12 గంటల్లోనే సినిమా నిర్మాణం!

చెన్నైఏవిఎం స్టూడియోలో 'నడు ఇరవు' సినిమా ప్రారంభోత్సవ దృశ్యం - Sakshi


చెన్నై: సినిమా సాంకేతికపరంగా చాలా మార్పులు సంతరించుకుంటోంది. అలాగే ప్రేక్షకుల దృష్టిని తమవైపు తిప్పుకోవడానికి పరిశ్రమ వర్గాలు సరికొత్త ప్రయోగాలు చేయక తప్పని పరిస్థితి ఆ విధంగా ఒక ప్రయోగాత్మక చిత్రంగా నడు ఇరవు అనే చిత్రం తెరకెక్కనుంది. ఇంతకు ముందు 24 గంటలలో స్వయంవరం అనే చిత్రాన్ని తెరకెక్కించి తమిళ చిత్ర పరిశ్రమ గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఆ రికార్డుని అధిగమించడానికి మరో ప్రయత్నం జరుగుతోంది. తాజాగా 12 గంటలలోనే నడు ఇరవు (నడి రేయి) చిత్ర రూపకల్పనకు రంగం సిద్ధమైంది. జయలక్ష్మీ మూవీస్ పతాకంపై వి.ఎస్.మోహన్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అందరూ నూతన తారాగణం నటించనున్నారు.



ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం పుదుగై మారిసా. ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ఈ నెల 19న సాయంత్రం ఆరు గంటలకు షూటింగ్ ప్రారంభించి మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకు అంటే 12 గంటల్లో చిత్ర షూటింగ్ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఇది హర్రర్ కథా చిత్రం కావడంతో ప్రముఖ నటీనటులు అవసరం లేదన్నారు. చిత్రంలో మోనిక అనే బాల నటి ప్రముఖ పాత్ర పోషించనుందని చెప్పారు. చిత్ర షూటింగ్ ముహూర్తం కార్యక్రమం సోమవారం ఉదయం స్థానిక వడపళనిలో గల ఎ.వి.ఎం స్టూడియోలో నిర్వహించినట్లు దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమానికి తమిళ నిర్మాతల సంఘం అధ్యక్షుడు కె.ఆర్, కలైపులి జి.శేఖరన్, దర్శక నిర్మాత శక్తి చిదంబరం మొదలగు పలువురు చిత్ర ప్రముఖులు హాజరయ్యి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

**

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top