ఫేస్బుక్ వాడకం తగ్గుతోంది!

ఫేస్బుక్ వాడకం తగ్గుతోంది! - Sakshi


కాలేజికి వెళ్లే పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ఫేస్బుక్ ఆన్ చేయడం, స్నేహితులతో చాట్ చేయడం. ఇదే పని అనుకుంటున్నారు కదూ. కానీ మీ ఆలోచన తప్పు. టీనేజర్లలో ఫేస్బుక్ వాడకం బాగా తగ్గిపోతోందట. దానికి బదులు ఇతర ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ల మీద పడుతున్నారట. ఈ విషయం 30 దేశాల్లోని 1.70 లక్షల మంది ఇంటర్నెట్ వాడకందారుల మీద చేసిన పరిశోధనలో వెల్లడైంది. అమెరికా, బ్రిటన్ దేశాల్లోని 16-19 ఏళ్ల మధ్య వయసున్న టీనేజర్లలో దాదాపు 66 శాతం మంది తాము ఫేస్బుక్ వాడకం బాగా తగ్గించేసినట్లు చెప్పారు. అయితే దీన్ని పూర్తిగా ఇంకా వదిలిపెట్టలేదు గానీ, ప్రస్తుతానికి వాడకం అయితే బాగా తగ్గించారు.



ఫేస్బుక్ వాడకందారుల సంఖ్య ఎక్కువగానే ఉన్నా, ఫొటోలు షేర్ చేయడం, మెసేజిలు ఇచ్చి పుచ్చుకోవడం లాంటివి గత రెండేళ్లలోనే దాదాపు 20 శాతం తగ్గిపోయిందని సర్వేలో వెల్లడైంది. తమ స్నేహితులు ఇన్స్టాగ్రామ్, ఇతర మెసేజింగ్ యాప్లలోకి వెళ్లిపోయారు కాబట్టి ఇక తాము కూడా ఇప్పుడు ఫేస్బుక్ పెద్దగా వాడటం లేదని సుమారు 30 శాతం మంది టీనేజర్లు చెప్పారు. ఫేస్బుక్ మెసెంజర్ కంటే కూడా ఎక్కువ మంది వాట్సప్ లాంటి వాటినే ఉపయోగిస్తున్నారు. దాంతో ఫేస్బుక్ యాక్టివ్ యూజర్ల సంఖ్య బాగా పడిపోయింది. ఎక్కువ మంది అయితే స్నాప్చాట్ యాప్ను ఉపయోగిస్తున్నారు. అమెరికా, బ్రిటన్, కెనడాలలో 25 నుంచి 40 శాతం మంది ఆన్లైన్ టీనేజర్లు దీన్నే ఉపయోగిస్తున్నారట.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top