సినిమా కథ రాస్తున్న ఏఆర్ రెహమాన్

సినిమా కథ రాస్తున్న ఏఆర్ రెహమాన్ - Sakshi


ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా... అంటూ జానపద గీతాలకు క్లాసికల్ టచ్ ఇస్తూ దాదాపు రెండు దశాబ్దాలుగా తన పాటలతో కుర్రకారును ఉర్రూతలూగిస్తున్న ఏఆర్ రెహమాన్.. కొత్తగా రచయిత అవతారం ఎత్తారు. ప్రస్తుతం కథ, స్క్రీన్ ప్లే రాయడంలో నిమగ్నమయ్యారు. ఓ ఐటెమ్ సాంగ్, ఐదారు మెలోడీ పాటలుండే భారతీయ సినిమాకు ఇంకెంత కాలం బాణీలు కడతాం, అదే బాటలో ఇంకా వెళ్తే బాణీలు రిపీట్‌ కావా అన్న భావంతో ఈ కొత్త ఆలోచనకు కార్యరూపం ఇస్తున్నానని తెలిపారు. ఇప్పుడే ఓ రూపానికొచ్చిన తన కథకు తానే స్క్రిప్టు రాస్తున్నానని, సినిమాగా వస్తున్న ఈ కథలో పాత్రలను ఎవరెవరు పోషిస్తరో కూడా ఖరారైందని చెప్పారు. ఇంతకు మించి వివరాలు వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.



రెహమాన్ జీవిత చక్రగమనంపై ‘జయ హో’ పేరిట రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రం ప్రదర్శన సందర్భంగా ఆయన అమెరికాకు వచ్చారు. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాకు సంగీతం సమకూర్చడం ద్వారా ఆస్కార్ అవార్డు అందుకొని అమెరికా సంగీత ప్రియులకు ఆయన చేరువైన విషయం తెలిసిందే. ఆయన స్వరకల్పన చేసిన ‘జయ హో’ పాట ఇప్పటికీ అమెరికా వీధుల్లో మార్మోగుతోంది. ఎంతోమంది అమెరికా గాయకులు తమ కచేరీల్లో ఈ పాటను గానం చేస్తున్నారంటే ఆ పాటుకున్న ఆదరణ ఎంతో తెలుస్తోంది. అందుకే ప్రతిష్ఠాత్మకమైన ‘మూవింగ్ ఇమేజ్ మ్యూజియం’లో ఈ నెల 25వ తేదీన ‘జయ హో’ డాక్యుమెంటరీ ప్రదర్శనకు ఆయన తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన కొత్త ప్రాజెక్టు గురించి వెల్లడించారు.



‘బాంబే డ్రీమ్స్’ అనే బ్రిటన్ మ్యూజికల్ సినిమాకు తాను పని చేస్తున్నప్పుడు ఆ సినిమా మ్యూజిక్ కంపోజర్ ‘మీ వద్ద సినిమా కథలకు ఏమైనా ఐడియాస్ ఉన్నాయా?’ అని తనను అడిగారని, లేవని చెప్పానని తెలిపారు. ఆ మర్నాటి నుంచే మనం కథ ఎందుకు రాయకూడదు, స్క్రిప్టు ఎందుకు రాయకూడదు! అనే ఆలోచన మనసును తొలుస్తూ వచ్చిందని చెప్పారు. ఇంకెంతకాలం పాటల బాణీల వెంట పెంపర్లాడతామన్న ఉద్దేశంతో కొత్త ఆలోచనకు కార్యరూపం ఇచ్చానని వివరించారు. దర్శకత్వ బాధ్యతలు కూడా చేపడతారా? అని ప్రశ్నించగా.. అమ్మో, అలాంటి ఆలోచన తనకు లేదని, బేసిగ్గా తాను ఇంట్రావర్ట్‌నని, అలాంటి సాహసం చేయనని స్పష్టం చేశారు. రెహమాన్ చిన్నప్పటి నుంచి ఎన్నెన్ని కష్టాలు అనుభవించిందీ, ఎలా పైపైకి వచ్చారో ‘జయ హో’ డాక్యుమెంటరీలో హృద్యంగా చూపించారు. రెహమాన్, ఆయన తల్లి, చెల్లి ఇంటర్వ్యూలతోపాటు సినిమాల్లో ఆయన ఎదగడానికి ఎవరెవరూ సహకరించారో, ఎవరెవరు ప్రత్యక్ష సాక్షులో వారందరి ఇంటర్వ్యూలు అందులో ఉన్నాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top