అనుకున్నది చిరంజీవి గారినే. అదృష్టవశాత్తూ మేం అడగ్గానే ఆయన కూడా ఓకే అన్నారు.

 

చిరంజీవి చాలా ఏళ్ల తర్వాత షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆయనను ఎలా చూపించాలనే విషయంలో ఒత్తిడి ఫీలయ్యారా?

చిరంజీవి గారితో ముందే బాగా డిస్కస్ చేసి మరీ వెళ్లాం కాబట్టి నో ప్రెజర్. ఆయన కనబడే అయిదు నిమిషాలూ అద్భుతంగా ఉండాలని మేం బోలెడన్ని కసరత్తులు చేశాం. నిజంగానే ఆయన ఆ ఐదు నిమిషాల ఎపిసోడ్‌తో సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లారు.

 

చిరంజీవిగారు కేవలం ఓ యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే చేశారా? స్పెషల్ సాంగ్ కూడానా?

లేదండీ. ఒక డైలాగ్, యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే ఉన్నాయి. పాట పెడదామని అత్యాశతో ప్రయత్నించాను గానీ కుదర్లేదు(నవ్వుతూ).ఈ సినిమాలో ఆరో పాటకు బదులు చిరంజీవిగారి ఎంట్రీ ఉంటుంది. అంతకు మించి నేనేం చెప్పలేను.

 

చిరంజీవిగారి 150వ చిత్రాన్ని డెరైక్ట్ చేసే అవకాశం వస్తే చేస్తారా?

తప్పకుండా. అది  చాలా గొప్ప విషయం. ఆయనను మళ్లీ డెరైక్ట్ చేయాలని ఉంది. అన్నీ కుదిరితే తప్పకుండా చేస్తాను.

 

చిరంజీవిగారితో ‘అందరివాడు’, రామ్‌చరణ్‌తో ‘బ్రూస్‌లీ’  చేశారు. వీళ్లిద్దరి మధ్య మీరు గమనించిన సిమిలారిటీస్?

చిరంజీవిగారిలో కనిపించే బ్యాలెన్సెడ్ నేచర్, వర్క్ అంటే డెడికేషన్, కమిట్‌మెంట్ రామ్‌చరణ్ పుణికి పుచ్చుకున్నాడు.

 

చిరంజీవిగారిది సెపరేట్ కామెడీ టైమింగ్. మరి చరణ్ కామెడీ టైమింగ్ ఎలా అనిపించింది?

ఎవరి దగ్గరైతే సెన్సాఫ్ హ్యూమర్ ఉంటుందో వాళ్లందరూ నాకు బాగా కనెక్ట్ అవుతారు. రామ్‌చరణ్‌లో మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంది. అందుకే చాలా ఈజీగా మా ఇద్దరి మధ్య మంచి ర్యాపో కుదిరింది. అది ఇప్పటి వరకూ ఆయన నటించిన సినిమాల్లో సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదని నా ఫీలింగ్.

 

మీరు-కోన వెంకట్-గోపీమోహన్ మంచి టీమ్. ‘బాద్‌షా’ తర్వాత కోన వెంకట్‌తో ఇక పని చేయరని వార్తలొచ్చాయి. ‘బ్రూస్‌లీ’ కోసం చరణ్ మిమ్మల్ని కలిపారని టాక్. నిజమేనా?

2003 నుంచి మేం ట్రావెల్ అవుతున్నాం. క్లాషెస్ అనేవి కామన్. అలాగని శత్రుత్వం పెంచుకుని పనిచేయడం మానేయలేం కదా... నాకూ కోనతో పనిచేయాలని ఉంది. వాళ్లకూ అదే ఫీలింగ్. రామ్‌చరణ్ ఓ స్టెప్ ముందుకేసి మా కాంబినేషన్ మళ్లీ సెట్ చేశాడు. అయినా గతం గతః. ఇప్పుడు మా మధ్య ఎలాంటిస్పర్థలూ లేవు. అందరం ఫుల్ హ్యాపీ.

 

మీకంటూ ఓ సెపరేట్ కామెడీ ట్రెండ్ సృష్టించారు. ‘బ్రూస్‌లీ’ కూడా ఆ తరహాలోనే ఉంటుందా?

కథ చెప్పడంలో రెండు పద్ధతులు ఉంటాయి. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం కథ రాసుకోవడం ఓ పద్ధతి. కథను ఎంటర్‌టైనింగ్‌గా చెప్పడం ఓ స్టయిల్. నేను ఆ రె ండు పద్ధతుల్లో సినిమా తీసి విజయం సాధించాను. కానీ కథను ఎంటర్‌టైనింగ్‌గా చెప్పడంలో కిక్ ఉంది.  ఎంటర్‌టైనింగ్‌గా కథను చెప్పడానికి చేసిన  మరో ప్రయత్నమే బ్రూస్‌లీ.ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందించాం.

 

మీ గత సినిమాల్లోలాగా ఎవరి మీదైనా పేరడీ ఉంటుందా?

అసలు అలాంటి సన్నివేశాలేవీ ఇందులో ఉండవు. అందరికీ నచ్చేలా ఈ సినిమా రూపొందించాం. సెపరేట్ కామెడీ ట్రాక్ ఉండదు. కథతో పాటు హాస్యం మిళితమై ఉంటుంది. ‘ఢీ’  సినిమా నుంచి ఓ  ఫార్మాట్ క్రియేట్ చేశాను. కానీ ఆ ఫార్మాట్ అందరికీ బోర్ కొట్టేసింది. నాతో పాటు చాలా మంది అదే ఫార్మాట్ ఫాలో అయ్యారు. నా మీద చాలా మందికి కోపం కూడా వచ్చింది. అందుకే ఈసారి నా పంథా మార్చాను. కానీ నా మార్క్ కామెడీ మాత్రం మిస్ కాదు.

