అక్కడ భారతీయులకు ఇల్లు అద్దెకివ్వరు

అక్కడ భారతీయులకు ఇల్లు అద్దెకివ్వరు - Sakshi


సింగపూర్: సింగపూర్‌లో ప్రాపర్టీ సర్చ్ వెబ్ పోర్టల్ సహ వ్యవస్థాపకుడు డేరియస్ చీయుంగ్ గతేడాది సింగపూర్ సిటీలో అద్దె ఇంటి కోసం పడరాని పాట్లు పడ్డారు. అద్దె ఇళ్లు అందుబాటులో లేకకాదు. భారతీయురాలిని భార్యగా కలిగి ఉన్నందుకు ఆయనకు ఎవరూ అద్దెకు ఇళ్లు ఇవ్వలేదు. భారతీయులకే కాదు, చైనీయులకు కూడా తాము ఇళ్లు అద్దెకు ఇవ్వమంటూ అద్దె ఇళ్లు వెతికిపెట్టే పోర్టల్స్‌లో కూడా నోటీసులు ఉంటున్నాయి. ‘గమ్‌ట్రీ.ఎస్‌జీ, ప్రాపర్టీగురు’ వెబ్‌సైట్లలో ఇలాంటి హెచ్చరికలు మనకు కనిపిస్తాయి.



ప్రపంచ వాణిజ్య కేంద్రంగా, బహుళ సంస్కృతుల సమ్మిలిత కేంద్రంగా ప్రసిద్ధి చెందిన సింగపూర్‌లో భారతీయుల పట్ల ఇలాంటి వివక్ష చూపించడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇతర జాతుల పట్ల వివక్ష చూపితే కఠిన చర్యలు తీసుకునే చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ, ప్రతి ఏటా జూలై 21వ తేదీన జాతుల సామరస్య దినోత్సవం నిర్వహిస్తున్నప్పటికీ దేశంలో భారతీయులకు, ముఖ్యంగా భారత యువతులను భార్యగా చేసుకున్న వారికి అసలు ఇళ్లు ఇవ్వడం లేదు. ఎందుకంటే భారతీయులు ఇళ్లను శుభ్రంగా ఉంచుకోరని, అద్దెకు ఇళ్లు ఇస్తే పాడు చేస్తారని, ఖాళీ చేసేటప్పుడు ఇంట్లో చెత్తా చెదారాన్ని వదిలేయడమే కాకుండా ఇంటి అద్దె, కరెంట్, వాటర్ బిల్లులను ఎగవేసి పోతారని స్థానిక ప్రాపర్టీ యజమానుల దురభిప్రాయం.



అద్దెకున్న ఓ భారతీయ కుటుంబం ఇంటిని దెయ్యాల కొంపలాగా చేసి ఖాళీచేసిన ఉదంతం గురించి ఎప్పుడో ఓ స్థానిక పత్రికలో వచ్చిన కథనం ఒకటి స్థానికంగా ఎక్కువ ప్రచారం అవడంతో అప్పటి నుంచి భారతీయులకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ప్రాపర్టీ యజమానులు అంగీకరించడం లేదని డేరియస్ చీయుంగ్ తెలిపారు. చైనా కుటుంబాల గురించి కూడా ఇలాంటి కథనాలే ప్రచారంలో ఉన్నాయి. ఈ కథనాలు నిజంగా జరిగాయా, అందరు అలాగే ఉంటారా? అన్న విషయాన్ని ఆలోచించకుండానే స్థానికులు భారతీయులు, చైనీయుల పట్ల వివక్ష చూపుతున్నారు.



మొత్తం 55 లక్షల జనాభా కలిగిన సింగపూర్‌లో 9.1 శాతం మంది భారతీయులు ఉన్నారు. 55 లక్షల్లో 39 లక్షల మంది స్థానిక శాశ్వత నివాసితులుకాగా, మిగతా వారు విదేశీయులు. భారతీయులు, చైనీయుల అద్దె ఇల్లు కష్టాలను తొలగించేందుకు, తనకెదురైనా అనుభవం మరొకరికి ఎదురుకాకూడదనే సదుద్దేశంతో డేరియస్ చీయుంగ్ ‘99.కామ్’ అనే వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేశారు. ‘అన్ని జాతులకు స్వాగతం. జాతి, సంస్కృతులతో సంబంధం లేకుండా అన్ని దేశస్థుల వారికి అద్దె ఇళ్లు చూపిస్తాం. ఇప్పిస్తాం’ అంటూ ఆ వెబ్‌సైట్ ప్రచారం చేస్తోంది. అద్దె ఇంటి కోసం తాను పడ్డ కష్టాల నుంచే ఈ వెబ్  పోర్టల్ ఆలోచన వచ్చిందని డేరియస్ తెలిపారు. సింగపూర్‌లో 8 శాతం ఇళ్లు ఎప్పుడు అద్దెకు ఖాళీగా ఉంటాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top