అప్పట్లో ఏమీ తెలిసేది కాదు!

అప్పట్లో ఏమీ తెలిసేది కాదు!


 ‘‘నేను డెరైక్టర్స్ ఆర్టిస్ట్‌ని. దర్శకుడు ఎలా కోరుకుంటే అలా నటిస్తా. అలాగని నా శైలిని వదలుకోను. ఓ పాత్ర తీరుతెన్నులను దర్శకుడు చెప్పిన తర్వాత, ఒకవేళ నేనే ఆ పాత్ర అయితే ఎలా ఉంటానో.. ఊహిం చుకుని నటిస్తా’’ అంటున్నారు అనుష్క. ‘బాహుబలి, రుద్రమదేవి, లింగా, ఎన్నయ్ అరిందాల్’.. ఇలా తెలుగు, తమిళ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారీ బ్యూటీ. ఇటీవల ఓ సందర్భంలో నటిగా రంగప్రవేశం చేసిన తొలినాళ్లను అనుష్క గుర్తు చేసుకున్నారు. సినిమా నిర్మాణం ఎలా ఉంటుందనే విషయంపై తనకు కనీస అవగాహన ఉండేది కాదని అనుష్క చెబుతూ -‘‘సినిమాల్లోకి రాక ముందు నేను సాదా సీదా అమ్మాయిని.



చాలా నిరాడంబరంగా ఉండేదాన్ని. అప్పట్లో మేకప్ వేసుకోవడం కూడా తెలియదు. ఇక కెమెరా యాంగిల్స్ గురించి ఏం తెలుస్తుంది! కానీ, ఓ నాలుగైదు సినిమాలు చేసిన తర్వాత ఫిలిం మేకింగ్ గురించి ఒక అవగాహన వచ్చింది. అలాగే, కెమెరా యాంగిల్స్ కూడా తెలుసుకున్నాను. అప్పట్నుంచీ నాదైన శైలిలో నటించడం మొదలుపెట్టాను. తెరపై చూస్తున్న రెండున్నర గంటల సినిమా కోసం పడే కష్టం ఏ స్థాయిలో ఉంటుందో స్వయంగా తెలుసుకున్నాను’’ అని చెప్పారు.



‘పోటీలో ఉన్న ఇతర నాయికలు హిందీ సినిమాలు చేస్తున్నారు కదా! మీరెందుకు చేయడంలేదు?’ అనే ప్రశ్న అనుష్క ముందుంచితే -‘‘హిందీ సినిమా చేయాలి కాబట్టి అని చేస్తే బాగుండదు. బాలీవుడ్ నుంచి కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ, ఏదీ కొత్తగా అనిపించలేదు. అందుకే ఒప్పుకోలేదు’’ అన్నారామె.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top