834 మంది అమ్మాయిలు.. ఒక్కడే అబ్బాయి!

834 మంది అమ్మాయిలు.. ఒక్కడే అబ్బాయి! - Sakshi


లాస్ ఏంజిలిస్: ప్రేమికుల రోజు అనగానే సాధారణంగా ఏం జరుగుతుంది.. ప్రేమికుడు తన ప్రేయసికి.. ప్రేయసి తన ప్రియుడికి బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. అలాగే దంపతులు కూడా తమ జీవిత భాగస్వామికి ఎదో ఒక గిఫ్ట్ ఇచ్చి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తడంతో పాటు వారి ఆనందక్షణాలను నెమరు వేసుకోవడం సహజమే. లాస్ ఏంజిలిస్ లో జరిగిన విషయాన్ని వింటే ఎవరైనా సరే ముక్కు మీద వేలేసుకుంటారు. గత మూడేళ్ల నుంచి స్నేహితులకు 'వాలెంటైన్స్ డే' గిప్ట్స్ ఇచ్చేవాడు. కానీ, ప్రస్తుతం అతడు చేసింది నిజంగా అద్బుతమే అనిపిస్తుంది.



ప్రపంచ ప్రేమికులరోజు నాడు అమెరికాకు చెందిన ఓ టీనేజీ కుర్రాడు హెడేన్ గాడ్ఫ్రే స్మిత్ ఫీల్డ్ లో తాను చదివే పాఠశాలలో ఉన్న అందరు విద్యార్థినులకు అందమైన గులాబీలు ఇచ్చి వారి మనసులు దోచుకున్నాడు. దాని వెనక అతడి మూడేళ్ల శ్రమ దాగి ఉంది. 14 ఏళ్లు ఉన్నప్పుడు అతడికి ఓ ఆలోచన వచ్చింది. అప్పటినుంచి ఏదో విధంగా కష్టపడి డబ్బు సంపాదించాడు. నేడు కోరుకున్న పనిని చేసి తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. గత మూడేళ్ల నుంచి డబ్బు పొదుపు చేయడం మొదలుపెట్టాడు. మెక్ డొనాల్డ్స్ లో వంటవాడిగా, గత పది నెలలుగా మెక్సికన్ రెస్టారెంట్ లో అంట్లు కడగడం కూడా చేశాడు. చివరికి తాను పోగుచేసిన 450 అమెరికన్ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు 30వేల రూపాయలు) వెచ్చించి ఆన్ లైన్ మార్కెట్లో 900 గులాబీలు ఆర్డర్ చేశాడు. పూల మొక్కలను అందంగా కత్తిరించడానికి 20 మంది స్నేహితుల సాయం తీసుకుని గులాబీలను జాగ్రత్తగా సేకరించాడు. వాలెంటైన్స్ డే కానుకలుగా పూలను అమ్మాయిలకు ఇచ్చి తన కోరికను సంతోషంగా, నిరాటంకంగా తీర్చుకున్నాడు.


ఆనందంలో హెడేన్ గర్ల్ ఫ్రెండ్

హెడేన్ గాడ్ఫ్రే చేసిన పని తనకు చాలా నచ్చిందని ఆరు నెలల కింద అతడికి గర్ల్ ఫ్రెండ్ అయిన లిలియాన్ షార్ప్ తెలిపింది. ఈ రోజు పాఠశాలకు వచ్చిన ప్రతి బాలిక చాలా సంతోషంగా పువ్వుతో ఇంటికి తిరిగి వెళ్తుందని చెబుతూ ఆనందంలో మునిగి తేలింది. వాలంటీర్ల సహాయంతో మొత్తం 834 మంది అమ్మాయిలకు పువ్వులను గిఫ్ట్ గా ఇవ్వడం చాలా గొప్ప విషయమని, హెడేన్ చాలా చురుకైన విద్యార్థి అని.. అందరిలాంటి వాడు కాదంటూ స్కూలు అసిస్టెంట్ ప్రిన్సిపాల్ కర్ట్ హాంక్స్ మాట్లాడారు.



Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top