 

ఓ మంచి హిట్ సాధించి తీరాలన్న కసితో ఇంత పెద్ద సినిమాను అయిదు నెలల్లో కంప్లీట్ చేసినట్టున్నారు?

ఒకటైతే నిజం. కొంత కాలం డిస్టర్బ్ అయ్యాను. నా మీద విమర్శలను కూడా ప్రేమగా తీసుకుని మళ్లీ వర్క్ చేయడం మొదలు  పెట్టాను. ఇంత షార్ట్ స్పాన్‌లో ఇంత క ంటెంట్ ఉన్న సినిమా తీయడానికి నా టెక్నీషియన్స్, నటీనటుల సపోర్ట్ ఎంతో ఉంది. నా అదృష్టం  ఏమిటంటే నాపై ఎలాంటి ప్రెజర్ లేదు. చాలా క్లారిటీతో ప్లానింగ్ చేసుకుంటూ ఈ షూటింగ్ చేశాం. ముఖ్యంగా కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస సహకారం లేకపోతే  రిలీజ్ డేట్ కచ్చితంగా మార్చాల్సి వచ్చేది.

 

‘ఆగడు’ టైమ్‌లో మీకూ ప్రకాశ్‌రాజ్‌కీ మధ్య మాటల యుద్ధం జరిగింది కదా. మళ్లీ కలిసి పని చేస్తారా?

ఎందుకు చేయను? సినిమా అనేది క్రియేటివ్ జాబ్.  కథకు ఏం కావాలో ఒక దర్శకునికి ఒక అవగాహన ఉంటుంది. ఆ అవగాహనతో మనం చెప్పింది ఒక్కోసారి కొంత మంది ఆర్టిస్ట్‌లకు నచ్చకపోవచ్చు. ఆ సమయంలో క్లాషెస్ సహజం. ప్రకాశ్ బ్రిలియంట్ యాక్టర్. ఆయనతో తప్పకుండా పని చేస్తాను.

 

‘ఆగడు’  సినిమా పరాజయాన్ని ఎప్పుడైనా విశ్లేషించుకున్నారా?

కచ్చితంగా. గెలిచినప్పుడు కంటే ఓడినప్పుడే ఎక్కువ అనుభవాలు ఎదురవుతాయి. ఆ టైమ్‌లో మూడు రోజులు ఇంట్లోనే ఉండిపోయాను. నాలుగో రోజు  నుంచి మళ్లీ మామూలైపోయి ‘బ్రూస్‌లీ’ కథ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాను.

 

కెరీర్‌లో ఇబ్బందుల్ని ఎలా ఫేస్ చేయగలిగారు?

‘‘సాఫీగా సాగిపోయే జీవితం గురించి ప్రార్థించకు. ఎలాంటి కష్టాన్నయినా ఎదుర్కొనే బలం కోసం ప్రార్థించు’’ అని ‘బ్రూస్‌లీ’ చెప్పిన క్యాప్షన్‌ను ఈ సినిమాలో ఉపయోగించాం. దాన్నే నేనూ స్ఫూర్తిగా తీసుకున్నా. కష్టాలకు  ఎదురెళ్లి పోరాడటమే కదా జీవితం.

 

మీ సినిమాల్లో హీరోయిన్లకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడానికి కారణం?

ఇది హీరో సెంట్రిక్ ఫీల్డ్ కాబట్టి హీరోయిన్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేం. లవ్‌స్టోరీ అయితే హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది.

 

మహేశ్‌బాబుతో మీ రిలేషన్ ఎలా ఉంది?

మహేశ్  చాలా మంచి వ్యక్తి. తన గురించి మీకో ఎగ్జాంపుల్ చెబుతా. ‘ఆగడు’ విడుదలైన 5 రోజులకు నా పుట్టినరోజు వచ్చింది. మహేశ్‌బాబు మాత్రం నా పుట్టినరోజును చాలా ఘనంగా సెలబ్రేట్  చేశారు. ఇప్పటికీ ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉంటాం. వీలు చిక్కితే కలుస్తాం. మా బంధం జయాపజయాలకు అతీతం. ఇంతకు మించి నేనేం చెప్పలేను.

 

మీ నెక్స్ట్ ప్రాజెక్ట్?

ప్రస్తుతం కథలు తయారు చేసే పనిలో ఉన్నాను. ఇంకా ఎవరితో అనేది అనుకోలేదు.  ఈ సినిమా రిలీజ్ తర్వాత ప్రకటిస్తా.

 

ఈ మధ్య కాలంలో చాలామంది దర్శకులు సోషియో ఫ్యాంటసీ, హిస్టారికల్ మూవీస్ తీస్తున్నారు. మీక్కూడా అలాంటి ఆలోచనేమైనా ఉందా?

ఆ ఆలోచనైతే ఉంది. ఎప్పుడు అనేది చెప్పలేను. దాని కోసం కొంత టైమ్ తీసుకుని రీసెర్చ్ చేయాలి. కచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు చేస్తాను. అలాగే బాలీవుడ్‌లో మసాన్, పీకూ, పీకే... లాంటి డిఫరెంట్ జానర్స్‌లో సినిమాలొస్తున్నాయి. నాక్కూడా హ్యూమన్ ఎమోషన్స్‌కు అద్దం పట్టే అలాంటి సినిమాలు తీయాలని ఉంది. కచ్చితంగా తీస్తా. అన్నీ కుదిరితే త్వరలో మంచి ప్రేమ కథ చేస్తా.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top