అందరు చూస్తుండగానే...రక్తం మడుగులో

అందరు చూస్తుండగానే...రక్తం మడుగులో


ఢాకా: బంగ్లాదేశ్ ఢాకా యూనివర్శిటీలో అందరిముందే దారుణం జరిగింది. మతోన్మాదం తలకెక్కిన కొంతమంది ఇస్లాం టైస్టులు గురువారం రాత్రి 8.45 గంటలకు ప్రముఖ బ్లాగర్, నాస్తికుడు, రచయిత డాక్టర్ అవిజిత్ రాయ్‌ని దారుణంగా కత్తులతో పొడిచి చంపేశారు. అడ్డంవచ్చిన రాయ్ భార్య రఫిదా అహ్మద్‌ను తీవ్రంగా గాయపరిచి పారిపోయారు. చుట్టూ పదుల సంఖ్య జనం ఉన్నా ఎవరూ ఓ నిండు ప్రాణాలు కాపాడేందుకు ముందుకు రాలేదు. భార్య రఫిదా సాయం కోసం అర్ధించినా ఎవరిలో చలనం రాలేదు. రఫిదా ముస్లిం వనిత అవడం వల్ల ఆమెను మాత్రం టైస్టులు ప్రాణాలతో వదిలేసినట్లు ఢాకా పోలీసులు తెలియజేశారు. రఫిదా ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఢాకా ప్రభుత్వాస్పత్రిలో చావు, బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. రాయ్ హత్యకు తామే బాధ్యులమంటూ ‘అన్సార్ బంగ్లా-7’అని మతఛాందస సంస్థ గర్వంగా ప్రకటించుకోవడమే కాకుండా భర్త మృతదేహం పక్కన ఒళ్లంత రక్తం కారుతుండగా స్థానికుల సాయం అర్థిస్తున్న దృశ్యాలను సోషల్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు. మతోన్మాదాన్ని విమర్శిస్తున్నందుకు, అమెరికా పౌరుడైనందుకు తామీ హత్యకు పాల్పడ్డామని చెప్పుకుంది.



 అవిజిత్ రాయ్ బంగ్లాదేశీయుడు. అమెరికాలో ఇంజనీరింగ్ చదువుకొని రఫిదా అహ్మద్‌ను మతాంతర వివాహం చేసుకున్నాడు. ఇద్దరు కలిసి అమెరికాలోని అట్లాంట నగరంలో సెటిలయ్యారు. ఇద్దరూ నాస్తికవాదులు. సామాజిక అంశాలపై ఎన్నో రచనలు చేశారు. ప్రస్తుతం ఇద్దరు బ్లాగులు నడుపుతున్నారు. నాలుగు రోజుల క్రితమే అమెరికా నుంచి ఢాకాకు వచ్చిన వారు యూనివర్శిటీలో నిర్వహిస్తున్న బుక్ ఎగ్జిబిషన్ సందర్శనకు గురువారం వచ్చారు. రాయ్ రచనలకు వ్యతిరేకంగా ఏదో ఒక రోజు తప్పకుండా రాయ్‌ని చంపుతామని కొంతమంది ముస్లిం ఛాందసవాదులు సోషల్ వెబ్‌సైట్లలో పలుసార్లు హెచ్చరించారట. ఇప్పుడు ఆ హెచ్చరికల ఆధారంగా హంతకులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఢాకా పోలీసులు తెలిపారు. యూనివర్శిటీకి చెందినవారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని తాము భావిస్తున్నామని, ఆ దిశగా కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ప్రముఖ సామ్యవాది, మానవ హక్కుల కార్యకర్త అజయ్‌రాయ్ కుమారుడు డాక్టర్ అవిజిత్ రాయ్.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top