నాకు సినిమాయే జీవితం

నాకు సినిమాయే జీవితం - Sakshi

‘‘కొన్నేళ్ల క్రితం నా పుట్టినరోజు మా ఇంటికే పరిమిత మయ్యేది. మా ఊరు పెదకాకానిలో గల శివాలయానికివెళ్లి శివుణ్ణి దర్శించుకునేవాణ్ణి. ఈ రోజు కోట్లాది మంది ప్రేక్షకులకు దగ్గరయ్యే స్థాయిలో ఉన్నానంటే ఆ  భగవంతుని ఆశీస్సులే కారణం’’ అని బోయపాటి శ్రీను చెప్పారు. నేడు ఆయన పుట్టినరోజు.ఇటీవల బాలకష్ణతో ‘లెజెండ్’తీసిన బోయపాటి, తదుపరి రామ్‌చరణ్‌తో సినిమాచేయడానికి కసరత్తులు చేస్తున్నారు.  స్టార్స్‌తో సినిమా చేసేటప్పుడు తప్పనిసరిగా వారి ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే, మొదటి మూడు రోజులు వాళ్ల అభిమానులే ఎక్కువగా సినిమాని చూస్తారు. అందుకే, స్టార్ హీరో అంటే అభిమానుల అంచనాలను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు, వాణిజ్య అంశాలను మేళవించి సినిమా తీయాల్సి ఉంటుంది.

 

  నాకు సినిమాయే జీవితం. అందుకే, షూటింగ్ ప్రారంభించే ముందు కథకు ఎక్కువ రోజులు కేటాయిస్తాను. లొకేషన్లో చాలా స్పష్టమైన ప్రణాళికతో షూటింగ్ చేయడం నాకలవాటు.  ఇవాళ టాప్ ఫైవ్ దర్శకుల జాబితాలో నేనూ ఉన్నానని అంటున్నారు. నేనెప్పుడూ నా స్థానం ఏంటి? అని పట్టించుకోలేదు. నా నిర్మాత, సినిమా కొనుక్కున్న పంపిణీదారులను సంతృప్తిపరిచే సినిమాలు చేయాలన్నదే నా ఆశయం. ఇవాళ నేనే సినిమా చేసినా కొబ్బరికాయ కొట్టిన రోజే వ్యాపారం అయిపోతుంది. ఈ స్థానాన్ని ఇలానే కాపాడుకోవాలనుకుంటున్నాను. అందుకే, ఎలా పడితే అలా సినిమాలు చేయాలనుకోవడంలేదు. 

 

  తమిళంలో ప్రయోగాత్మక చిత్రాలు వస్తున్నాయని, అగ్రదర్శకులు యువహీరోలతో సినిమాలు చేస్తున్నారని, తెలుగులో అలా చేయడంలేదని కొంతమంది అంటుంటారు. అది తప్పు. కృష్ణవంశీ, రాజమౌళిలాంటి వాళ్లు యువ హీరోలతో చేశారుగా! రామ్‌చరణ్‌తో చేయబోయే సినిమా తన ఇమేజ్‌కి తగ్గట్టుగా ఉంటుంది. కథ కూడా చెప్పాను. అధికారిక ప్రకటన త్వరలో వస్తుంది. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు కథానుసారం యాక్షన్ కూడా ఉంటుంది. బాలకృష్ణగారి కుమారుడు మోక్షజ్ఞ తొలి చిత్రానికి నేనే దర్శకుణ్ణి అనే వార్త ప్రచారంలో ఉంది. మోక్షజ్ఞ రంగప్రవేశానికి ఇంకా సమయం ఉంది. ఎవరు దర్శకుడనేది ఆ సమయంలో తెలుస్తుంది.

 
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top