కాబూల్‌లో ఉగ్రదాడి

కాబూల్‌లో ఉగ్రదాడి


- 80 మంది దుర్మరణం, 231 మందికి గాయాలు  

- హజారాల నిరసన ప్రదర్శనపై ఐసిస్ ఆత్మాహుతి దాడి

 

 కాబూల్ : ఉగ్ర ఘాతుకానికి ఈసారి కాబూల్ బలైంది. అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో శనివారం ఐసిస్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఘటనలో 80 నిండు ప్రాణాలు బలయ్యాయి. 231 మంది గాయాల పాలయ్యారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. అభివృద్ధికి దూరంగా ఉన్న తమ ప్రాంతంలో ప్రధాన విద్యుత్ లైన్ కావాలన్న డిమాండ్‌తో కాబూల్‌లోని దే మజాంగ్ స్క్వేర్ వద్ద శనివారం వేలాదిగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న స్థానిక హజారా వర్గీయులపై ఈ ఉగ్రదాడి జరిగింది. నిరసన ప్రదర్శనపై రెండు చోట్ల ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.



దాంతో ఆ ప్రాంతమంతా చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో భీతావహంగా మారింది. మూడో దాడికి పాల్పడనున్న మరో ఉగ్రవాదిని ఆ లోపే భద్రతా బలగాలు హతమార్చాయి. హజారాల్లో అత్యధికులు ముస్లింలలోని షియా వర్గానికి చెందినవారు కాగా, అఫ్గానిస్తాన్‌లో సున్నీల ప్రాబల్యం అధికం. కాబూల్ ఉగ్రదాడికి పాల్పడింది తామేనని ఐసిస్ ఉగ్రసంస్థ విభాగం తమ వార్తావిభాగం ఆమక్ ద్వారా ప్రకటించింది. ఇది షియాలపై తాము చేసిన దాడిగా అభివర్ణించింది. నిరసన ప్రదర్శనపై దాడి జరిగే సమాచారముందంటూ ఆ ప్రదర్శన నిర్వాహకులను ముందే హెచ్చరించామని అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని అధికార ప్రతినిధి  వెల్లడించారు. దాడిలో ముగ్గురు పోలీసులు చనిపోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయన్నారు.



షియా- సున్నీ వర్గాల మధ్య వైషమ్యాలు పెంచే ఉద్దేశంతోనే ఈ దాడి జరిగిందన్నారు. కాగా, అఫ్గాన్‌లో ఐసిస్ కన్నా బలమైన తాలిబన్.. ఈ దాడిలో తమ పాత్ర లేదని స్పష్టం చేసింది. ఐఎస్ కమాండర్ అబూ అలీ నేతృత్వంలో ఈ దాడి జరిగిందని అఫ్గాన్ నిఘా వర్గం వెల్లడించింది. ఈ దాడిపై అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దాడిని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రపోరులో అఫ్గాన్‌కు భారత్ బాసటగా నిలుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉజ్బకిస్తాన్, తుర్కమెనిస్తాన్, తజకిస్తాన్‌లను అఫ్గాన్‌తో అనుసంధానించే 500 కేవీ విద్యుత్ లైన్‌ను మొదట సెంట్రల్ ప్రావిన్స్ గుండా ఏర్పాటు చేయాలని భావించిన ప్రభుత్వం తరువాత ఆ ప్రతిపాదనను విరమించుకోవడంతో.. అది వివక్షాపూరిత నిర్ణయమంటూ ఆ రాష్ట్రంలోని హజారాలు శనివారం ఈ భారీ నిరసన ప్రదర్శనకు పూనుకున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top