ఈ సినిమానే ఓ పండగ!

ఈ సినిమానే ఓ పండగ!


- సంపత్ నంది

‘‘డిసెంబరు 25న క్రిస్మస్.. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి రాబోతోంది. అంతకన్నా ముందే డిసెంబరు 10న ‘బెంగాల్ టైగర్’ పండగ రాబోతోంది. బాక్సాఫీస్‌ను కచ్చితంగా షేక్ చేస్తుంది. ఎవరినీ డిజప్పాయింట్ చేయదు’’ అని దర్శకుడు సంపత్ నంది అన్నారు. రవితేజ, తమన్నా, రాశీఖన్నా  నాయకానాయికలుగా సంపత్ నంది దర్శకత్వంలో సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘బెంగాల్ టైగర్’. భీమ్స్ స్వరాలందించిన ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక సోమవారం హైదరాబాద్‌లో జరిగింది.



ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ- ‘‘పాటలకు  మంచి రెస్పాన్స్ వచ్చింది. భీమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అతనికి కంగ్రాట్స్.  మేం మాట్లాడటం కన్నా డిసెంబరు 10న మా సినిమా మాట్లాడుతుంది’’ అన్నారు. సంగీత దర్శకుడు భీమ్స్ మాట్లాడుతూ- ‘‘ఈ పాటలను హిట్ చేసిన అందరికీ  నా కృతజ్ఞతలు. ఆడియో చార్ట్స్‌లో టాప్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాయి. త్వరలో ఫస్ట్ ప్లేస్‌కు వస్తాయి. ‘చూపులతో దీపాల పాట...’ అందరికీ బాగా నచ్చేసింది’’ అని అన్నారు.



పాటల రచయిత  రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ -‘‘అప్పట్లో చిన్న రచయితనైనా ‘దుబాయ్ శీను’లో రవితేజ నాకు ఐదు పాటలు రాసే అవకాశమిచ్చారు. నే నీ సినిమాలో టైటిల్ సాంగ్ రాశాను. రవితేజ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తారు. భీమ్స్‌కు మంచి భవిష్యత్తు ఉంది’’ అని చెప్పారు. భాస్కరభట్ల మాట్లాడుతూ- ‘‘నా కెరీర్‌లో అత్యధికంగా రవితేజ సినిమాలకే రాశాను. ఆయన నటించినవాటిలో దాదాపు 28 సినిమాలకు రాశాను. రవితేజకు టీజింగ్ సాంగ్స్ రాయడమంటే నాకు చాలా ఇష్టం’’ అని చెప్పారు.



‘‘ఈ సినిమా ఓ లాంగ్ జర్నీ. సంపత్  నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం. దర్శకుడిగా అతని తొలి సినిమా నేనే చేశాను. సంపత్ మంచి సినిమా ఇచ్చారు. కచ్చితంగా ఘనవిజయం సాధిస్తుంది’’ అని నిర్మాత రాధామోహన్  అన్నారు. ‘‘నాకు మంచి అవకామిచ్చిన సంపత్  నందిగారికి చాలా థ్యాంక్స్. నా పుట్టినరోజున ఈ ప్లాటినమ్ డిస్క్ వేడుక జరగడం చాలా ఆనందంగా ఉంది’’ అని రాశీ ఖన్నా అన్నారు. ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తమన్నా చెప్పారు. ఈ సినిమా పాటల కాంటెస్ట్‌లో గెలుపొందిన విజేతలకు రవితేజ, తమన్నా,  రాశీఖన్నా, నిర్మాత రాధామోహన్ బహుమతులు అందజేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top