భారతీయుల వలసలపై ట్రంప్‌ భావన తప్పు

భారతీయుల వలసలపై ట్రంప్‌ భావన తప్పు - Sakshi


కొలోగ్ని: ప్రపంచవ్యాప్తంగా ప్రజల వలసలపై ఎన్నో అపర్థాలు, మరెన్నో అపోహలు నెలకొని ఉన్నాయి. ఒకప్పుడు పొట్టకూటి కోసం పొట్ట చేతపట్టుకొని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసలుపోతే నేటి ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచ దేశాల మధ్య పరస్పరార్థమైన ప్రజల వలసలు కొనసాగుతున్నాయి. ఇటు వలసలుపోతున్న దేశాలకు, అటు వలసపోతున్న దేశాలకు రెండు విధాల ప్రయోజనాలు కలుగుతున్నాయి.



ఆతిథ్య దేశాల్లో వలసల వల్ల పన్నుల రూపంలో వచ్చే ఆర్థికపర మైన ప్రయోజనమే కాకుండా, నైపుణ్యాభివద్ధితోపాటు యువ కార్మిక శక్తి లభించడం ద్వారా కూడా ప్రయోజనం కలుగుతోంది. వలసల కారణంగా మాతృదేశానికి వలస కార్మికులు పంపిచే సొమ్ము, వారి పెట్టుబడుల వల్ల ఆర్థిక ప్రయోజనం ఎక్కువగా కలుగుతోంది. ప్రపంచ వలసలను ఆహ్వానించడం వల్ల స్థానికులకు ఉద్యోగాలు పోతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనోల్డ్‌ ట్రంప్‌ వాపోవడం సగం సత్యమేనని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

 

ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచ దేశాల సరహద్దుల అడ్డంకులు తొలగిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 24.30 కోట్ల మంది ప్రజలు వలస పోయారని ఐక్యరాజ్య సమితి అంచనాలు తెలియజేస్తున్నాయి. అంటే మొత్తం ప్రపంచ జనాభాలో 3.4 శాతం జనాభా వలస పోయిందన్నమాట. అమెరికా, జర్మనీ, రష్యా, సౌదీ అరేబియా, బ్రిటన్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, కెనడా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, స్పెయిన్‌ దేశాలకు ప్రజలు ఎక్కువగా వలసలు పోతుండగా, భారత్, మెక్సికో, రష్యా, చైనా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, యుక్రెయిన్, ఫిలిప్పీన్స్, సిరియా, బ్రిటన్‌ దేశాల నుంచి ప్రజలు ఎక్కువగా వలసపోతున్నారు.







పెద్ద ఉద్యోగాలే చేస్తున్నారు

కాయకష్టం చేసి బతికేవాళ్లు, పెద్దగా చదువుకోలేనివారు, ఉన్నచోట ఉద్యోగావకాశాలు లేక ఇబ్బంది పడుతున్నవారు అభివృద్ధి చెందిన దేశాలకు వలసలు పోతున్నారన్నది ప్రజల సామాన్య భావన. పోయినవారు కూడా చిన్నా చితక ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారన్న అభిప్రాయం కూడా ఎక్కువగానే ఉంది. ఇది పూర్తిగా అపోహ మాత్రమే. వెనకబడిన దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ఈ దేశాల నుంచి అభివృద్ధి చెందిన దేశాలకు వలసలు పోవడం నిజమే అయినప్పటికీ చదువు, సంధ్యలు తక్కువగా ఉన్న వారు వలసపోతున్నారనడంలో, చిన్నా చితక ఉద్యోగాల్లో స్థిర పడుతున్నారనడంలో నిజం లేదని వలసలు పోతున్న ప్రజల విద్యార్హతలు, వారు చేస్తున్న ఉద్యోగాలను పరిగణలోకి తీసుకుంటే స్పష్టం అవుతోంది.



