సియాచిన్‌పై పాక్‌ యుద్ధ విమానాలు!

సియాచిన్‌పై పాక్‌ యుద్ధ విమానాలు!


► మన గగనతల ఉల్లంఘనేం జరగలేదు: భారత్‌

► శత్రువు గుర్తుంచుకునే జవాబిస్తాం: పాక్‌ హెచ్చరిక




ఇస్లామాబాద్‌: భారత్‌ సరిహద్దుల్లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌ గ్లేసియర్‌ వద్ద పాకిస్తాన్‌ యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయి. ఈ విషయాన్ని పాకిస్తాన్‌ మీడియా వె ల్లడించింది. ఇరుదేశాల మధ్య తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఎటువం టి ప్రమాదాన్నైనా ఎదుర్కొనేందుకు పాక్‌ ఆర్మీ సిద్ధంగా ఉందని పేర్కొంది.


అయితే.. సియాచిన్‌లో పాక్‌ యుద్ధ విమానాల చక్కర్లు, ఉద్రిక్త పరిస్థితి అంటూ ప్రసారమైన వార్తల్లో వాస్తవం లేదని భారత్‌ స్పష్టం చేసింది. ‘భారత గగనతల పరిధి ఉల్లంఘనేదీ జరగలేదు’ అని భారత వైమానిక దళం వెల్లడించింది. ఏ పరిస్థితుల్లోనైనా తగిన సమాధానం చెప్పేందుకు సిద్ధమేనని సంకేతాలిచ్చింది. వారం క్రిత మే సరిహద్దుల్లోని ఎయిర్‌బేస్‌లను భారత్‌ అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే.



తరతరాలు గుర్తుంచుకునేలా..: పాక్‌

తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్‌ వైమానిక దళ చీఫ్‌ సొహైల్‌ అమన్‌ సరిహద్దుల్లోని స్కర్దు సమీపంలోని ఖాద్రీ ఎయిర్‌బేస్‌ను బుధవారం సందర్శించారు. మిరేజ్‌ యుద్ధ విమానంలో పర్యటించి సరిహద్దుల్లో భద్రత పరిస్థితి సమీక్షించారు. శత్రువు తమ జోలికొస్తే తరతరాలు గుర్తుంచుకునేలా గట్టిగా బదులిస్తామని పరోక్షంగా భారత్‌ను హెచ్చరించారు.


సరిహద్దుల్లోని పాకిస్తాన్‌ ఎయిర్‌బేస్‌లన్నీ అప్రమత్తంగా ఉన్నాయని.. తమ దేశ సరిహద్దులను కాపాడుకోవటంలో ఎలాంటి ఎదురుదాడికైనా దిగుతామని స్పష్టం చేశారు. అటు, ‘పాక్‌ సముద్ర తీరాన్ని కాపాడుకునేందుకు మన నేవీ సిద్ధంగా ఉంది. భారత్‌ రెచ్చగొట్టే చర్యలకు సరికొత్త యుద్ధ సాంకేతికతతో సమాధానమిస్తాం’ అని లాహోర్‌లోని నౌకాదళ యుద్ధ కాలేజీలో పాక్‌ నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ముహమ్మద్‌ జకావుల్లా హెచ్చరించారు. కాగా, పాకిస్తాన్‌ విడుదల చేసిన వీడియో సరైంది కాదని.. పాత వీడియోకు ఎన్నో కత్తిరింపులు (ఎడిట్‌) చేశారని భారత్‌ పేర్కొంది.



భారత పోస్టుల ధ్వంసం: పాక్‌

ఇస్లామాబాద్‌: కశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంట భారత ఆర్మీ పోస్టులకు నష్టం చేకూర్చుతున్నట్లు చూపుతున్న వీడియోను పాకిస్తాన్‌ సైన్యం విడుదల చేసింది. పాక్‌ ఆర్మీ స్థావరాలపై దాడులు చేశామంటూ భారత్‌ మంగళవారం వీడియో విడుదల చేయడానికి ప్రతిగానే పాక్‌ ఇలా స్పందించినట్లు తెలుస్తోంది.


పాక్‌ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ ఆసిఫ్‌ గఫూర్‌ 87 సెకన్ల నిడివి ఉన్న వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేశారు. దాంతోపాటు మే 13న భారత సైన్యం పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపిందని ఆరోపించారు. గట్టి బదులిచ్చేందుకే నౌషేరాలోని భారత శిబిరాలను పాక్‌ సైన్యం నేలమట్టం చేసిందన్నారు. భారీ ఫిరంగులు భారత స్థావరాలను ధ్వంసం చేస్తున్నట్లు వీడియోలో ఉంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top