పొంచివున్న ప్రళయం....!

పొంచివున్న ప్రళయం....!


లండన్: భూతాపోన్నతి పెరగడం వల్ల కలిగే వాతావరణ మార్పుల కారణంగా సముద్రాలు ఉప్పొంగి సమీప నగరాలను ముంచేయడం, అకాల తుపానులు విరుచుకు పడడం, జనావాసాలను ధ్వంసంచేసే భూకంపాలు రావడం, మానవులను మృత్యు కళేబరాలుగా మార్చే కరవుకాటకాలు దాపురించడం లాంటి దారుణ పరిస్థితులు సంభవిస్తాయని ఎప్పటి నుంచో శాస్త్రవేత్తలు మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. అలాంటి పరిస్థితులు  సంభవించినప్పుడు చూద్దాంలే! అనే తాత్సార ధోరణిని ఇంతకాలం దేశాధినేతలు అనుసరిస్తూ వచ్చారు.



శాస్త్రవేత్తలు ఇప్పటివరకు వేసిన అంచనాలకన్నా తీవ్రమైన పరిస్థితులే దాపురిస్తాయని వాతావరణ మార్పులపై తాజాగా జరిపిన అతి పెద్ద అధ్యయనం వెల్లడిస్తోంది. దాదాపు 20వేల క్రితం నాటి వాతావరణ పరిస్థితులను ప్రాతిపదికగా తీసుకొని రానున్న పదివేల సంవత్సరాల్లో వాతావరణంలో కలిగే మార్పులను దాదాపు పాతిక మంది శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. యూనివర్శిటీ ఆఫ్ విక్టోరియాకు చెందిన మైఖేల్ ఎబీ నాయకత్వాన జరిగిన ఈ అతి పెద్ద అధ్యయనాన్ని ‘నేచర్ క్లైమేట్ చేంజ్’లో ప్రచురించారు.



 కార్బన్ ఉద్గారాలను అరికట్టడం ద్వారా భూతాపోన్నతి రెండు డిగ్రీల సెల్సియస్‌కు తగ్గించాలనే ప్రపంచ దేశాల లక్ష్యాన్ని నిజంగా సాధించినప్పటికీ ప్రపంచంలో 20 శాతం జనాభా తీర ప్రాంతాలను ఖాళీచేసి వలసపోవాల్సిందేనని తాజా అధ్యయనం తెలియజేస్తోంది. ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకుంటూ కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తూ పోయిన వాటి సానుకూల ప్రభావం కనిపించాలంటే కూడా పదివేల సంవత్సరాలు నిరీక్షించాలని తాజా అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్టవ్‌పై నీటిని వేడిచేసి, ఆ తర్వాత స్టవ్‌ను కట్టేసిన చాలా సేపటి వరకు కూడా నీళ్లు వేడిగా ఉన్నట్లుగానే కార్బన్ ఉద్గారాలను నియంత్రించిన భూతాపోన్నతి అంత త్వరగా తగ్గదని వారు భావిస్తున్నారు.



 భూతాపోన్నతి పరిస్థితులు ఇప్పుడున్నట్లుగానే కొనసాగినట్లయితే పశ్చిమ అంటార్కటికాలో మంచు పలకలు వేగంగా కరగి సముద్ర నీటి మట్టాలు దాదాపు పది అడుగులు అంటే మూడు మీటర్లు పెరుగుతాయని, పర్యవసానంగా న్యూయార్క్, లండన్, షాంఘై నగరాలు పూర్తిగా నీటిలో మునిగిపోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ లక్ష్యం ప్రకారం భూతాపోన్నతిని రెండు డిగ్రీలు తగ్గించినట్లయితే ప్రపంచంలో 20 శాతం తీరప్రాంత ప్రజలు ఖాళీచేయాల్సిందేనని వారు చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి వెయ్యికోట్ల టన్నుల కార్బన్ ఉద్గారాలు వెలువడుతున్నాయని, 1990 దశకంతో పోలిస్తే ఇప్పుడు రెట్టింపు ఉద్గారాలు వెలువడుతున్నాయని వారు తెలిపారు.



ప్రస్తుతం వాతావరణంలో 58 వేల కోట్ల టన్నుల కార్బన్ ఉద్గారాలు ఉన్నాయని, మరో రెండు వేల నుంచి 2,300 సంవత్సరాల నాటికి ఈ ఉద్గారాలు 1,28,000 కోట్ల టన్నుల నుంచి 5,12,000 కోట్ల టన్నుల వరకు పెరగవచ్చని శాస్త్రవేత్తల అంచనాలు తెలియజేస్తున్నాయి. లక్ష్య సాధన దిశగా ప్రపంచం కదిలినట్లయితే మరో 300 సంవత్సరాలకు కార్బన్ ఉద్గారాలను అరికట్టగలమని, అయితే వాటి సానుకూల ఫలితాలు రావాలంటే మాత్రం పదివేల సంవత్సరాలు నిరీక్షించాల్సిందేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. పరిస్థితుల్లో మార్పు తీసుకరానట్లయితే మరో రెండువేల సంవత్సరాల నాటికి సముద్ర మట్టాలు 80 అడుగుల నుంచి 170 అడుగుల వరకు పెరుగుతాయని వారి అంచనా.  సముద్రాలు ఉప్పొంగడం వల్ల భారత్‌తోపాటు సెంట్రల్ అమెరికా, ఆఫ్రీకా, బురుండి, చాడ్, సూడాన్, కాంగో లాంటి దేశాలకు కూడా ముప్పు పొంచి ఉందని మరో అధ్యయనం తెలియజేస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top