పాకిస్థాన్‌కు అమెరికా పత్రిక హెచ్చరిక

పాకిస్థాన్‌కు అమెరికా పత్రిక హెచ్చరిక - Sakshi


ఇటీవలి కాలంలో భారతదేశం వైపు అమెరికా మొగ్గు చూపుతున్నట్లే కనిపించినా, మరోవైపు పాకిస్థాన్‌కు కూడా సాయం చేస్తూనే ఉంటుంది. అలాంటిది అమెరికాలోని ప్రఖ్యాత పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ తొలిసారిగా పాకిస్థాన్‌ను హెచ్చరిస్తూ ఓ కథనం ప్రచురించింది. భారత ప్రధాని నరేంద్రమోదీ స్నేహహస్తం చాస్తున్నారని, దాన్ని నిరాకరిస్తే మాత్రం పాక్ ఓ పనికిమాలిన దేశంగా మిగిలిపోతుందని తెలిపింది. భారతదేశం వ్యూహాత్మకంగానే సహనం పాటిస్తోందని, కానీ దాన్ని అలుసుగా తీసుకుంటే నష్టపోయేది పాకిస్థానేనని వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది. మోదీ ప్రస్తుతానికి సహనం పాటిస్తున్నారని, కానీ ఇస్లామాబాద్ ఈ వైఖరి ఎక్కువకాలం అవలంబించడం సరికాదని, అలా చేస్తే ఇప్పుడు ఉన్నదానికంటే పనికిరాని దేశంగా పాక్ మిగిలిపోతుందని చెప్పింది. సరిహద్దుల్లో ఉగ్రవాదులకు ఆయుధాల సరఫరాను పాక్ కొనసాగిస్తే, భారత ప్రధానమంత్రి దానికి గట్టిగా సమాధానం చెప్పగలరని తెలిపింది.



ఉగ్రవాద విషయంలో భారత్ నైతిక విలువలను ఎప్పుడూ పాటిస్తూనే ఉందని, కానీ ఆ విషయాన్ని గట్టిగా చెప్పడానికి గతంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ధైర్యం చేయలేకపోయాయని ఆ కథనం పేర్కొంది. ఆ వ్యూహాత్మక మౌనం వల్ల పాకిస్థాన్‌ ఎన్నిసార్లు దాడులకు పాల్పడినా.. ఆ ఉగ్రవాదానికి ఎప్పుడూ బాధ్యురాలిగా చేయలేదని కూడా తెలిపింది. ఇప్పటికిప్పుడు ఎలాంటి సైనిక చర్య తీసుకోకూడదన్న ప్రధాని మోదీ నిర్ణయాన్ని అమెరికన్ పత్రిక ప్రశంసించింది. దానికి బదులు పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఒంటరిని చేసే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపింది. 1960 నాటి సింధు నదీజలాల ఒప్పందాన్ని రద్దు చేయడం, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను తప్పించడం లాంటి చర్యల ద్వారా పాక్‌ను అణగదొక్కే ప్రయత్నాలపై ఆలోచిస్తున్నారని కథనంలో వివరించింది.



ఉడీ ఉగ్రదాడి తర్వాత భారత విధాన నిర్ణేతలకు తీవ్రస్థాయిలో కోపం, చికాకు వచ్చాయని, దాంతో తక్షణం సైనిక చర్య తీసుకోవాలన్న ఒత్తిడులు కూడా వచ్చాయని ఆ పత్రిక చెప్పింది. భారీ సైనిక దాడి చేస్తే ప్రజల్లో ఉన్న ఆవేశం కూడా కొంతవరకు తగ్గుతుందని.. కానీ దానివల్ల భారత ప్రభుత్వ రాజకీయ, ఇతర ప్రయోజనాలు నెరవేరుతాయో లేదో మాత్రం అనుమానమేనని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top