మూవీ రివ్యూ: 'వర్షం' రీమేక్ ఇలా ఉంది!

మూవీ రివ్యూ: 'వర్షం' రీమేక్ ఇలా ఉంది!


టైటిల్: భాగీ లేదా బాగీ

జానర్: రొమాంటిక్ యాక్షన్

నటీనటులు: టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్, సుధీర్ బాబు, సునీల్ గ్రోవర్ తదితరులు

డైరెక్టర్: షబ్బీర్ ఖాన్

నిర్మాత: సాజిద్ నడియావాలా

రచన: సంజీవ్ దత్త్

నిడివి: 2 గంటల 16 నిమిషాలు

విడుదల: ఏప్రిల్ 29, 2016






2015 మే నుంచి 2016 ఫిబ్రవరి వరకు యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ చుట్టూ 50 మంది ప్రత్యేక ప్రైవేట్ సెక్యూరిటీ పర్సన్స్ 24x7 కాపలా కాశారు. ఆ టైమ్ లో షూటింగ్ జరుపుకొన్న భాగీ సినిమాకు సంబంధించి ఒక్కస్టిల్ గానీ, టైగర్ లుక్ గానీ లీక్ కాకూడదని నిర్మాత సాజిద్ నడియావాలా  అంత జాగ్రత్త తీసుకున్నారు. టైగర్  ఎలా కనిపిస్తాడో, ఏం చేస్తాడో సగటు ప్రేక్షకుడు 'అన్నీ హాల్లోనే' తెలుసుకోవాలని ఆయన ఉద్దేశం. అనుకున్నట్లే టైగర్ ష్రాఫ్ ఈ సినిమాలో ఫైట్ లు ఇరగదీశాడు. అంతేనా? ఇంకేం చెయ్యలేదా? అంటే.. మళ్లీ మళ్లీ ఫైట్లే చేస్తాడు. మొదట్లో, చివర్లో, మధ్యమధ్యలో హీరోయిన్ ని ప్రేమిస్తాడు కూడా!



'యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, త్రిషల కెరీర్ లను మలుపు తిప్పిన హిట్ సినిమా వర్షం (2004) రీమేకే ఈ హిందీ భాగీ' అని మనం అన్నా, అనుకున్నా.. సినిమాకు సంబంధించినవాళ్లు మాత్రం ఒప్పుకోరు. కానీ ఇది వర్షం రీమేకే! వర్షానికి తోడు  ది రెయిడ్: రిడంప్షన్ సినిమా నుంచి యాక్షన్ సీక్వెన్స్ లను రిఫరెన్స్ పాయింట్లుగా (ప్రేక్షకుడి భాషలో కాపీ అనుకోవచ్చు) తీసుకున్నారు. టైగర్ ష్రాఫ్ తొలి సినిమా 'హీరోపంతీ' (తెలుగు 'పరుగు'కు రీమేక్) లా రెండో సినిమా భాగీ కూడా రీమేకే(రెండు సినిమాలకు దర్శకనిర్మాతలు ఒకరే) అని అధికారికంగా వెల్లడించలేదు. దీంతో  ది రెయిడ్ నిర్మాతలు భాగీ నిర్మాత, హీరోలపై బాంబే హైకోర్టులో కేసు వేశారు. 'అసలు 'ది రెయిడ్' సినిమా ఎలా ఉంటుందో తెలియదు(!)' హీరో, ప్రొడ్యూసర్ వివరణ ఇవ్వడంతో కేసు ముగిసింది.



కథేంటి?

