పోలీసాఫీసర్‌గా ప్రభాస్ 100 కోట్లతో సినిమా

పోలీసాఫీసర్‌గా ప్రభాస్ 100 కోట్లతో సినిమా - Sakshi


‘బాహుబలి’ చిత్రం తర్వాత తమిళ, హిందీ భాషల్లోనూ ప్రభాస్ పాపులర్ అయ్యారు. ఆ విధంగా అక్కడ కూడా ఈ యంగ్ రెబల్‌స్టార్‌కి మంచి మార్కెట్ ఏర్పడింది. అందుకే భవిష్యత్తులో ప్రభాస్ ద్విభాషా, త్రిభాషా చిత్రాలు ప్లాన్ చేయొచ్చని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ ఎలానూ తెలుగు, తమిళ, హిందీ... ఇలా పలు భాషల్లో విడుదలవుతుంది.



ఈ చిత్రం తర్వాత ‘రన్ రాజా రన్’ ఫేం సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారని తెలిసిందే. ఇది ద్విభాషా లేక త్రిభాషా చిత్రమవుతుందన్నది తాజా టాక్. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. నిన్న మొన్నటి వరకూ తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుందనే వార్త వచ్చింది. ఇప్పుడు హిందీలో కూడా రూపొందించాలనుకుంటున్నారని తెలుస్తోంది. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారట. ఇందులో ప్రభాస్ స్టైలిష్ పోలీసాఫీసర్ పాత్ర చేయనున్నారట. హిందీ నటుడు నీల్ నితిన్ ముఖేష్‌ని విలన్‌గా తీసుకోవాలనుకుంటున్నారట. వచ్చే జనవరిలో చిత్రీకరణ మొదలుపెట్టాలనుకుంటున్నారు.



 ‘ఎస్ 3’లో అతిథిగా?

 హరి దర్శకత్వంలో సూర్య నటించిన ‘సింగమ్’, ‘సింగమ్ 2’ ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు మూడో భాగం నిర్మాణంలో ఉంది. ‘ఎస్ 3’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఓ అతిథి పాత్ర ఉందట. ఆ పాత్రను ప్రభాస్ చేశారని భోగట్టా. ఈ డిసెంబర్‌లో సినిమా విడుదల కానుంది. మరి.. ప్రభాస్ గెస్ట్ రోల్ చేశారా? వేచి చూడాలి.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top