అమెరికాలో కావలి యువతి మృతి

అమెరికాలో కావలి యువతి మృతి - Sakshi


- వాషింగ్టన్ రాష్ట్రంలో ఘటన

- ఎమ్మెస్ చేసేందుకు యూఎస్ వెళ్లిన ప్రియాంక చౌదరి

- ఇటీవలే సివిల్ ఇంజనీర్‌గా ఉద్యోగం

- ప్రమాదవశాత్తూ సియాటెల్ సరస్సులో మునిగి దుర్మరణం

 

కావలి అర్బన్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. విద్యనభ్యసించిన ప్రాంతంలోనే ఇటీవల ఉద్యోగం కూడా వచ్చింది. ఇంతలోనే మృత్యువు ఆమెను కబళించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి చెందిన గోగినేని ప్రియాంక చౌదరి (25) ప్రమాదవశాత్తూ అమెరికాలోని ఓ సరస్సులో పడి మృత్యువాత పడింది. బుధవారం జరిగిన ఈ సంఘటనపై గురువారం రాత్రి 2 గంటలకు తల్లిదండ్రులకు సమాచారం అందింది. మృతురాలి బంధువుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కావలిలోని వైకుంఠపురం చేవూరివారితోటలో నివాసం ఉంటున్న గోగినేని వెంకటేశ్వర్లు, సత్యవతి దంపతులకు ఇద్దరు పిల్లలు. కాంట్రాక్టర్ అయిన వెంకటేశ్వర్లు పిల్లల చదువులు, కాంట్రాక్ట్ పనుల నిమిత్తం కొన్నాళ్లు హైదరాబాద్‌లో ఉండి మూడు నెలల క్రితమే కావలికి తిరిగి వచ్చారు.



వారి కుమార్తె ప్రియాంక హైదరాబాద్‌లోని జాగృతి కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి 2014లో ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లింది. వాషింగ్టన్ రాష్ట్రం సియాటెల్ నగరంలో నివాసం ఉంటూ లేసీ నగరంలోని సెయింట్ మార్టిన్స్‌వర్సిటీలో చదువుతున్న ప్రియాంకకు సెప్టెంబర్ 1న ఓ కంపెనీలో సివిల్ ఇంజనీర్‌గా ఉద్యోగం కూడా వచ్చింది. ప్రియాంక ప్రతిరోజూ ఉదయం సూర్యోదయం చూసేందుకు సియోటెల్ నుంచి సుమారు కిలోమీటర్ దూరంలోని హైక్స్ సరస్సుకు వెళ్లేది. ఆమెతో పాటు మరికొందరు కూడా వెళ్లేవారు. అయితే బుధవారం ఎవరూ వెళ్లలేదు. ఉదయం సరస్సులో దిగి కొంచెం ముందుకు వెళ్లిన ప్రియాంక నాచుపట్టిన రాయిపై కాలు పెట్టడంతో జారి సరస్సులో మునిగిపోయింది. 



గంటల తరువాత నీళ్లపై తేలియాడుతున్న ప్రియాంక మృతదేహాన్ని చూసిన స్థానిక జాలర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఫోన్ ద్వారా గురువారం తెల్లవారుజామున ప్రియాంక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఉంటున్న వెంకటేశ్వర్లు స్నేహితుడు సుబ్రహ్మణ్యం అక్కడి తెలుగువారి సంఘం (నాట్స్) సహకారంతో ప్రియాంక మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. తమ కుమార్తె మృతదేహం త్వరగా ఇండియా చేరుకునేలా ప్రధాని, విదేశాంగ శాఖ మంత్రితో పాటు జిల్లాకే చెందిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబులు సహకరించాలని వెంకటేశ్వర్లు కుటుంబం, వారి బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top