నావన్నీ కోతి పనులే..

నావన్నీ కోతి పనులే..


 హిమజ, యాంకర్, నటి

 విజయవాడలో అమ్మమ్మ వాళ్లింట్లో పుట్టాను. చిన్నప్పటి నుంచి హైదరాబాద్‌లోనే పెరిగాను. అన్నయ్య మాత్రం అమ్మమ్మ వాళ్లింట్లో పెరిగాడు. నాన్న ఆర్టీసీలో మేనేజర్. అమ్మ హౌస్‌వైఫ్. నేను చిన్నప్పటి నుంచి చాలా అల్లరి. హాలీడేస్‌లో అన్నయ్య హైదరాబాద్ రాగానే ఎంతో ఎగ్జైట్ అయ్యేదాన్ని. ఒకసారి అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లినప్పుడు సడన్‌గా కనిపించకుండా పోయాను. అప్పుడంతా నా కోసం ఊరంతా వెతికారు. ఒకచోట టెంట్ వేసి ఫంక్షన్ చేస్తున్నారు. అక్కడి వరకు వెతుక్కుంటూ వస్తే, అక్కడ దొరికాను. విషయమేమిటంటే, నేను పెద్ద ఫుడీని. ఎక్కడ ఫంక్షన్ జరిగితే అక్కడ వాలిపోయేదాన్ని.

 

 చదువు విషయానికొస్తే, లాస్ట్ బెంచర్స్ వరస్ట్ బ్యాచ్‌కి లీడర్‌ని. క్లాస్‌రూమ్ లో అందరి బాక్సుల్లోని లంచ్ కొంచెం కొంచెం తినేసేదాన్ని. స్పోర్ట్స్‌లో కబడ్డీ, టెన్నికాయ్ చాలా ఇంటరెస్ట్. చిన్నప్పుడు.. ఆదిత్య 369లో లాగా ఒక టైమ్ మెషిన్ తయారు చేసేయాలని అనుకునేదాన్ని. అయితే, నావన్నీ కోతి పనులే కదా! మా ఇంటి చుట్టుపక్కల ఎవరి పెళ్లి బారాత్ జరిగినా, తీన్‌మార్ బ్యాండు వినిపిస్తే చాలు, వెంటనే డ్యాన్స్ చేయడానికి వెళ్లిపోయేదాన్ని.

 

ఇంట్లో చెప్పకుండా ఆడిషన్‌కి వెళ్లా..

 ఎంబీఏ వరకు చదివి అమీర్‌పేటలోని మైత్రీవనంలో జావా, ఒరాకిల్ వంటి కోర్సులన్నీ చేశా. నాకు నటనంటేనే ఇంట్రెస్ట్. ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోయినా..ఓసారి మయూరి ఆఫీసుకి వెళ్లి ఆడిషన్ ఇచ్చి వచ్చాను. రెండు రోజుల్లోనే ఫోన్ కాల్.. ‘భార్యామణి’ సీరియల్‌లో హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యానని.. అలా స్వయంవరం సీరియల్‌లో, టీవీ షోస్‌లో అవకాశాలు వచ్చాయి. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సీరియల్‌లో లీడ్ రోల్ చేస్తూ, ‘ద బెస్ట్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ది ఇయుర్-2014’గా ఎంపికయ్యాను. తాటాకు టపాకాయలు కాల్చేదాన్ని.. మేం హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఎల్‌బీ నగర్‌లో ఉండేవాళ్లం. దీపావళికి తాటాకు టపాకాయలు బాగా కాల్చేదాన్ని. ఇప్పుడు నన్ను చూసుకుని మా పేరెంట్స్ ఎంతో గర్వపడుతున్నారు. సంప్రదాయంగా ఉండటానికే ఇష్టపడతాను. సాయిబాబాను అనుక్షణం నమ్ముతాను. నా డ్రెసెస్ నేనే డిజైన్ చేసుకుంటాను. ఇక హైదరాబాద్ సిటీ అంటే, నాకు నా తండ్రి అంత భరోసా.  యాక్టింగ్‌కి, కెరీర్‌కి హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ అని భావిస్తాను.

 -  చల్లపల్లి శిరీష

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top