జంతువులను ఎందుకు హలాల్ చేయాలి?

జంతువులను ఎందుకు హలాల్ చేయాలి? - Sakshi


లండన్: ప్రపంచంలో ఎక్కడైనా యూదులు, ముస్లింలు హలాల్ చేయని మాంసం తినరు. అది వారి మత విశ్వాసం. హలాల్ చేయడమంటే మాంసం కోసం కోడి, మేక, పశువులాంటి జంతువులను చంపేటప్పుడు అవి తప్పనిసరిగా బతికి ఉండడమే కాకుండా తెలివితోనే ఉండాలి. వాటిని మెడలు నరకటం ద్వారా చంపాలి. అప్పుడు వాటి మెడలోని ప్రధాన రక్తనాళాల నుంచి రక్తం బయటకు చిమ్మాలి. అలా చంపడాన్ని హలాల్ అంటారు. ముందుగా ఈ మత నిబంధన యూదుల్లో వచ్చింది. ఆ తర్వాత ముస్లింలు కూడా ఈ పద్ధతిని పాటిస్తూ వస్తున్నారు.



హలాల్ చేయడం ద్వారా జంతువుల ప్రధాన రక్తనాళాలు తెగిపోయి రక్తమంతా బయటకు వెళ్లిపోతుందని, అలా పోవాలన్నదే యూదుల మత నిబంధన సారాంశం. బతికున్న జీవిని చంపడమే ముస్లింల హలాల్ ఉద్దేశమట. చాలా సందర్భాల్లో మత విశ్వాసాలకు, సైన్స్ కు సంబంధం లేకపోవచ్చు. ఈ మత విశ్వాసం వెనుక సైన్స్ ఏమైనా ఉందా ?అన్న కోణంలో బ్రిస్టల్ యూనివర్శిటీ విశ్వవిద్యాలయం పరిశోధకులు అధ్యయనం జరిపారు. హలాల్ వెనుక శాస్త్ర విజ్ఞాన కారణం ఏమీలేదని, వాస్తవానికి హలాల్ చేయడంవల్ల జంతువులు ఎక్కువ బాధను, హింసను అనుభవిస్తాయని వారు కనుగొన్నారు.



మాంసం కోసం జంతువులను చంపేటప్పుడు వాటిని కరంట్ షాక్ లేదా యాంత్రిక పరికరాలతో స్పృహ కోల్పోయేలా చేసి చంపడం ఉత్తమమైన మార్గమని వారు సూచించారు. హలాల్ చేయడం ద్వారా చాలా సేపు జంతువులు నరకయాతన అనుభవిస్తాయని, అలా హింసించడం ఎంతమాత్రం సమంజసం కాదని వారన్నారు. పరిశోధకులు వాదనతో బ్రిటిష్ వెటర్నటీ అసోసియేషన్, ఫామ్ యానిమల్ వల్ఫేర్ కమిటీ, యూరోపియన్ యూనియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఏకీభవించాయి. ఈ అంశంలో ముస్లిం స్కాలర్లలో కూడా చైతన్యం తీసుకరావాల్సిన అవసరం ఉందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.



అయితే స్పృహ కోల్పోయేలా చేయడంవల్ల జంతువులకు హింస తగ్గుతుందని తాము భావించడం లేదని 65శాతం ముస్లిం స్కాలర్లు భావిస్తున్నారు. ముస్లింల హలాల్ మత సంప్రదాయం ప్రకారం చనిపోయిన జంతువును కోయరాదనే అసలు ఉద్దేశమని, జంతువులను స్పృహ కోల్పోయేలా చేయడం అనేది మరణం కిందకు రాదని వారు అంటున్నారు. మీట్ సైన్స్ పత్రికలో యూనివర్శిటీ పరిశోధకులు తమ అధ్యయన వివరాలను ప్రచురించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top