వర్ణవివక్షకు తావులేదు

వర్ణవివక్షకు తావులేదు - Sakshi


కాన్సస్‌ ఘటనను ఖండించిన భారతీయ–అమెరికన్లు

► ఘటన విద్వేషపూరితమే: కాంగ్రెస్‌ సభ్యుడు అమీ బెరా

► మరో కూచిభొట్ల చనిపోకముందే మేల్కొందామన్న బార్‌ అసోసియేషన్




వాషింగ్టన్ : అమెరికాలోని కాన్సస్‌లో బుధవారం రాత్రి భారత ఇంజనీర్లపై జరిగిన కాల్పుల ఘటనను భారత–అమెరికన్  సమాజం ముక్తకంఠంతో ఖండించింది. అమెరికాలో వర్ణవివక్ష, విదేశీయులంటే భయం వంటి వాటికి తావులేదని.. భారత అమెరికన్  కాంగ్రెస్‌ సభ్యుడు అమీ బెరా తెలిపారు. ‘కాన్సస్‌ దుర్ఘటనకు సంబంధించి విచారణ సంస్థలు విచారణ జరిపి వాస్తవాలను వెల్లడిస్తాయని భావిస్తున్నాను.


అమెరికాలో విదేశీయులంటే భయం, వర్ణవివక్షలకు చోటులేదు. ఇప్పటివరకు వెల్లడైన వివరాల ప్రకారం.. విద్వేషపూరితంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇది అమెరికన్లందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది’ అని అమీ బెరా వెల్లడించారు. వలసవాదుల దేశంగా ఉన్న అమెరికాలో.. వ్యక్తుల రంగు, వారి రూపురేఖల ఆధారంగా దాడి చేయటం అమానుషమని ఆయన అన్నారు. మృతుడు శ్రీనివాస్‌ కూచిభొట్ల కుటుంబానికి అండగా నిలబడతామని అమీ బేరా తెలిపారు. మూడుసార్లు కాలిఫోర్నియా నుంచి కాంగ్రెస్‌కు ఎన్నికైన అమీ బెరా.. భారతీయ అమెరికన్లపై అమెరికా కాంగ్రెస్‌ కమిటీకి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.


నోర్మూసుకుని కూర్చోవద్దు: సాబా

కాన్సస్‌ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరగాలని బాధితులకు, వారి కుటుంబాలకు న్యాయం జరగాలని దక్షిణాసియా బార్‌ అసోసియేషన్  (ఎస్‌ఏబీఏ–సాబా) డిమాండ్‌ చేసింది. అమెరికాలో మైనారిటీల హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వమే తీసుకుని పక్కాగా అమలుచేయాలని ఓ ప్రకటనలో  కోరింది.


‘ఈ ఘటనపై మనం నోర్మూసుకుని కూర్చోవద్దు. ఎవరినీ క్షమించొద్దు. నిరాశ చెందొద్దు. మన దేశం (అమెరికా)లో వేళ్లూనుకుపోయిన విద్వేషం, విడగొట్టి చూసే ఆలోచనలను కూకటివేళ్లతో పెకిలించివేయాలి. మరో కూచిభొట్ల శ్రీనివాస్‌ తన ప్రాణాన్ని కోల్పోకముందే మేల్కొనాలి’ అని పేర్కొంది. కాన్సస్‌ ఘటన దురదృష్టకరమని.. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ జరుగుతోందని కాన్సస్, మిస్సోరీ రాష్ట్రాల గవర్నర్లు చెప్పారు.



ట్రంప్‌తో భారత రాయబారి భేటీ

అమెరికాలోని భారత రాయబారి నవతేజ్‌ సర్నా వైట్‌హౌస్‌లోని ఓవల్‌ ఆఫీసులో అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయ్యారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక సర్నా ఆయనను కలుసుకోవడం ఇదే తొలిసారి. అమెరికాలో భారతీయులు సహా పలువురు విదేశీయులపై విద్వేష దాడులు జరుగుతున్న నేపథ్యంలో సర్నా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top