కథ పాతదే. ఇద్దరు బలవంతులైన యువకులు ఒకే (అందమైన) అమ్మాయిని ప్రేమించడం, హీరోయిన్ సహజంగానే గుడ్ బాయ్ వైపు మొగ్గుచూపి, బ్యాడ్ బాయ్ ని ఈసడించుకోవడం, చివరికి గుడ్ బాయ్ చేతిలో బ్యాడ్ బాయ్ అత్యంత బ్యాడ్ గా అంతరించడం రొటీన్. కాగా, భాగీలో ప్రత్యేకతలు ఏంటంటే వర్షం, కలరీ విద్యలు. పెద్ద నిర్మాత తీస్తున్న సినిమాతో తన కూతురిని హీరోయిన్ గా లాంచ్ చేసేందుకు ఓ తండ్రి ప్రయత్నిస్తుండగా, ఎవరో ఆ అమ్మాయిని కిడ్నీప్ చేస్తారు. అప్పుడా తండ్రి కూతురిని కాపాడుకునేందుకు ఓ భాగీ(తిరుగుబాటు చేసేవాడు లేదా ఎదురు తిరిగేవాడు)ని అద్దెకు తీసుకుంటాడు. అప్పటికే పలు యుద్ధకళల్లో ఆరితేరి ట్రైనర్ గా పనిచేస్తోన్న భాగీ.. విలన్లను చిత్తుచేసి ఆ అమ్మాయిని ఆమె తండ్రికి అప్పగిస్తాడు.



కట్ చేస్తే ఆ అమ్మాయి, భాగీ మాజీ ప్రేమికులు. కొందరు చెప్పిన అబద్ధాల వల్ల విడిపోతారు. హీరోయిన్ కావాలనుకునే అమ్మాయిని ఎత్తుకెళ్లిన విలన్ కూడా హీరోకు మాజీ శత్రువు. ఇద్దరూ ఒకే గురువు దగ్గర యుద్ధ విద్యలు  నేర్చుకుని ఉంటారు. అసలీ డ్రామా ఎక్కడ మొదలైందంటే..



చలాకీ అమ్మాయి సియా(శ్రద్ధా కపూర్)కు వర్షమంటే చచ్చేంత ప్రేమ. అలా వర్షం కురుస్తున్న ఓ పట్టపగలు రైల్వే ఫ్లాట్ ఫామ్ పై ఆమె ఆనందంతో చిందులేస్తుండగా రోనీ(టైగర్ ష్రాఫ్), రాఘవ్ శెట్టి (సుధీర్ బాబు)ల కంటపడుతుంది. అంతే రోనీ, రాఘవ్ లు సియాతో ప్రేమలో పడిపోతారు. (రాఘవ్ ది ప్రేమకాదు మోహం అనుకోవాలి) పలు మార్లు కురిసే వర్షంలో తడుస్తూ సియా, రోనీలు దగ్గరవుతారు. సియా తండ్రి ఖురానా(కామెడీ షోల ఫేమ్ సునీల్ గ్రోవర్)కు మాత్రం ఆమెను పెద్ద హీరోయిన్ ను చెయ్యాలని ఉంటుంది. దీంతో చిన్నపాటి పన్నాగంతో వాళ్ల ప్రేమకు కామాపెట్టిస్తాడు.



సినిమా షూటింగ్ కోసం బ్యాంకాక్ వెళ్లిన సియాను రాఘవ్ కిడ్నీప్ చేయించి ఓ భారీ భవంతిలో బంధిస్తాడు. ఆమెను విడిపించేందుకు వచ్చే రోనీకి, విలన్ గ్యాంగ్ లీడర్ రాఘవ్ కు మధ్య పాత శత్రుత్వం కూడా ఇక్కడ హైలైటే. కేరళలోని కొల్లాంలో గురుస్వామి (శౌర్యా భరధ్వాజ్) దగ్గర కరియపట్టు లేదా కలరీ అనే ప్రాచీన యుద్ధవిద్యలో శిక్షణ తీసుకుంటారు రాఘవ్, రోనీలు. మంచి కారణం కోసం తిరుగబాటు చేసేవాడే నిజమైన 'భాగీ' అని, నేర్చుకున్న విద్యలు సద్వినియోగం చేసుకోవాలనే గురువు ఉవాచను భిన్నధృవాలైన రాఘవ్, రోనీలు ఒక్కోలా అర్థం చేసుకుంటారు. రాఘవ్ పశుబల ప్రదర్శన కోసం తన విద్యలు వాడుకుంటే, రోనీ నిజమైన 'భాగీ' లా గెలిచి, సియా పెదవులు అందుకుంటాడు.



టైగర్ తో తన్నులు తింటారా?