భారత్‌కన్నా నైజీరియన్లే ఎక్కువ

దేశ జనాభా సంఖ్యాపరంగా చూస్తే భారత్‌కన్నా అమెరికాకు వలసపోతున్నవారు నైజీరియన్లు ఎక్కువ. దేశం పేరునుబట్టి పెద్దగా చదువుకోని నైజీరియన్లే అమెరికాకు వలసపోతున్నారని అపార్థం చేసుకుంటాం కూడా. అమెరికాలోనే విజయవంతమైన వలస గుంపు నైజీరియన్లేనని ‘ది ట్రిపుల్‌ ప్యాకే జ్‌’ అనే పుస్తకం వెల్లడిస్తోంది. వ్యాపారంలో, బ్యాంకింగ్‌ పెట్టుబడి రంగంలో వారు ఎక్కువగా ఉన్నారు. అమెరికాలో స్థిరపడిన నైజీరియన్లలో నాలుగోవంతు మంది ఏడాదికి లక్ష డాలర్లు సంపాదిస్తున్నారు. 20 శాతం మంది స్థానిక అమెరికన్లు మాత్రమే  ఏడాదికి లక్ష డాలర్లు సంపాదిస్తున్నారు. ఆఫ్రికన్ల వలసల వల్ల అమెరికాకు ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనమే కలుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వలస వస్తున్న పిన్న వయస్కుల్లో ఆఫ్రికన్లే ఎక్కువగా ఉన్నారు. ఆఫ్రికా నుంచి వలసవెళుతున్న వారిలో మూడొంతుల మంది 15 నుంచి 54 ఏళ్ల మధ్యవయస్కులే ఉన్నారు.





50 శాతం కంపెనీలు వలసవారివే

అమెరికాలో అత్యధిక పెట్టుబడులు పెట్టిన స్టార్టప్‌ కంపెనీల్లో యాభై శాతంకుపైగా కంపెనీల్లో వలసవచ్చిన ప్రజలే వ్యవస్థాపకులుగా లేదా సహ వ్యవస్థాపకులుగా ఉన్నారని ‘నేషనల్‌ ఫౌండేష్‌ ఆప్‌ అమెరికన్‌ పాలసీ’ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా వలసపోయిన కోటిన్నర భారతీయుల్లో ఎక్కువ మంది మెనేజ్‌మెంట్, టెక్నాలజీ, సైన్స్, ఆర్ట్స్‌ రంగాల్లో ఉన్నారు. ఒక్క అమెరికానే పరిగణలోకి తీసుకున్నట్లయితే అక్కడి భారతీయుల్లో 21 శాతం మంది వ్యాపార, వాణిజ్య, ఆర్థిక రంగాల్లోనే స్థిరపడ్డారు. అంతేకాకుండా అమెరికాలో వలసదారులు ఏర్పాటు చేసిన కంపెనీల్లో 33 శాతం కంపెనీలు భారతీయులవే. బ్రిటన్‌ కంపెనీల్లో కూడా ఏడు శాతం భారతీయులు ఏర్పాటు చేసినవే.



40 శాతం చైనా నుంచి వలసలు

‘ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ కోపరేటివ్‌ ఎకనామిక్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌’ దేశాల నుంచి వలసపోతున్న మొత్తం ప్రజల్లో 40 శాతం మంది చైనీయులే ఉన్నారు. అమెరికా వలస వెళ్లిన విద్యార్థుల్లో కూడా నాలుగోవంత మంది చైనీయులే. అక్కడి స్థిరపడిన ఉద్యోగస్థుల్లో కూడా విద్యార్హతలు ఎక్కువగా ఉన్న చైనీయులు ఉన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో వలసలనేవి తప్పనిసరైన ఓ కోణం. దీనివల్ల భిన్న సరిహద్దులు, భిన్న సంస్కృతులు, జాతులు, భిన్న ఆర్థిక వ్యవస్థల మధ్య ఒక విడదీయలేని బంధం ఏర్పడుతుందనేది ప్రపంచీకరణను సమర్థించే ఆర్థికవేత్తల భావన.



Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top