'భేతాళుడు' మూవీ రివ్యూ

'భేతాళుడు' మూవీ రివ్యూ


టైటిల్ : భేతాళుడు

జానర్ : సైకలాజికల్ థ్రిల్లర్

తారాగణం : విజయ్ ఆంటోని, అరుంధతి నాయర్, చారు హాసన్, మీరా కృష్ణన్

సంగీతం : విజయ్ ఆంటోని

దర్శకత్వం : ప్రదీప్ కృష్ణమూర్తి

నిర్మాత : ఫాతిమా విజయ్ ఆంటోని



బిచ్చగాడు సినిమాతో తెలుగునాట సంచలనం సృష్టించిన విజయ్ ఆంటోని మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి హీరోగా మారిన విజయ్ ఆంటోని, తొలి సినిమానుంచే వైవిధ్యమైన కథాంశాలను ఎన్నుకుంటూ విజయాలు సాధిస్తున్నాడు. తాజాగా భేతాళుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిచ్చగాడు.. మరో విజయం సాధించాడా..?



కథ :

దినేష్( విజయ్ ఆంటోని), ఓ తెలివైన సాఫ్ట్వేర్ ఇంజనీర్. తన తల్లితో కలిసి హైదరాబాద్లో ఉండే దినేష్, మెట్రీమోని సైట్లో చూసి అనాథ అయిన ఐశ్వర్య(అరుంధతి నాయర్)ను పెళ్లి చేసుకుంటాడు. అంతా సాఫీగా సాగుతుందనుకున్న సమయంలో విజయ్ విచిత్రంగా ప్రవర్తించటం మొదలు పెడతాడు. ప్రతీ దానికి భయపడటం, తనకు ఏదో గొంతు వినిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది అంటూ కంగారు పడుతుంటాడు.  ఆ గొంతు తనని, జయలక్ష్మీ  చంపేసిందని ఆమె మీద పగ తీర్చుకొమ్మని చెపుతుంటుంది. దినేష్ పరిస్థితి చూసి అతన్ని ఓ మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళతారు. డాక్టర్ ట్రీట్ మెంట్తో తన గత జన్మ స్మృతులు దినేష్కు గుర్తుకు వస్తాయి.



గత జన్మలో తన పేరు శర్మ అని తెలుసుకుంటాడు. బ్రహ్మచారి అయిన శర్మ అనాథ పిల్లాడు గోపాలాన్ని దత్తత తీసుకొని పెంచుకుంటుంటాడు. ఆ సమయంలో తన స్కూల్లో పనికోసం వచ్చిన జయలక్ష్మీ, గోపాలంతో ప్రేమగా ఉండటం గమనించి ఆమె గోపాలానికి తల్లి అయితే బాగుంటుందని భావిస్తాడు. తనకీ, జయలక్ష్మికి ఎంతో వయసు తేడా ఉన్నా.. గోపాలం కోసం ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కానీ  స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా జాయిన్ అయిన నటరాజ్, జయలక్ష్మీకి దగ్గరవుతాడు. అదే సమయంలో జయలక్ష్మి ఓ మగ బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డ అనుకోకుండా శర్మ చేతిలో చనిపోతాడు. దీంతో శర్మ కావాలనే తన బిడ్డను చంపేశాడన్న పగ పెంచుకున్న జయలక్ష్మీ, నటరాజ్తో కలిసి శర్మను, అతడి కొడుకు గోపాలాన్ని చంపేస్తుంది.



ఇవన్నీ తెలుసుకున్న దినేష్ కొన్ని నెలల తరువాత మామూలు మనిషిగా హాస్పిటల్ నుంచి బయటికి వస్తాడు. కానీ దినేష్ హాస్పిటల్లో ఉన్న సమయంలో, తన వల్లే దినేష్ ఇలా అయిపోయాడని లెటర్ రాసిపెట్టి దినేష్ భార్య ఐశ్వర్య వెళ్లిపోతుంది. అనాథ అయిన ఐశ్వర్య ఎక్కడి వెళ్లింది...? అసలు దినేష్కు గత జన్మ గుర్తుకు రావడానికి ఐశ్వర్యకు సంబంధం ఏంటి...? శర్మ జయలక్ష్మీ మీద పగ తీర్చుకున్నాడా..? చివరకు జయలక్ష్మీ ఏం అయ్యింది..? దినేష్ మామూలు మనిషి  అయ్యాడా..? అన్నదే మిగతా కథ.



నటీనటులు :

బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన విజయ్ ఆంటోని, భేతాళుడుగా తన మార్క్ చూపించాడు. గత జన్మ స్మృతులతో ఇబ్బంది పడే వ్యక్తిగా, పగతో రగిలిపోయే భేతాళుడుగా రెండు విభిన్న పాత్రల్లో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సినిమా అంతా విజయ్ ఆంటోని వన్మన్ షోగా నడిచినా.. ఎక్కడా బోర్ కొట్టించకుండా మెప్పించాడు.  హీరోయిన్ పాత్రలో కనిపించిన అరుంధతి నాయర్ మంచి నటన కనబరిచింది. అందంగా కనిపిస్తూనే ఎమోషనల్ సీన్స్లో ఆకట్టుకుంది. ఇతర పాత్రల్లో చారు హాసన్, మీరా కృష్ణన్, వైజీ మహేంద్రలు తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు.



సాంకేతిక నిపుణులు :

బిచ్చగాడుతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న విజయ్ ఆంటోనిని.. భేతాళుడుగా చూపించిన దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి మంచి విజయం సాధించాడు. తొలి 20 నిమిషాలు కాస్త స్లోగా నడిచినట్టుగా అనిపించినా.. అసలు కథ మొదలైన తరువాత ప్రతీ సీన్ను ఆసక్తి కరంగా తెరకెక్కించాడు. కథా పరంగా భాగానే ఉన్నా.. అక్కడక్కడా గత జన్మ విశేషాలను హీరో నిజంగా వెళ్లి తెలుసుకున్నాడా..? లేక కలలోనే అవన్ని తెలిశాయా..? అన్న క్లారిటీ మిస్ అయ్యింది. విజయ్ ఆంటోని అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలు పెద్దగా అలరించకపోయినా.. నేపథ్యం సంగీతంతో మాత్రం సినిమా స్థాయిని పెంచాడు విజయ్. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.



ప్లస్ పాయింట్స్ :

కథ

విజయ్ నటన

నేపథ్య సంగీతం



మైనస్ పాయింట్స్ :

స్లో నారేషన్

క్లైమాక్స్

కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవటం



ఓవరాల్గా భేతాళుడు.., ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ను అలరించే సైకలాజికల్ థ్రిల్లర్





- సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top