విలన్ హీరోయిన్ ను భారీ భవంతిలో బంధిస్తాడని చెప్పుకున్నాంకదా, ఆ భవంతి ఒక్కో ఫ్లోర్ లో ఒక్కో వెరైటీ ఫైటర్లు ఉంటారు. ఒక ఫ్లోర్ లో కరాటే గ్యాంగ్ ఉంటే మరో ఫ్లోర్ లో కుంగ్ ఫూ, ఇంకోదాట్లో కత్తుల బ్యాచ్ కాపలా కాస్తుంటారు. కిల్లింగ్ లైసెన్సేదో తీసుకున్నట్లు అంతమందినీ ఒంటిచేత్తో ఫినిష్ చేస్తాడు టైగర్. ఫైట్లు చేసేటప్పుడు అతని శరీరసౌష్టవం చక్కగా ఎలివేట్ అవుతుంది. అయితే సూపర్ నేచురల్ తరహాలో సాగే భారీ ఫైట్ల మోతాదు మరీ శ్రుతిమించడం సినిమా చూడటానికి వచ్చామా? టైగర్ తో తన్నులు తినడానికి వచ్చామా? అనే భ్రాంతికి గురౌతారు ప్రేక్షకులు.



తెలుగు సినిమాలను వరుసగా రీమేక్ లు చేస్తూ వాటికి బాలీవుడ్ మసాలా జోడించి హిట్లు కొట్టడంలో దిట్టగా పేరుపొందిన నడియావాలా.. ఈ సినిమాలో ఫైట్లనే మసాలాగా భావించినట్లనిపిస్తుంది. సియా- రోనీల ప్రేమ, రోనీ- రాఘవ్ ల శత్రుత్వాలకు సరైన లాజిక్ లు దొరకవు. కేరళలో తీసిన సీన్లు కంటికి ఇంపుగా ఉంటాయి. దాదాపు రూ.50 కోట్ల వ్యయంతో నిర్మితమైన భాగీ.. ప్రపంచ వ్యాప్తంగా 2500 స్క్రీన్లపై విడుదలైంది. ఈ సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోరర్ తో కలిపి ఐదుగురు సంగీత దర్శకులు పనిచేశారు.



ఎలా చేశారు?

మొదటి సినిమా(హీరోపంతీ) దర్శకనిర్మాతలతోనే రెండో సినిమాకు కూడా ఒప్పుకున్న టైగర్ ష్రాఫ్ కథ, కథనం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. టైగర్ మీద మనం సాఫ్ట్ కార్నర్ తీసుకోవాల్సిన అవసరం ఎందుకో.. దేశవ్యాప్తంగా ఉన్న జమ్ లకు వెళితే తెలుస్తుంది. (చక్కటి ఫిజిక్ తో, ఎప్పటికప్పుడు రకరకాల ప్యాక్ లలో కనిపించే టైగర్ నిలువెత్తు బొమ్మలు అన్ని జిమ్ లలో కొలువయ్యాయి) ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటున్న టైగర్ మూడో సినిమా 'ఎ ఫ్లైయింగ్ జాట్' బిజినెస్ పై భాగీ ప్రభావం చూపుతుందో లేదో ఇంకొద్ది నెలల్లో తెలుస్తుంది. శ్రద్ధా కపూర్ ఎప్పటిలాగే పాత్రలో జీవించాలని ప్రయత్నించి.. సోసోగా చేసింది. వెండితెరపై శ్రద్ధాను బికినీలో చూడటం, టైగర్ లో లిప్ లాక్ కొందరికి నచ్చుతాయి.



కొసమెరుపు

తెలుగు ప్రేక్షకుడి దృష్టికోణంలో ఈ సినిమాలో నచ్చే ఏకైక అంశం సుధీర్ బాబు. టాలీవుడ్ లో అడపాదడపా హిట్లు కొడుతూ, మంచి నటుడిగా ఎదుగుతున్న సుధీర్.. భాగీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అది కూడా విలన్ గా. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు.. 'విలన్ సుధీర్ బాబే హీరోలా ఉన్నాడు'అని చాలా మంది తెలుగేతర వ్యక్తులు అనుకుని ఉంటారు!

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top