ఉద్యోగం లేదని.. 26 మందిని కన్నాడు!
అతను బ్రిటన్లోనే అత్యంత బద్ధకస్థుడైన ఓ తండ్రి. పనీపాటా లేకుండా పిల్లల్ని కనడమే పనిగా పెట్టుకున్నాడు. 15 మంది భార్యలతో ఏకంగా 26 మంది పిల్లల్ని కన్నాడు. వారిలో 14 మంది ఆడపిల్లలు కాగా, 12 మంది మగ పిల్లలు. వారి వయస్సు నాలుగేళ్ల నుంచి 44 ఏళ్ల వయస్సు వరకు ఉంటుంది. ఆ తండ్రి పేరు పీటర్ రోల్ఫీ. ప్రస్తుతం 64 ఏళ్లు. నిరుద్యోగి. ఉద్యోగం దొరక్క కాదు... చేయడానికి మహా బద్ధకం. ఒళ్లొంచి పనిచేయలేడు. తేరగా వచ్చింది తిని బతకడమే అలవాటు. బ్రిటిష్ చట్టాలను ఆసరాగా చేసుకొని ప్రభుత్వం ఇచ్చే భృతితో గత 20 ఏళ్లుగా ఇలాగే జీవిస్తున్నాడు.
బ్రిటిష్ చట్టాల ప్రకారం నిరుద్యోగులకు భృతి ఇవ్వడం, పిల్లలు పోషణార్థం వారి పేరిట కూడా నెలనెలా డబ్బులివ్వాల్సిన బాధ్యత స్థానిక ప్రభుత్వ విభాగాలది. ఈ చట్టాలను ఆసరాగా చేసుకొని దేశంలో చాలా కుటుంబాలు పనీపాటా లేకుండా బతకటం మొదలు పెట్టాయి. ఆర్థిక సంస్కరణలే ప్రధాన ఎజెండాగా అధికారంలోకి వచ్చిన బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ 2013లో నిరుద్యోగ, పిల్లల పోషణ భృతులను ఎత్తివేయాలని ప్రయత్నించారు. అన్ని పక్షాల నుంచి వ్యతిరేకత రావడంతో పూర్తిగా ఎత్తివేయలేక కోతల విధించారు.
అప్పటి నుంచి పీటర్ రోల్ఫీకి కొంచెం కష్టాలు మొదలయ్యాయి. మొన్నటి వరకు నివసించిన మూడు బెడ్రూంల ఇల్లు ఇరుకైంది. ఇల్లంతా పిల్లలతో కిక్కిరిసి పోతోందని, ఒకరిపై ఒకరు అన్నట్టుగా పడుకోవాల్సి వస్తోందని ఆరోపిస్తూ స్థానిక కౌంటీ ప్రభుత్వం వద్దకు వెళ్లాడు. తనకు ఐదు బెడ్రూంల ఇల్లు కావాలని మొరపెట్టుకున్నాడు. అందుకు కౌంటీ అధికారులు నిరాకరించారు. దాంతో కోర్టుకెక్కాడు. సుదీర్ఘకాలం పాటు న్యాయ పోరాటం చేశాడు. ఇటీవలే కేసు గెలిచాడు. కోర్టు ఆదేశాల మేరకు స్థానిక ప్రభుత్వం 'ఐజిల్ ఆఫ్ వైట్' ద్వీపంలో ఐదు బెడ్ రూంల ఇంటిని కేటాయించింది. గత డిసెంబర్ నెల 8వ తేదీన పీటర్ సకుటుంబ సపరివారంగా కొత్తింటికి కాపురం మార్చాడు. ఇంతటితో సంతృప్తి చెందని పీటర్ కోర్టు తీర్పు ఆలస్యం కారణంగా తనకు 93 వేల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వ న్యాయ సహాయకుడికి నోటీసు పంపించాడు. ఆ సొమ్ము చెల్లించడానికి న్యాయ సహాయకుడు అంగీకరించినా అధికారులు మాత్రం అంగీకరించడం లేదు. ఇప్పటికే పీటర్ కుటంబం పోషణార్థం ఏడాదికి దాదాపు 47 లక్షల రూపాయలు చెల్లిస్తున్నామని, ఇంతకుమించి చెల్లించడానికి ఖజానాలో సొమ్మేమీ మురిగిపోవడం లేదని అధికారులు అంటున్నారు. తానేమీ రాజ భవనంలో నివసిస్తూ భోగభాగ్యాలు అనుభవించడం లేదని, పిల్లల పోషణార్థమే నష్టపరిహారం కోరుతున్నానని పీటర్ వాదిస్తున్నారు. ఏదేమైనా ఆశించింది సాధించేందుకు మరో న్యాయ పోరాటం చేస్తానని పీటర్ ప్రతిజ్ఞ చేశాడు.