20 అణు బాంబుల శక్తి

20 అణు బాంబుల శక్తి - Sakshi


కఠ్మాండు: నేపాల్‌కు తీరని విషాదం మిగిల్చిన శనివారం నాటి భూకంపం అంచనాలకు మించిన శక్తితో ప్రకంపనలు సృష్టించింది. ఈ భూకంపం తీవ్రత ఏకంగా 20 హైడ్రోజన్ బాంబుల విస్ఫోటం వల్ల వెలువడే శక్తికి సమానమని నిపుణులు అంచనా వేశారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా జపాన్‌లోని హిరోషిమా నగరాన్ని తుడిచిపెట్టేసిన అణుబాంబు కన్నా అనేక రెట్లు శక్తిమంతమైన ఇరవై అణు బాంబులు పేలితే ఎంత శక్తి వెలువడుతుందో, కఠ్మాండు లోయను కుదిపేసిన భూకంపం వల్ల కూడా అంత శక్తి వెలువడిందని చెబుతున్నారు. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులోనే ఏర్పడటం కూడా ప్రకంపనల తీవ్రతను పెంచిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.





ఒకవేళ భూకంపం ఇంకా లోతుగా ఏర్పడినట్లయితే భూమిలోకి శక్తి ఇంకిపోయి, ప్రకంపనల తీవ్రత తగ్గేదని వారు తెలిపారు. జనసమ్మర్ధమైన కఠ్మాండు నగరానికి 40 మైళ్ల దూరంలోనే భూకంపం సంభవించడం వల్ల కూడా ప్రాణనష్టం భారీగా పెరిగిందన్నారు. భూకంపాలు సంభవించిన తర్వాత తదనంతర ప్రకంపనలు(ఆఫ్టర్ షాక్స్) రావడం సాధారణమే. అయితే, నేపాల్‌లో భూకంపం వచ్చిన అరగంటకే 6.6 తీవ్రతతో శక్తిమంతమైన ప్రకంపనలు వచ్చాయి. దానితో పాటు మొత్తం 20 సార్లు ప్రకంపనలు రావడంతో అవి స్వల్ప తీవ్రతతో వచ్చినా కూడా భూకంపం కారణంగా అప్పటికే బలహీనమై ఉన్న కట్టడాలు కూడా కుప్పకూలిపోయాయి. అయితే, ఇండియన్, యురేసియన్ భూఫలకాలు కలిసేచోట ఉండటమే నేపాల్‌కు శాపమని, ఈ ఫలకాలు ఢీకొంటుండటం వల్ల హిమాలయాలు సైతం ఏటా కొన్ని మిల్లీమీటర్ల మేరకు ఎత్తు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top