పులి కడుపున పులే పుడుతుంది

పులి కడుపున పులే పుడుతుంది - Sakshi


బ్రూస్‌లీ-2 చిత్రంలో చిరంజీవి పాత్ర ఆయన అభిమానులకే కాదు, సాధారణ ప్రేక్షకులకూ సర్‌ప్రైజింగ్ ఉంటుంది అని అన్నారు ఆ చిత్ర దర్శకుడు శ్రీనువైట్ల. రెడీ, దుబాయ్‌శ్రీను, డీ,దూకుడు, బాద్‌షా వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ఈ దర్శకుడి తాజా చిత్రం బ్రూస్‌లీ. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ కథానాయకుడుగా నటించిన ఈ చిత్రంలో రకుల్‌ప్రీతి నాయికగా నటించారు. నదియా,అమిదాస్, షియాజీ షిండే, కీర్తీ కర్బంధ, సంపత్, రమేశ్‌రావు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా నటుడు అరుణ్‌విజయ్ విలన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు.



కాగా ఈ చిత్రాన్ని బ్రూస్‌లీ-2 పేరుతో భద్రకాళీ ఫిలింస్ అధినేత భద్రకాళీ ప్రసాద్ తమిళంలోకి అనువదిస్తున్నారు. అడ్డాల వెంకట్రావు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌ఎస్.తమన్ సంగీతాన్ని అందించారు.తమిళ వెర్సన్ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఉదయం చెన్నైలోని నక్షత్ర హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు తమిళసినీ ప్రముఖులు హాజరయ్యారు.


 

పులి కడుపున పులిబిడ్డే పుడతాడు:

ప్రముఖ నిర్మాత ఎడిటర్ మోహన్ మాట్లాడుతూ పులి కడుపున పులిబిడ్డే పుడతాడన్న చందాన మెగాస్టార్‌గా అశేష అభిమానుల ఆదరణను పొందిన చిరంజీవి వారసుడు రామ్‌చరణ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. తాను మొదట్లో ధర్మచక్రం పేరుతో చిరంజీవి నటించిన చిత్రాన్ని తమిళంలోకి అనువాదం చేశానన్నారు.ఆ తరువాత ఆయన హీరోగా హిట్లర్ అనే నేరు చిత్రాన్ని నిర్మించానని అలాగే ఈ బ్రూస్‌లీ-2 చిత్రాన్ని అనువాదం చేసిన భద్రకాళీ ప్రసాద్ త్వరలోనే రామ్‌చరణ్ తో స్ట్రెయిట్ చిత్రం చేస్తారని ఆశిస్తున్నానన్నారు.

 

హార్డ్‌వర్క్ చేశారు: భారీ చిత్రాల నిర్మాత ఏఎం.రత్నం మాట్లాడుతూ రామ్‌చరణ్ తొలి చిత్రంలోనే ఎంతో హార్డ్‌వర్క్ చేసి నటించి చాలా ఆశ్చర్యపరచారు.ఆయన నటించిన ఈ బ్రూస్‌లీ-2 పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నానన్నారు.

 

బ్రూస్‌లీ-2 ఘన విజయం సాధిస్తుంది

రామ్‌చరణ్ నటించిన చిత్రాలన్నీ ఘన విజయం సాధించాయి.దర్శకుడు శ్రీనువైట్ల చేసిన చిత్రాలన్నీ విశేష విజయాలను పొందాయి.నటి రకుల్‌ప్రీతి వరుస విజయాలను అందుకుంటున్నారు.ఈ ముగ్గురి కలయికలో వస్తున్న బ్రూస్‌లీ-2 విజయం సాధించడం తథ్యం అన్నారు దక్షిణ భారత సినీ వాణిజ్యమండలి కార్యదర్శి కాట్రగడ్డ ప్రసాద్.

 

90 శాతం పర్ఫెక్ట్‌గా డాన్స్ చేశారన్నా: చిరంజీవిగారు లేకుంటే తెలుగులో తాను నృత్య దర్శకుడిని అయ్యి ఉండేవాడిని కాదు. తొలి అవకాశాన్ని ఆయనే కల్పించారు. చిరంజీవిగారితో దాయిదాయి దామ్మా పాట చిత్రీకరిస్తున్నపుడు రామ్‌చరణ్‌ను హీరోగా పరిచయం చేయనున్నట్లు చెప్పారు. ముందుగా ఆయన సిస్టర్ పెళ్లి వేదికపై రామ్‌చరణ్‌తో డాన్స్ చేయిద్దామ్ అని చిరంజీవి గారు అన్నారు. దీంతో తానే వారం రోజుల పాటు రామ్‌చరణ్‌కు డాన్స్‌లో శిక్షణ నిచ్చాను. ఆ తరువాత పెళ్లి వేదికపై రామ్‌చరణ్ సూపర్బ్‌గా డాన్స్ చేశారు.



అది చూసి చిరంజీవిగా ఎలా ఉంది డాన్స్ అని తనను అడిగారు. అప్పుడు తాను 90 శాతం ఓకే అన్నాను. చిరంజీవిగారు అదేమిటిరా అన్నారు. మీరు చేస్తేనే 100 శాతం సూపర్‌గా ఉంటుంది. మిగతా ఎవరు డాన్స్ చేసినా తాను 100 మా ర్కులు వేయలేను అన్నాను.అలాంటిది బ్రూస్‌లీ-2 చిత్రంలో రామ్‌చరణ్ డాన్స్,ఫైట్స్ అన్నీ సూపర్‌గా చేశారన్నారు.

 

ఈ చిత్రంలో ఆ పొరపాటు చేయలేదు:

చిత్ర దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ బ్రూస్‌లీ అనగానే ఇదేదో యాక్షన్ కథా చిత్రం అనుకోవద్దన్నారు.యాక్షన్‌తో పాటు ప్రేమ, వినోదం,సెంటిమెంట్ అన్ని అంశాలు ఉంటాయన్నారు.బ్రూస్‌లీ-2 మంచి ఫ్యామిలీ ఎంటర్‌టెయినర్ చిత్రం అని అన్నారు. ఇక ఈ చిత్రంలో చిరంజీవి ఒక అతిథి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే నని ఆ పాత్ర అభిమానుల్ని సర్‌ప్రైజ్ చేసేదిగా ఉంటుందని శ్రీనువైట్ల అన్నారు. చాలా గ్యాప్ తరువాత ఒక ప్రెస్టేజియస్ చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని నటి రకుల్‌ప్రీతి అన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top