వేల కోట్ల రూపాయలు పాయే!

వేల కోట్ల రూపాయలు పాయే!


శాన్‌ఫ్రాన్సిస్కో: మనం ఇప్పుడు చేసిన తప్పులకు జీవితంలో ఎప్పుడో బాధ పడాల్సిన అవసరం రావచ్చు. కానీ 29 ఏళ్ల క్రిస్ హిల్ స్కాట్ ఎప్పుడో చేసిన తప్పుకు ఇప్పుడు బాధ పడుతున్నారు. ‘నా జీవితంలో ఇలాంటి తప్పు ఎన్నడూ చేయలేదు’ అని వాపోతున్నారు. అంతలా ఆయన బాధ పడడానికి మరి ఆయన చేసిన తప్పు అలాంటిది ఇలాంటిది కాదు. వేల కోట్ల రూపాయలు కోల్పోయిన తప్పు.




క్రిస్ హిల్ వ్యవస్థాపక డెరైక్టర్‌గా పనిచేసిన కంపెనీ ‘స్విప్ట్‌కీ’నీ తన తోటి వ్యవస్థాపకులైన జాన్ రొనాల్డ్ (30), బెన్ మెడ్‌లాక్ (36)లు గురువారం నాడు ‘మైక్రోసాఫ్ట్’ కంపెనీకి అమ్మేశారు. తద్వారా వారికి చెరో 2,500 కోట్ల రూపాయలు వచ్చాయి. క్రిస్ హిల్‌కు మాత్రం ఒక్క పైసా రాలేదు. కారణం కంపెనీ డెరైక్టర్ పదవికి ఆదిలోనే రాజీనామా చేశారు. తన వాటాను కూడా ఇద్దరు మిత్రులకు అప్పగించి అలా వచ్చిన సొమ్ముతో ఓ సైకిల్ కొనుక్కున్నారు.




నేడు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల కోట్ల స్మార్ట్ ఫోన్లలో, ట్యాబ్స్‌లో విరివిగా ఉపయోగిస్తున్న ‘స్విప్ట్‌కీ యాప్’ను తయారు చేసిందీ స్విప్ట్‌కీ కంపెనీయే. మరి ఇంతటి భవిష్యత్తుగల కంపెనీ నుంచి మన క్రిస్ ఎందుకు బయటకు వచ్చారంటే...ఫొటోగ్రఫీ పట్ల ఏర్పడిన మమకారం ఒకటైతే. ఎక్కువ గంటలపాటు నిర్విరామంగా పనిచేయడం ఇష్టం లేకపోవడం మరో కారణం. లండన్‌లోని బకింగ్‌హమ్‌షైర్‌కు చెందిన క్రిస్, రెనాల్డ్స్, మెడ్‌లాక్‌లతో కలసి కేంబ్రిడ్జి యూనివర్శిటీలో చదుకున్నారు. రెనాల్డ్స్ స్కూల్ నుంచి కూడా క్రిస్ క్లాస్‌మేటే.




యూనివర్శిటీ చదువు పూర్తయ్యాక ఈ ముగ్గురు కలసి ‘స్విప్ట్‌కీ’ అనే సాఫ్ట్‌వేర్ డెవలప్‌చేసే కంపెనీని స్థాపించారు. క్రిస్ దానికి వ్యవస్థాపక డెరైక్టర్‌గా పనిచేశారు. కొంతకాలానికే ఆయనకు నిర్విరామంగా పనిచేయడం విసిగేసింది. ఆరు నెలలకూడా తిరక్కముందే తనకిష్టమైన ఫొటోగ్రఫీ వృత్తిని చేపట్టేందుకు ఉద్యోగానికి రాజీనామా చేశారు. తన వాటను మిత్రులకు అమ్మేశారు. అలా వచ్చిన సొమ్ము ఆయన సైకిల్ కొనుక్కునేందుకే సరిపోయింది. కొన్నేళ్లు ఫొటోగ్రాఫర్‌గా పనిచేసిన క్రిస్ ఇప్పుడు ప్రభుత్వ వెబ్‌సైట్ల డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఏడాదికి యాభై లక్షల రూపాయల ఆదాయం వస్తోంది.




ప్రపంచంలో 47 దేశాల్లో అగ్రగామిగా ఉన్న ‘స్విప్ట్‌కీ యాప్’ ప్రస్తుతం వంద భషల్లో అందుబాటులో ఉంది. ‘ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ’తో పనిచేసే ఈ యాప్‌ను ఉపయోగించడం వల్ల మనం టైప్‌చేసే శ్రమ గణనీయంగా తగ్గుతుంది. రెండు, మూడు లెటర్స్‌ను టైప్‌చేయగానే తర్వాత వచ్చే లెటర్‌ను యాప్ ముందుగానే పసిగట్టి ఆ లెటర్‌ను అదే టైప్ చేస్తుంది.


ఇలా పదాలనే కాకుండా సామెతలు, నానుడిలను కూడా ముందే ఊహించి టైప్ చేస్తుంది. స్సెల్లింగ్ తప్పులను కూడా అదే సరిచేసుకుంటుంది. స్లైడిండ్ పద్ధతిలో కూడా మనం అవసరమైన సమాచారాన్ని సులువుగా టైప్ చేయవచ్చు. దీని వల్ల మనకు ఎంతో సమయం ఆధా అవడమే కాకుండా శ్రమకూడా గణనీయంగా తగ్గుతుంది. ఈ యాప్ వల్ల లక్ష సంవత్సరాల టైపింగ్ సమయాన్ని, పదివేల కోట్ల కీ స్ట్రోక్స్‌ను ఆదా చేయవచ్చని ‘స్విప్ట్‌కీ’ కంపెనీ అంచనాకట్టింది.

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top