కొడుకు సినిమా హిట్టయితే ఆ కిక్కే వేరబ్బా!

కొడుకు సినిమా హిట్టయితే ఆ కిక్కే వేరబ్బా!


 ‘‘ఈ సినిమాలో నా పాత్ర పేరు లక్కీ. నిజానికి కూడా నేను లక్కీనే. నా జీవితంలోనే లక్ ఉంది. ఎందుకంటే... అందరూ ఒకటో మెట్టు నుంచి జీవితాన్ని మొదలుపెడతారు. కానీ నేను 11వ మెట్టునుంచి  ప్రయాణం మొదలు పెట్టాను’’ అని అల్లు అర్జున్ అన్నారు. ఆయన హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో... నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), కె.వెంకటేశ్వరరావు కలిసి నిర్మించిన చిత్రం ‘రేసుగుర్రం’. ఈ చిత్రం విజయోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది.  బన్నీ మరిన్ని విషయాలు చెబుతూ- ‘‘సాంకేతికంగా అద్భుతం ‘రేసుగుర్రం’. ఈ సినిమాలో చివరి 15 నిమిషాలు బ్రహ్మానందానివే. ‘నీ సినిమాలో బ్రహ్మానందానికి అంత ప్రాధాన్యత ఇవ్వడమేంటి?’ అని చాలామంది అన్నారు.

 

  సినిమాను హీరో ఒక్కడే మోయకూడదు. అందరూ మోయాలి. ఓ సినిమా విజయానికి కారణాలు చాలా ఉంటాయి. ఈ సినిమా విజయం విషయంలో అన్ని కారణాలూ సురేందర్‌రెడ్డే’’ అని పేర్కొన్నారు. ఇప్పటివరకూ తాను నటించిన సినిమాల్లో పూర్తి వినోదాత్మక చిత్రం ఇదేనని శ్రుతిహాసన్ చెప్పారు. 987 సినిమాల్లో నటించిన తనకు ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సినిమా ‘రేసుగుర్రం’ అని బ్రహ్మానందం అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ-‘‘కొడుకు సినిమా హిట్టయితే... ఆ కిక్కే వేరబ్బా. ఈ సినిమాలోని ప్రతి పాత్రను దర్శకుడు భిన్నంగా తీర్చిదిద్దాడు.

 

 మంచి సినిమా తీయాలనే తపన గల నిర్మాత నల్లమలుపు బుజ్జి. ఇందులోని బన్నీ నటన చిరంజీవిగారిని గుర్తుచేసిందని కొందరు అంటుంటే... తండ్రిగా అమితానందం అనుభవించాను. బన్నీకి అది నిజంగా గొప్ప ప్రశంస’’ అన్నారు. ‘‘ప్రతి సినిమాకూ ఒకేలా కష్టపడతాను. కానీ... బ్లాక్ బస్టర్స్ మాత్రం నాకు అరుదుగానే వరించాయి. ఈ మధ్య నా దక్కిన గొప్ప విజయం ‘రేసుగుర్రం’. బన్నీ నాకు తమ్ముడు లాంటి వాడు. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. తమన్ అద్భుతమైన బాణీలిచ్చాడు’’ అని సురేందర్‌రెడ్డి చెప్పారు. తనికెళ్ల భరణి, అలీ, జయప్రకాశ్‌రెడ్డి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top