30 గంటల్లో 25 సార్లు కంపించిన భూమి

30 గంటల్లో 25 సార్లు కంపించిన భూమి!


ఖాట్మండు: నేపాల్‌లో పరిస్థితి దారుణాతిదారుణంగా ఉంది. క్షతగాత్రులను చూస్తుంటే మనసు కదిలిపోయిందని నేపాల్  ప్రధాని సుశీల్ కోయిరాల ఎంతో బాధతో చెప్పారు. నిన్న, ఈరోజు తెల్లవారుజామున వరుసగా అనేకసార్లు భూమి కంపించింది. గత 30 గంటల్లో నేపాల్లో 25 సార్లు భూమి కంపించింది. నేపాల్‌కు భవిష్యత్తులో భారీ భూకంపాల ముప్పు ఉందని ఎన్జీఆర్ఐ (నేషనల్ జియోగ్రాఫికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్) మాజీ అధ్యక్షుడు హరీష్‌ గుప్తా చెప్పారు.  నేపాల్‌ శిథిలాల నుంచి మృతదేహాలు కుప్పలుతెప్పలుగా బయటపడుతున్నాయి. ఒక్క  నేపాల్ లోయలోనే  వెయ్యి మంది చనిపోయినట్లు సమాచారం.  మొత్తం 2123 మంది ప్రాణాలు కోల్పోయారు.  ఒక్క ఎవరెస్ట్‌ శిఖరంపై 18 మంది చనిపోయారు. భారత్‌లో భూకంపం దాటికి 67 మంది ప్రాణాలు కోల్పోయారు.  చనిపోయిన వారి కుటుంబాలకు మోదీ ప్రభుత్వం 2 లక్షల రూపాయల సాయం ప్రకటించింది.  నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం ఏపీ ప్రభుత్వం కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసింది.



నిన్న వచ్చిన భూకంపానికి నేపాల్ భూమి దద్దరిల్లింది. హిమాలయ పాదాల చెంత భారీ భూకంపం వస్తుందని  హెచ్చరికలు నిజం చేస్తూ నిన్న విరుచుకుపడిన భూకంపానికి  నేపాల్ నరకంగా మారింది.  నేపాల్‌కు మరిన్ని  భూకంపాలు  వచ్చే అవకాశం ఉందని  హరీష్‌ గుప్తా చెప్పారు. ఖట్మాండు నడిబొడ్డున ఠీవీగా తలెత్తుకొని కనిపించే రెండు శతాబ్దాల చరిత్ర గల కట్టడం  దర్హారా టవర్‌ మరుభూమిలా మారిపోయింది. ఎంతో చారిత్రాక నేపధ్యం ఉన్న ఈ టవర్‌ భూకంపంలో పూర్తిగా నేలమట్టమైంది. తొమ్మిది అంతస్తుల దర్హారా కట్టడం కళ్లముందే కాలగర్భంలో కలిసిపోయింది.  మిలటరీ అవసరాల కోసం, పరిసరాలపై నిఘా కోసం నిర్మించిన దర్హారా టవర్‌  నగరానికే ప్రధాన ఆకర్షణగా ఉండేది. 1832లో అప్పటి ప్రధానమంత్రి భీమ్‌సేన్‌  తపా ఆధ్వర్యంలో నిర్మాణమైన దర్హారా టవర్‌ను యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. అయితే ఇంత ఘనచరిత్ర ఉన్న శిఖరం ఇపుడు తుడిచిపెట్టుకుపోయింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top