కలాంకు అమెరికా మీడియా ఘన నివాళి

కలాంకు అమెరికా మీడియా ఘన నివాళి - Sakshi


వాషింగ్టన్:  భారత్ అణు సామర్థ్య దేశంగా ఎదగడానికి కృషిచేసిన కీలక వ్యక్తుల్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఒకరని అమెరికా మీడియా ప్రశంసించింది. 'మ్యాన్ ఆఫ్ మిసైల్' అబ్దుల్ కలాం మృతికి సంతాపం తెలియజేస్తూ ప్రత్యేక కథనాలను ప్రచురించింది. అణు, అంతరిక్ష రంగాల్లో భారత్ ఎదగడానికి కలాం విశేష సేవలందించారని కొనియాడింది.



రక్షణ రంగంలో భారత్ శక్తిమంతమైన దేశంగా ఎదగడానికి కలాం ఎంతో తోడ్పడ్డారని ద న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. బయటి శక్తుల నుంచి ముప్పు వాటిల్లకుండా భారత్ బలమైన దేశంగా ఎదగడానికి కలాం పరిశోధనలు ఉపయోగపడ్డాయని వెల్లడించింది. విదేశీ సాయం లేకుండా భారత్ సొంతంగా అణుబాంబులు తయారు చేయగల నైపుణ్యం సాధించిందని ద న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది.


 


అణ్వాయుధాలను తీసుకెళ్లగల పృథ్వి, అగ్ని వంటి బాలిస్టిక్ క్షిపణులను రూపొందించడం ద్వారా కలాం భారత రక్షణ వ్యవస్థను పటిష్టం చేశారని వాషింగ్టన్ పోస్ట్ ప్రశంసించింది. 1998లో భారత్ నిర్వహించిన అణుపరీక్షల్లో కలాం కీలక పాత్ర పోషించారని పేర్కొంది. భారత అంతరిక్ష, క్షిపణి రంగాల పటిష్టతకు కలాం విశేష సేవలందించారంటూ ద వాల్ స్ట్రీట్ జర్నల్ నివాళులు అర్పించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top