‘ఆ సినిమా’ను ఎందుకు ఆపారు?

‘వండర్‌ విమెన్‌’ ఎందుకు ఆపారు?


న్యూఢిల్లీ: భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైన ‘వండర్‌ విమెన్‌’ అనే హాలీవుడ్‌ చిత్రం లెబనాన్‌లో మాత్రం విడుదల కాలేదు. భారత్‌లో ఇంగ్లీషు, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో లెబనాన్‌ ఆర్థిక, వాణిజ్య శాఖ ఈ సినిమా విడుదలను తమ దేశంలో అడ్డుకోవడం వార్నర్‌ బ్రదర్స్‌ నిర్మాతలను నిరాశ పరిచింది.



ఈ సినిమాలో సూపర్‌ హీరోగా నటించిన హీరోయిన్‌ గాల్‌ గాడెట్‌ ఇజ్రాయెల్‌ దేశస్థురాలవడమే కాకుండా ఇజ్రాయెల్‌ సైన్యంలో కూడా పనిచేయడమే ‘వండర్‌ విమెన్‌’ సినిమాను నిషేధించడానికి కారణం. లెబనాన్, ఇజ్రాయెల్‌ దేశాల మధ్య కొన్ని దశాబ్దాలుగా యుద్ధాలు కొనసాగుతున్న విషయం తెల్సిందే. 2006లో జరిగిన యుద్ధంలో రక్తపాతం ఎక్కువగా జరిగింది. ఇద్దరు తమ సైనికులను సరిహద్దు కాల్పుల్లో చంపేశారని, మరో ముగ్గురు సైనికులను కిడ్నాప్‌ చేశారనే ఆరోపణలతో 2006లో లెబనాన్‌పైకి ఇజ్రాయెల్‌ పదాతి దళాలతోపాటు వైమానిక దాడులు జరిపాయి. ఈ యుద్ధంలో దాదాపు 1000 మంది లెబనీయులు మరణించారు.



ఆ యుద్ధం నుంచి ఇజ్రాయెల్‌ను లెబనాన్‌ శత్రుదేశంగా పరిగణిస్తూ వస్తోంది. వాండర్‌ విమెన్‌ సినిమాను అనుమతించాలని ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను కోరుకుంటున్న స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. పూర్తి ఫాంటసీ చిత్రమైన వాండర్‌ విమెన్‌ను అద్భుతమైన గ్రాఫిక్స్‌తో రక్తికట్టించడంతో ప్రపంచవ్యాప్తంగా అంచనాలు పెరిగాయి. సమ్మర్‌ సంప్‌ కారణంగా ద్వేన్‌ జాన్సన్‌ నటించిన బేవాచ్, పైరేట్స్‌ ఆఫ్‌ ది కరేబియన్‌ సీక్వెల్, ఏలియన్‌:కోవనెంట్, కింగ్‌ ఆర్థర్‌ లాంటి హాలివుడ్‌ చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఆశించిన మేరకు రాణించక పోవడంతో ఈ సినిమాపైనే నిర్మాతలు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు.



మంచి, న్యాయం, సమానత్వం, సాహసం, యుద్ధం, శాంతి అంశాలను ప్రతిబింబిస్తూ సాగే ఈ సినిమా ఆధ్యంతం ఆసక్తి దాయకంగా ఉందని జాతీయ మీడియా ప్రశంసించడంతోపాటు ఐదు స్టార్లకుగాను నాలుగు స్టార్ల రేటింగ్‌ను ఇచ్చారు. ‘వీర నారి వర్సెస్‌ మొదటి ప్రపంచ యుద్ధం’ చందంగా సినిమా ఉందని కితాబిచ్చారు. 3 డీ వర్షన్‌లో కూడా విడుదలైన ఈ సినిమాకు పాటీ జెన్‌కిన్స్‌ దర్శకత్వం వహించారు. ఓ మహిళ దర్శకత్వం వహించడం వల్ల కూడా ఈ సినిమాకు న్యాయం జరిగిందని విమర్శకులు అభిప్రాయపడ్డారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top