మా జీవితాలను నాశనం చేయొద్దు: విజయ్

మా జీవితాలను నాశనం చేయొద్దు: విజయ్


నూతన చిత్రాలను ఇంటర్‌నెట్‌లో ప్రచారం చేస్తూ సినిమానే నమ్ముకుని బతుకుతున్న వారి జీవితాలను నాశనం చేయవద్దని ప్రముఖ తమిళ నటుడు విజయ్ విజ్ఞప్తి చేశారు. ఆయన  నటించిన 'పులి' చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. శింబుదేవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హన్సిక, శ్రుతిహాసన్ హీరోయిన్లుగా నటించారు. అలనాటి అందాల తార శ్రీదేవి మహారాణిగా ప్రధాన పాత్రలో నటించడగా, కన్నడ నటుడు సుధీప్ విలన్‌గా నటించారు.



పీటీ సెల్వకుమార్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. కాగా చిత్ర ఆడియోను విజయ్ సతీమణి సంగీత ఆవిష్కరించగా, ఆయన తల్లి శోభా చంద్రశేఖరన్ తొలి సీడీని అందుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ చారిత్రక కథా చిత్రంలో నటించాలన్న కోరిక ఈ పులి చిత్రంతో తీరిందన్నారు. నిర్మాతలు భారీ ఎత్తున ఖర్చు పెట్టి చిత్రాలు నిర్మిస్తుంటే కొందరు వాటిని అక్రమంగా ఇంటర్‌నెట్‌లో ప్రచారం చేస్తున్నారని.. దీంతో సినిమావాళ్ల శ్రమ మట్టిలో కలిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఒక బిడ్డ సుఖ ప్రసవం అయ్యే ముందే గర్భాన్ని కోసి చంపే చర్యగా ఉందన్నారు.



చాలా అవమానాలు ఎదుర్కొన్నా: చిత్ర పరిశ్రమలో తాను చాలా విమర్శలను, అవమానాలను చవి చూశానన్నారు. బిల్‌గేట్స్‌ను కూడా చిన్నతనంలో స్నేహితులు అమర్యాదగా చూశారని, అలాంటి ఆయన్ని ఇప్పుడు ప్రపంచం ఎలా చూస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదన్నారు. తాను, తన అభిమానులు ఇతరులకు జీవితాన్ని ఇవ్వాలనే నిరంతరం భావిస్తామన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top