వెల్లింగ్టన్ లో వింత సమస్య!

వెల్లింగ్టన్ లో వింత సమస్య! - Sakshi


వెల్లింగ్టన్ : న్యూజిల్యాండ్ లోని ఓ పట్టణం వింత సమస్యను ఎదుర్కొంటోంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాలు నిరుద్యోగ సమస్యతో  బాధపడుతుంటే.. అక్కడ మాత్రం ఉద్యోగాలు చేసేవారు లేక, ఇతర ప్రాంతాలనుంచి వచ్చేవారికోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఉద్యోగాలు ఫుల్ గా ఉన్నా అభ్యర్థులు లేకపోవడం ఆ సిటీలో పెద్ద సమస్యగా మారిపోయింది. అంతేకాదు అక్కడ ఉన్న ఇళ్ళలో కూడ ఎవరూ నివసించేందుకు ముందుకు రావడం లేదట.



న్యూజిల్యాండ్ క్లుతా జిల్లా, కైటంగట పట్టణంలో ఇప్పుడు నిరుద్యోగ సమస్యకు బదులుగా అభ్యర్థుల కొరత బాధిస్తోందట. ప్రపంచంలో ఎన్నోదేశాలు ఎదుర్కొంటున్న సమస్యకు భిన్నంగా అక్కడి ప్రభుత్వం.. ఉద్యోగులు కావాలంటూ ఎదురు చూడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అతి చిన్న పట్టణమైన కైటంగటలో కేవలం 800 కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి. అయితే ఉద్యోగాలు అత్యధికంగా ఉండటంతో ప్రభుత్వం అభ్యర్థులకోసం పడిగాపులు పడాల్సివస్తోంది. ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఏకంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఉద్యోగం చేస్తామని ముందుకొచ్చేవారికి ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తోంది. ఇల్లు, స్థలంతోపాటు, అధిక వేతనాలు అందించేందుకు సైతం సిద్ధమైంది. జిల్లాలో మొత్తం 1000 దాకా ఉద్యోగాలు ఖాళీగా ఉండిపోయాయని, అందుకే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, ఇతర ప్రాంతాలనుంచి కూడ అభ్యర్థులను రిక్రూట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు జిల్లా మేయర్ బ్రియాన్ కేడోజిన్ తెలిపారు.



క్లుతా జిల్లాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఎక్కువగా డైరీ ప్రాసెసింగ్ ప్లాంట్లు, పరిశ్రమల్లోనే కావడం, దానికి తోడు కైటంగట పట్టణం ఓ మారుమూలకు ఉండటం కూడ ఇక్కడకు ఉద్యోగాలకోసం వచ్చేందుకు అభ్యర్థులు వెనుకాడుతున్నట్లు మేయర్ చెప్తున్నారు. ఖాళీలను భర్తీ చేసేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నామని మేయర్ తెలిపారు. స్థానిక ప్రజలు ఉద్యోగాలకు సరిపోకపోవడంతో సమీపంలోనే ఉన్న డునిడెన్ నుంచి బస్సుల్లో కొందర్ని ఇక్కడికి రప్పిస్తున్నట్లు తెలిపారు. ఒకప్పుడు తాను, తన కుటుంబం తిండికోసం ఇబ్బందులు పడుతున్నపుడు ఈ ప్రాంతం తనకు ఉద్యోగాన్నిచ్చి ఆదుకుందని, ఇప్పుడు తానుసైతం ఇబ్బందులుపడే ఇతర కివి కుటుంబాలకు ఉద్యోగాలను అందించే ప్రయత్నం చేస్తున్నట్లు బ్రియాన్ చెప్తున్నారు. అలాగే కైటంగటలో డైరీ ఫాం నిర్వహిస్తున్న మూడో తరం వ్యక్తి ఎవాన్ డిక్  కూడ ఈ డ్రైవ్ లో భాగం పంచుకున్నాడు. ఇదో ఓల్డ్ ఫ్యాషన్ కమ్యూనిటీ అని, ఇక్కడ ఇళ్ళకు ఎవ్వరూ తాళాలు కూడ వేసుకోరని, పిల్లలు హాయిగా పరుగులు పెట్టి ఆడుకునేట్లుగా ఉండే ఈ ప్రాంతంలో అధికశాతం ఉద్యోగాలు, ఇళ్ళు ఉన్నా... ప్రజలే తక్కువగా ఉన్నారని చెప్తున్నారు. ఈ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.  ఉద్యోగాలు కావాలన్నా దొరకని నేటి పరిస్థితుల్లో ఇక్కడ ఉద్యోగాలిస్తాం రండి బాబూ.. అంటూ అభ్యర్థులకోసం పడిగాపులు పడటం నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదూ...

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top