కుక్కలతోనే ఆమె జీవితం


బీజింగ్: ప్రపంచంలో కుక్కలను పెంచుకునేవారు, ప్రేమించేవారు ఎక్కువ మందే ఉంటారు. కానీ చైనాకు చెందిన 66 ఏళ్ల యాంగ్ జియావోయున్ కుక్కలను ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించరని చెప్పవచ్చు. ఈశాన్య చైనాలోని తియాంజిన్‌లో నివసిస్తున్న ఆమె... జీవహింస నుంచి కుక్కలను రక్షించడం కోసం, వాటిని పోషించడం కోసం ఇప్పటివరకు దాదాపు 45 లక్షల రూపాయలను ఖర్చు చేయడమే కాకుండా తనకున్న రెండు ఇళ్లను కూడా ఆమ్మేసింది. అమ్మ అలవాటును మానిపించలేకపోయిన కొడుకు ఆమెను విడిచి కొన్నేళ్లపాటు ఇల్లొదిలి దూరంగా ఉన్నాడు. అయినా ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు. కుక్కలతోటే తన జీవితమని గడుపుతోంది. రెండిళ్లు అమ్మేయగా ప్రస్తుతం మిగిలిన పెరటిలాంటి స్థలంలోనే 700 కుక్కలను సాకుతోంది. అదే ప్రాంగణంలో ఓ టెంటు వేసుకొని శరణార్థిలా బతుకుతూ కుక్కల ఆలనా పాలనా చూసుకుంటోంది.

చైనాలో పేరుపొందిన యూలిన్ 'డాగ్ మీట్ ఫెస్ట్‌వల్'కు ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా వెళ్లి దాదాపు 300 కుక్కలను కొనుగోలు చేసి తీసుకొచ్చింది. జూన్ నెలలో జరిగే ఈ ఫెస్టివల్‌లో కుక్కలను రక్షించడం కోసం తానుండే తియాంజిన్ నుంచి 1500 కిలోమీటర్ల దూరంలోవున్న యూలిన్‌కు ప్రయాసపడి వెళ్లి వస్తోంది. సంప్రదాయబద్ధమైన ఈ ఫెస్టివల్ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నప్పటికీ 2013లోనే తన దృష్టికి వచ్చిందని, అప్పటి నుంచి ప్రతి ఏటా అక్కడికెళ్లి ఎంత ఖరీదైనా మానవుల ఆహారానికి బలికాకుండా సజీవంగా వాటిని రక్షించి తీసుకొస్తానని ఆమె చెబుతోంది. మాంసాహారం కోసం వారికి ఐదారు వందలకే దొరకే కుక్కలను తనకు మాత్రం 1500 రూపాయలకు తక్కువ అమ్మరని ఆమె తెలిపింది. తాను అక్కడికెళ్లినప్పుడల్లా తనను తమాషాగా చూస్తారని, తనకు 'కిల్ హర్' అనే నిక్ నేమ్‌తో పిలుస్తారని చెప్పింది.



యూలిన్ డాగ్ మీట్ ఫెస్టివల్‌లో ప్రతిఏటా దాదాపు 10 వేల కుక్కలను చంపి, వాటి మాంసాన్ని వండి, వడ్డిస్తారు. ఈ ఫెస్టిఫల్‌కు వ్యతిరేకంగా జీవకారణ్య సంస్థలు సామాజిక వెబ్‌సైట్ల ద్వారా విస్తృత ప్రచారం సాగించడంతో ఈసారి వెయ్యికి మించి కుక్కలు బలికాలేదు. కుక్కలను రక్షించడం, వాటిని పొషించే అలవాటు తనకు తొలిసారిగా 1995లో అలవాటైందని, తన భర్త 1996లో మరణించాడని, అప్పటి నుంచి వీటిని పోషించడమే ప్రధాన వ్యాపకం అయిందని ఆమె మీడియాకు చెప్పింది. చైనా లిటరేచర్‌లో తాను టీచర్‌గా పనిచేసి తాను రిటైరయ్యానని, తీరిక వేళల్లో కవిత్వం రాసేదాన్నని ఆమె వివరించింది.

ఇప్పుడు క్షణం తీరిక దొరకడం లేదని, 700 కుక్కలకు వండి పెట్టడం, సమయానికి వాటికి వ్యాక్సిన్‌లు వేయడానికే సమయం సరిపోవడం లేదని తెలిపింది. జాతుల పేరిట మానవులు కొట్టుకునే నేటి సమాజంలో అన్ని జాతుల కుక్కలు తన సంరక్షణలో కలిసిమెలసి జీవించడం సంతోషంగా ఉందని చెప్పింది. ఇప్పుడు తనను అర్థం చేసుకున్న తన కుమారుడు, కోడలు అప్పడప్పుడు వచ్చి తనకు సహాయం చేయడం కూడా తనకు సంతృప్తిగా ఉందని పేర్కొంది.కుక్కల అరుపులతో తమకు నిద్ర పట్టడం లేదంటూ ఇరుగు పొరుగువారి ఫిర్యాదులు ఎక్కువయ్యాయని, ఆ అరపులు వినకపోతే తనకు నిద్రపట్టదని ఆమె ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది.





Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top