నయనతారః102

నయనతార@102 - Sakshi


హెడ్డింగ్‌ చదివి, ఈ మధ్యే యాభై సినిమాలు కంప్లీట్‌ చేసిన నయనతార అప్పుడే వంద సినిమాలు పూర్తి చేసిందా? అని ఆశ్చర్యపోతున్నారా? లెక్క ఆమె నటించిన సినిమాలకు సంబంధించినది కాదు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 102వ సినిమాలో నయనతార హీరోయిన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే.



కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సి. కల్యాణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో వేసిన సెట్‌లో జరుగుతోంది. సోమవారం నయనతార ఈ సినిమా సెట్‌లోకి ఎంటరయ్యారు. ‘సింహా, శ్రీరామరాజ్యం’ సినిమాల తర్వాత బాలకృష్ణ–నయనతార కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. ఇందులోనూ వాళ్ల కెమిస్ట్రీ ఆయా సినిమాల స్థాయిలో ఉంటుందని చిత్రబృందం పేర్కొంది.



వచ్చే నెలలో సరసుడితో...

బాలకృష్ణ సినిమా పక్కన పెడితే... మాజీ ప్రియుడు శింబుకు జోడీగా నయనతార నటించిన ‘సరసుడు’ వచ్చే నెల 8న తెలుగులో విడుదల కానుంది. పాండిరాజ్‌ దర్శకత్వంలో శింబు తండ్రి, ‘ప్రేమ సాగరం’ ఫేమ్‌ టి. రాజేందర్‌ ఈ సినిమాను నిర్మించారు. ఆయన మాట్లాడుతూ– ‘‘తమిళంలో ‘ఇదు నమ్మ ఆళు’గా విడుదలైన మంచి విజయం సాధించిన ఈ సినిమా... తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా. నయనతారతో పాటు మిగతా ఇద్దరు హీరోయిన్లు ఆండ్రియా, ఆదా శర్మలు అద్భుతంగా నటించారు. మా చిన్నబ్బాయి టీఆర్‌ కురళరసన్‌ పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top