అందంగా... ఆహ్లాదంగా!

అందంగా... ఆహ్లాదంగా!


కొత్త సినిమా గురూ!

తారాగణం: నితిన్, సమంత, అనుపమా పరమేశ్వరన్, నదియా, సీనియర్ నరేశ్, రావు రమేశ్, ఈశ్వరీరావ్, ప్రవీణ్ తదితరులు...

సంగీతం: మిక్కీ జె మేయర్

కెమెరా: నటరాజ్ సుబ్రమణియమ్

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పీడీవీ ప్రసాద్

నిర్మాత: ఎస్.రాధాకృష్ణ

దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్

 

త్రివిక్రమ్ మాటలు నవ్విస్తాయ్.. కంట తడిపెట్టి స్తాయ్.. ఆలోచనలో పడేస్తాయ్. అందుకే ఆయన సినిమాలంటే నాలుగు మంచి మాటలు వినపడతాయని అందరూ ఆశిస్తారు. మాటలతోనే కాదు.. దర్శకుడిగా తనదైన టేకింగ్‌తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తారు త్రివిక్రమ్. నితిన్, సమంత, అనుపమా పరమేశ్వరన్ ముఖ్య తారలుగా ఆయన దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ నిర్మించిన ‘అ.. ఆ’ గురువారం విడుదలైంది. కథేంటంటే: అమ్మ మహాలక్ష్మి (నదియా) నీడలో భయంగా, నాన్న రామలింగం (సీనియర్ నరేశ్) గారాబంతో ఓ రాకుమారిలా పెరిగిన అమ్మాయి అనసూయ (సమంత).



వ్యాపారవేత్తగా మంచి పేరూ ప్రతిష్ఠలు సంపాదించిన మహాలక్ష్మి (నదియా) కూతురు తనలా డైనమిక్‌గా ఉండాలనుకుంటుంది. కానీ అనసూయ మాత్రం ఓ సాధారణ అమ్మాయిగానే మిగిలిపోతుంది. చేసేదేం లేక, అనసూయకు శేఖర్ (అవసరాల శ్రీనివాస్)తో పెళ్లి నిశ్చయిస్తుంది. ఆ పెళ్లి ఇష్టం లేకపోవడంతో అనసూయ ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది కానీ, బతికి బయటపడుతుంది. ఓ బిజినెస్ మీటింగ్ నిమిత్తం మహాలక్ష్మి చెన్నైకు వెళ్లడంతో తండ్రి రామలింగం సాయంతో ఆ పెళ్లి సంబంధాన్ని చెడగొడుతుంది అనసూయ. అమ్మ మహాలక్ష్మి రావడానికి ఇంకా పదిరోజులు టైమ్ పడుతుంది.



అందుకే ఆమెకు తెలియకుండా ఓ పది రోజులు ఎంజాయ్ చేయమని ఎప్పుడో తమ నుంచి విడిపోయిన కామేశ్వరి అత్తయ్య వాళ్ల ఊరు కలువపూడికి కూతుర్ని పంపిస్తాడు రామలింగం. ఆ ప్రయాణంలో అత్తయ్య కొడుకు ఆనంద్ విహారి (నితిన్) పరిచయమవుతాడు. చెఫ్‌గా పని చేస్తున్న ఆనంద్ విహారి పల్లం వెంకన్న (రావు రమేశ్) కూతురు నాగవల్లి (అనుపమా పరమేశ్వరన్)తో పెళ్లికి ఒప్పుకుంటాడు. అంకయ్యకు తీర్చాల్సిన అప్పు బోల్డంత ఉండటంతో తప్పక ఈ నిర్ణయం తీసుకుంటాడు. పది రోజులు పూర్తయ్యాక అనసూయ వెళ్లిపోతుంది... ఆనంద్‌ని గుండెల నిండా నింపుకుని.



ఆనంద్‌ది కూడా అదే పరిస్థితి. కానీ, ఇద్దరూ చెప్పుకోరు. ఒక పక్క ప్రేమించిన అమ్మాయి అనసూయ, మరో పక్క త నతో పెళ్లికి సిద్ధమైన నాగవల్లి. మరి.. అనసూయా ఆనంద్‌ల ప్రేమకథ ఎన్ని మలుపులు తిరిగిందనేది మిగతా కథ...

 ప్రతి సన్నివేశంలో తన మార్కును చూపించారు త్రివిక్రమ్. నితిన్, సమంతల కెమిస్ట్రీ బాగుంది. మిక్కీ జె మేయర్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్. ఒక్క మాటలో చెప్పాలంటే, అ అంటే అందం.. ఆ అంటే ఆహ్లాదం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top