ప్రశాంతంగా ‘మా’ ఎన్నికలు ఇక ఫలితాల కోసం నిరీక్షణ

ప్రశాంతంగా ‘మా’ ఎన్నికలు ఇక ఫలితాల కోసం నిరీక్షణ


మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ (మా) ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గత వారం రోజులుగా తీవ్రమైన ఉత్కంఠను కలిగిస్తూ సాగిన ఎన్నికల అంకం సార్వత్రిక ఎన్నికలను తలపించింది. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది. మొత్తం 702మంది ఓటర్లలో 394మంది సభ్యులు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోర్టు ఆదేశాలతో ఎన్నికల ప్రక్రి యను వీడియో రికార్డ్ చేశారు. ఉదయం కాస్త మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్న సమయానికి ఊపందుకుంది. ఈ ఎన్నికల ఫలితాలను కోర్టు తీర్పు తర్వాతనే వెల్లడించాలని ఆదేశాలు జారీ కావడంతో అభ్యర్థుల భవితవ్యం బాక్సుల్లోనే ఉండిపోయింది.

 

 ఓటు వేసిన ప్రముఖులు: అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన ‘మా’ ఎన్నికలకు చిత్రపరిశ్రమలోని చాలా మంది అగ్ర ీహ రోలు దూరంగా ఉన్నారు. పలువురు ప్రముఖ నటీనటులు గైర్హాజరయ్యారు. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులలో కృష్ణ, విజయనిర్మల, కృష్ణంరాజు,  మురళీమోహన్, బాలకృష్ణ, సుమన్, ఆర్. నారాయణమూర్తి, మంచు విష్ణు, మంచు మనోజ్, నాని, వరుణ్ సందేశ్, నాగబాబు, రోజా, రఘుబాబు, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, శివకృష్ణ, శ్రీకాంత్, శివాజీరాజా, శివాజీ, మంచు లక్ష్మి, కలర్స్ స్వాతి తదితరులున్నారు.

 

 గైర్హాజరైన ప్రముఖులు: ఓటు వేయనివారిలో మోహన్‌బాబు, చిరంజీవి, నాగార్జున, పవన్‌కల్యాణ్, వెంక టేశ్, మహేశ్‌బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, గోపీచంద్, రవితేజ, రామ్‌చరణ్, రామ్, నాగచైతన్య... ఇలా పలువురు అగ్ర తారలు ఉండటం గమనార్హం. వీరిలో కొంతమంది విదేశాల్లో షూటింగ్ చేస్తుండగా, కొంతమంది భాగ్యనగరంలోనే ఉండి రాకపోవడం చర్చనీయాంశమైంది.

 

 ఫిలిం చాంబర్ వద్ద సందడి: ‘మా’ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోకుండా జరిగాయి. రాజేంద్రప్రసాద్, జయసుధ ప్యానె ళ్లకు చెందిన నటీనటులు ఫిలిం చాంబర్  వద్ద రెండు వర్గాలుగా శిబిరాలు ఏర్పాటు చేసుకొని ఓటేయడానికి వచ్చే వారిని ప్రసన్నం చేసుకునే  ప్రయత్నం చేశారు.  ‘అల్లుడు శీను’ చిత్రం ద్వారా కథానాయకునిగా పరిచయమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వచ్చిన నేపథ్యంలో, సభ్యత్వం తీసుకుని ఆరు నెలలే అయ్యిందన్న కారణంగా తిరస్కరించారు.  ఓటింగ్ సమయం పూర్తయిన పది నిమిషాలకు హడావిడిగా వచ్చిన యువహీరో నిఖిల్‌ను ఓటు వేయడానికి అనుమతించలేదు.

 

 ఎన్నికల గురించి ఎవరేమన్నారు?

 ‘‘గతంలో మా ఎన్నికలు జరిగిన తీరుకు పూర్తి భిన్నంగా ఈసారి ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు రెండేళ్లకోసారి కావడం వల్ల పెద్దలంతా కలిసి ‘మా’ అధ్యక్షుడిని ఎంపిక చేస్తే బాగుండేది. అయితే ఎన్నికలు జరగడం కూడా ఒకందుకు మంచిదే. తాము గెలిస్తే ఏం చేస్తాం? అనేది ముందుగానే చెప్పడం వల్ల పేద, వృద్ధ  కళాకారులకు మంచి జరుగుతుందని అనుకుంటున్నాను.’’   - రోజా

 

 ‘‘మార్పు కోసమే ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చాను. గతంలో ఎప్పుడూ ఏకగ్రీవం అంటూ కొందరికే పదవిని కట్టబెట్టేందుకు ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు తీసుకురావాలనే ప్రయత్నం మంచిదే. గతంలో చిన్న చిన్న కళాకారులు పోటీలోకి దిగేందుకు ముందుకు రాకపోయేవారు. ఇప్పుడు వారంతా ముందుకు రావడం అభినందనీయం.’’    - నాగబాబు

 

 ‘‘ఎన్నికల సందర్భంగా నటుడు శివాజీ రాజా, హేమ పరస్పరం చేసుకున్న వ్యాఖ్యలు పూర్తిగా వారి వ్యక్తిగతం. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో కొందరు కోర్టుకు వెళ్లారు. ఎవరెవరు ఎన్నిసార్లు మీడియా సమావేశాలు పెట్టారో అందరికీ తెలిసిందే.’’    - జయసుధ

 

 ‘‘మనసుకు నచ్చిన వ్యక్తికి ఓటేశాను. ‘మా’ పని తీరు గతంలో బాగుందా... ఇప్పుడు బాగుందా అనే విషయం చెప్పలేను. కొత్తగా వచ్చే ప్యానల్ మంచి పని తీరుతో చిన్న క ళాకారులను ఆదుకోవాలనేది అందరి కోరిక.’’     - సుమన్

 

 ‘‘రాజ్యాంగం ప్రకారం ఎన్నిక అనేది ఎంతో అవసరం. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాల్సి ఉండగా ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం బాధాకరం. అధికారం కోసం జరుగుతున్నవే ఈ ఎన్నికలు. అయినా అందరూ ముందుకు వచ్చి తమకు నచ్చిన వారిని ఎన్నుకోవడం మంచి పరిణామమే.’’ -ఆర్. నారాయణమూర్తి

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top