పాతికేళ్లకు ముందే తండ్రయ్యారా.. అయితే ముప్పే?

పాతికేళ్లకు ముందే తండ్రయ్యారా.. అయితే ముప్పే?


పాతికేళ్ల వయసు కంటే ముందే తండ్రయితే మధ్య వయసులోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందట. ఈ విషయాన్ని ఫిన్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకీ పరిశోధకులు వెల్లడించారు. యుక్త వయసులోనే తండ్రయితే  వారి ఆరోగ్యం క్షీణిస్తుందని, తద్వారా 40, 45 ఏళ్ల నడి వయసులోనే చనిపోయే ప్రమాదం ముందని చెప్పారు. ఎపిడమాలజీ అండ్ కమ్యూనిటి హెల్త్ ప్రచురించిన జర్నల్లో తమ  పరిశోధనా వివరాలను వెల్లడించారు.  



చిన్నవయసులో పిల్లల్ని కనడం మహిళలతో పోలిస్తే పురుషులపైనే ఎక్కువ ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడింది. ముఖ్యంగా భర్తగా, తండ్రిగా, కుటుంబ యజమానిగా పలు బాధ్యతలను నిర్వహించడంలో ఎదుర్కొనే ఒత్తిడే దీనికి కారణమని చెబుతున్నారు. ఈ సమయంలో ఎదుర్కొనే మానసిక, శారీరక ఒత్తిడులు యవ్వనంలో తండ్రయ్యేవారి ఆయుష్షును మింగేస్తున్నాయని స్పష్టంచేసింది. పురుషులు యుక్తవయసులో తండ్రి అవ్వడం, మధ్యవయసు మరణాలపై చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడైనట్టు చెబుతున్నారు. మధ్య వయసులో పురుషుల మరణాలకు, లేత వయసులో పితృత్వానికి మధ్య అవినాభావం సంబంధముందని తన పరిశోధకులు అంటున్నారు.



మధ్యవయసులో చనిపోతున్న పురుషుల సంఖ్య 22-24  ఏళ్ల మధ్య మొదటి బిడ్డను కలిగిన పురుషుల మరణాల శాతంతో పోలిస్తే  25 ఏళ్ల తర్వాత బిడ్డను కన్న పురుషుల మరణాల శాతం తక్కువగా ఉందని ఈ పరిశోధన చెబుతోంది. తమ పరిశోధనలో విద్యార్హతలు, నివాస  ప్రదేశాల లాంటి విషయాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు.  మొదటి బిడ్డను కన్న వయసు, పిల్లల సంఖ్య,  వైవాహిక స్థితి  ఇవన్నీ పురుషుల దీర్ఘకాలిక ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాయన్నారు.



పదేళ్ల కాలంలో ఒకటి నుంచి 20 మంది ఇలా మధ్య వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నట్టు తెలిపారు. 21 శాతం మంది తీవ్ర గుండె జబ్బులు, 16 శాతం మంది మద్యపాన సంబంధిత వ్యాధుల వల్ల చనిపోతే దాదాపు 26 శాతం మరణాలు తొందరగా బిడ్డను కనడం వల్ల  సంభవిస్తున్నాయని లెక్కలు  చెబుతున్నారు. అయితే ఆ పురుషుని కుటుంబ పరిస్థితులు, ఇతర సామాజిక పరిస్థితులను కూడా అధ్యయనం చేయాల్సి ఉందంటున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top