ఇలా కూడా సాయం చేయొచ్చు!

ఇలా కూడా సాయం చేయొచ్చు! - Sakshi


కించిత్తు మానవత్వం ఉండాలేగాని తోటివారికి ఎలాగైనా సాయం చేయవచ్చు. ఈ ఫొటో చూస్తే ఇలా కూడా సాయం చేయవచ్చని ఎవరికైనా అనిపిస్తుంది.కెనడాలోని ఒట్టారియో నగరంలో రద్దీగా వెళుతున్న ఓ బస్సులో గాడ్‌ఫ్రే క్యుహొట్టో అనే 22 ఏళ్ల విద్యార్థి ఓ వయో వృద్ధుడికి తన పక్కనే సీటివ్వడమే కాకుండా చేతులతో ఆసరా ఇచ్చి కునుకుతో సేదతీరేందుకు తన భుజాన్ని కూడా ఆసరగా అందించిన ఈ దృశ్యం ప్రస్తుతం సోషల్ వెబ్‌సైట్‌లో విశేషంగా ఆకర్షిస్తోంది.


ఇటీవల ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఈ ఫొటోను ఇప్పటికే 50 వేల మంది యూజర్లు లైక్ చేశారు. పదివేల మంది షేర్ చేసుకున్నారు. వేలాది కామెంట్లు వచ్చాయి. విద్యార్థి ఆసరాతో హాయిగా కునుకుతీస్తున్న  వయో వృద్ధుడిని రాబర్ట్‌గా గుర్తించారు. ఆయనకు బ్రహ్మ చెవుడే కాకుండా మానసిక పక్షవాతంతో బాధ పడుతున్నారు. విద్యార్థి కూర్చోవడానికి సీటివ్వడంతో కృతజ్ఞతా పూర్వకంగా చేతులు పట్టుకున్నారు. అలాగే ఆ చేతులను, విద్యార్థి భుజాలను ఆసరాగా చేసుకొని హాయిగా నిదురపోయారు ఆ వృద్ధుడు.




 ఆ విద్యార్థి ఏ మాత్రం విసుక్కోకుండా అలాగే కదలకుండా కూర్చొని వృద్ధుడికి స్వాంతన చేకూర్చారు. ముందుగా కరచాలనం కోసం చేతిని అందించారని అనుకున్నానని, తర్వాత ఆయన వృద్ధాప్యంతోనే కాకుండా అనారోగ్యంతో బాధ పడుతున్నానని గ్రహించానని హమిల్టన్‌లోని మ్యాక్‌మాస్టర్ యూనివర్శిటీలో చదువుతున్న గాడ్‌ఫ్రే తెలిపారు. తోటి విద్యార్థుల్లో ఒకరు ఈ దృశ్యాన్ని సెల్‌ఫోన్లో బంధించి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.




 ‘బ్యూటిఫుల్ అండ్ పర్‌ఫెక్ట్’ అంటూ ఎంతోమంది కామెంట్ చేశారు. ‘కొన్ని సమయాల్లో నీవు స్వార్ధం వదులుకోవాలి. ఎవరికో ఒకరికి నీ భుజాలు ఆసరా అవుతాయి’ అని కొందరు,  రాజకీయాలను కరీర్‌గా ఎంచుకోవాల్సిందిగా మరికొందరు సూచించారు. తామేమి చేయాలో చేసి చూపించావనే అర్థంలో ఇంకొందరు కామెంట్ చేశారు.


ఆ వయో వృద్ధుడి కుటుంబ సభ్యులు కూడా ఆ విద్యార్థికి అభినందనలు తెలిపారు. ‘ఇందులో నాగొప్పేమీ లేదు. నా తల్లి నన్నలా పెంచింది. ఓ రాణి చేతిలో నేను పెరిగాను’ అని గాడ్‌ఫ్రే స్థానిక రేడియో స్టేషన్‌తో వ్యాఖ్యానించారు.

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top